తెలంగాణ లో టిఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తున్నదని, కరోనా సంక్షోభం తర్వాత ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇపుడు జరుగుతన్న తెలుగుదేశం పార్టీ డిజిటిల్ మహనాడులో తీర్మానం ప్రవేశపెట్టారు. మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, పార్టీ నాయకుడు గండ్రోతు శ్రీనివాసరావు, కూరపాటి వెంకటేశ్వర్లు బలపర్చారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీర్మానాన్ని ఆమోదించారు.
వివరాలు:
కాట్రగడ్డ ప్రసూన ప్రతిపాదన: తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులపై సిగ్గుపడుతున్నాం, ప్రజారోగ్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. తెలుగుదేశం హయాంలో గాంధీ ఆసుపత్రిలో 1700 పడకలతో అభివృద్ధి చేశాం. అక్కడ ఇప్పడు 43వేలమంధికి చికిత్స చేస్తున్నారు. నాడు నిర్మించిన గచ్చిబౌలి స్టేడియం అతిధిగృహాన్ని టిమ్స్ గా మార్చడంతో 2,300మంది కరోనా రోగులకు సేవలందుతున్నాయి. ఇది చంద్రబాబు భిక్షే. కోటిలో 300పడకలతో వైద్యం అందిస్తున్నారు. ఇఎన్ టి, ఇఎస్ఐ, జార్జి ఆసుపత్రిని పునరుద్దరించిన ఘనత చంద్రబాబుదే. నాడు చంద్రబాబు సేవల గురించి తెలంగాణా గర్విస్తోంది. నేడు లాక్డౌన్ తో అర్థాకలితో అలమటిస్తున్నా కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల బిల్లులు వేస్తూ దోచుకుంటున్నారు. ఒక ఆసుపత్రిలో కరోనా చికిత్సకు 74లక్షల బిల్లు వేశారు. గర్భణీ ఆసుపత్రిలో బెడ్ దొరక్క చనిపోతే అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదు. 108 వాహనం వద్దే మరో గర్బణీ స్త్రీ మృతిచెందింది.గతంలో కరోనాతో 7శాతం ప్రజలు ఆసుపత్రికి వెళ్తుంటే ఇప్పుడు 17శాతం ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఎక్కడా పారిశుద్ధం లేదు, ఒకే బాత్రూమ్ 30మంది వాడుతున్నారు. భాగ్యనగరాన్ని అభాగ్య నగరంగా మారుస్తున్నారు. ప్రైవేటు టీచర్లు ఉద్యోగాల్లేక కాటికాపరులా మారుతున్నారు. చంద్రబాబు అధికారం ఉంటే మా బాగోగులు చూసుకునే వారని అనుకుంటున్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రావాలి. తెలంగాణాలో మెరుగైన వైద్యసౌకర్యాలపై దృష్టిపెట్టాలి.
చంద్రబాబు నాయుడు: “తెలంగాణాలో వైద్య సదుపాయాలను మెరుగుపర్చేందుకు నిర్మాణాత్మకంగా కృషిచేశాం. గాంధీ ఆసుపత్రిని యుద్దప్రాతిపదికన నిర్మించాం. నిజామ్ ఆసుపత్రిని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. గాంధీ, ఉస్మానియాలను అభివృద్ధి చేశాం. హెల్త్ టూరిజం ను ప్రోత్సహించాం, దానివల్ల పెద్దఎత్తున ఆసుపత్రులు వచ్చాయి. ఈరోజు క్లిష్ట సమయంలో పేదప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై ముందుకు సాగాలి,” తీర్మానాన్ని ఆమోదిస్తూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.