రాయలసీమ సిద్ధేశ్వరం అలుగు… రేపు స్మారక దీక్ష

(బొజ్జా దశరథరామిరెడ్డి)

కర్నూలుకు పక్కనే కృష్ణమ్మ నిండుగా బిరాబిరా పారుతుంటుంది…
ఎంతగా అంటే కొన్ని వందల TMC ల నీరు వృధాగా సముద్రంలో కలిసేంతగా…అయినా సీమకు నీటి కరువే…

గొంతెండి పోతున్నా త్రాగడానికి గుక్కెడు నీరు కూడా దక్కని పల్లెలు ఎన్నో ఈ కరువుసీమలో… దీనికి కారణం ఒకవైపు పాలకుల స్వార్థ రాజకీయాలు అయితేఇంకొకవైపు సీమ ప్రజలలో చైతన్యం లోపించడం.

ఇది ఈరోజు వచ్చిన సమస్య కాదు.
దశాబ్దాలుగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయం.

అధికారం కోసం అన్నీ చేస్తామని ప్రగల్భాలు పలికే రాజకీయ పార్టీలు అధికారం అనే సింహాసనం అధిష్టించగానే కొండ అవతలి వారికి దాసోహమే తప్ప కరువుసీమకు ఏం చేసింది లేదు.

దశాబ్దాలుగా సీమకు సాగు, త్రాగునీటిలో ఇంత అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేక సీమ రైతు కరువు రక్కసి బాహుల్లో చిక్కుకుని బక్కచిక్కి పోతున్న సందర్భంలో…

కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమ ప్రాంతం పచ్చని పైర్లతో కళకళలాడాలంటే సిద్దేశ్వరం అలుగే శరణ్యమని, సిద్దేశ్వరం అలుగు సాధించుకోవాలంటే ప్రజలలో చైతన్యం తీసుకురావాలని భావించిన రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమలోని అన్ని ప్రజా సంఘాలను సంఘటితం చేసి, రాయలసీమ వాడవాడలో చైతన్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టి సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన మే 31,2016 న కొన్ని వేలమంది రైతులతో ప్రజా శంఖుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు.

ఇదొక సంచలనం…

సిద్ధేశ్వరంనకు చేరే మార్గాలన్నిటినీ ప్రభుత్వం దిగ్భందనం చేసినా, కొన్ని వేలమందిని సిద్దేశ్వరం చేరుకోకుండా రహదారులకు అడ్డంకులు సృష్టించినా మొక్కవోని దీక్షతో వేలాదిమంది చేత సిద్దేశ్వరం అలుగు శంఖుస్థాపన జరిగింది. ఆ ప్రజా శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వేలాదిమంది ప్రజలలో కొత్త చైతన్యం వెల్లివిరిసింది. ఆ మహత్తర ఘట్టంలో తమ భాగస్వామ్యం లేకపోయిందనే బాధ బయట ఉన్న కొన్ని వేలమందిలో కనిపించింది.

తమ హక్కుల కోసం, తమ భావి తరాలకు సాగు,త్రాగునీరు అందించాలన్న తపన, ప్రజలలో వెల్లివిరిసిన ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ తదనంతర కాలంలో సీమలో మరెన్నో ఉద్యమాలకు తెరలేపింది.

ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో ప్రతి సంవత్సరం మే 31 న సిద్దేశ్వర అలుగు శంఖుస్థాపన వార్షికోత్సవం సీమలోని అన్ని ప్రజా సంఘాలు మరియు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతోంది.

బొజ్జా దశరథరామిరెడ్డి

అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సిద్దేశ్వరం అలుగు సాధన కోసం మరో ప్రజా ఉద్యమ పోరాటం నిర్వహించాలని ఉన్నా ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రజలెవరూ బయటకు రాలేని పరిస్థితుల నేపథ్యంలో మనమందరం ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 31 న మన కుటుంబ సభ్యులతో కలిసి రాయలసీమ గృహ సత్యాగ్రహం చేపట్టి మన హక్కుల సాధనకై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి.

 

ఈ రాయలసీమ గృహ సత్యాగ్రహాన్ని ప్రజలకు చేరవేసి వాడవాడలా నిర్వహించి ఈ రాయలసీమ గృహ సత్యాగ్రహ దీక్షను కుటుంబ సభ్యులతో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.

(బొజ్జా దశరథరామిరెడ్డి,అధ్యక్షులు,రాయలసీమ సాగునీటి సాధన సమితి,నంద్యాల.9848040991.)

One thought on “రాయలసీమ సిద్ధేశ్వరం అలుగు… రేపు స్మారక దీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *