తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ 19వ రోజుకు చేరింది. రాష్ట్ర క్యాబినెట్ లాక్ డౌన్ సడలింపు సమయాన్ని పెంచుతూ ఆమోదం తెలపడంతో ఈరోజు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అనవసరంగా రోడ్ల పైన తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో కూకట్ పల్లి జె.ఎన్.టి.యు చెక్ పోస్ట్, వై జంక్షన్, సనత్ నగర్, బాలానగర్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్.
ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రతి ఒక్క షాప్ ,ఆఫీసులు మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయాలన్నారు. రేపటి నుండి లాక్ డౌన్ మరింత కఠినంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
జిహెచ్ఎంసి పరిధిలో పెట్రోల్ బంకులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరచి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ల్యాండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయలకు, రిజిస్ట్రేషన్ కోసం వెళ్లే వారు స్లాట్ సరైన సమయానికి బుక్ చేసుకుని దానికి సంబంధించిన పత్రాలు చూపించినపుడే అనుమతి.
గూడ్స్ వెహికల్స్ రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అలా కాకుండా అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని కమిషనర్ తెలిపారు.
ప్రజలందరూ తమకు సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. సీపీ వెంట సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, కూకట్ పల్లి ఏసీపీ సురేందర్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంటీఓ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.