తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత (కడివెండి) నల్ల వజ్రమ్మ సంస్మరణ

నేడు నాలుగవ వర్ధంతి…
(వడ్డేపల్లి మల్లేశము)

ఇతరుల చరిత్రలు చదవడంతో పాటు తమకంటూ ఓ చరిత్రను నిర్మించుకోవాలని భారత తొలి ప్రధాని అన్న మాటలు అక్షర సత్యాలు. ఆ మాటలను నిజం చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరోచిత పాత్రను పోషించిన నల్ల నరసింహులు, నల్ల వజ్రమ్మ ధన్య జీవులు అనడంలో సందేహం లేదు.

హైదరాబాద్ సంస్థానాధీశుడు నిజాం నవాబు పరిపాలనలో గ్రామీణ వ్యవస్థ మొత్తము భూస్వాములు, జమీందార్లు దేశ్ముఖ్లు ,సర్దేశాయి యొక్క ఆధీనంలో ఉండడంతో పాటు సామాన్య ప్రజానీకం పైన వారి గుండాలు, రజాకార్లు, సైన్యం జరిపిన అరాచకాలు, అకృత్యాలు, అత్యాచారాలు, వివక్షత, తో పాటు వెట్టిచాకిరి ని బలవంతంగా అమలు చేయించుకొని దోపిడిని ప్రశ్నించిన వారిని హింసించి చంపిన సందర్భాలు కడు దయనీయం.

ముఖ్యంగా వరంగల్ జిల్లా జనగామ తాలూకా లోని విస్నూరు, పాలకుర్తి, కడివెండి ప్రాంతాల భూస్వాముల అరాచకత్వం తో ఇక్కడ జరిగిన ప్రజా పోరాటం చారిత్రాత్మకం గా నిలిచిపోయింది. కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో సంఘాలను ఏర్పరిచి ముఖ్యంగా కడివెండి ప్రాంతంలో స్థానికుడైన నల్లా నర్సింహులు నాయకత్వంలో 100 స్థానిక దళాలు ఉండగా 20 కేంద్ర దళాలు ఈ ప్రాంత భూస్వాములు రజాకార్లు పోలీసుల దౌర్జన్యాలను ఎదిరించినట్లు ఈ ఉద్యమానికి నల్ల నరసింహులు నాయకత్వం వహించినట్లు గా చరిత్ర చెబుతుంది.

“గతం, వర్తమానం, భవిష్యత్తు ల వివరణ చరిత్ర” అని చరిత్రకారులు నిర్వ
చించినట్లు ఈ ప్రజా ఉద్యమంలో అనేక మంది పురుషులతో పాటు వేలాది మంది మహిళలు కూడా దళ సభ్యులు ఉప దళ సభ్యులు సాంస్కృతిక దళాల సభ్యులుగా పనిచేసి ప్రజా చైతన్యానికి, దళాల రక్షణకు సమాచారాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారు ఎందరో. చరిత్ర మరచిన వీరి సాహస గాథలను వెలికి తీయవలసిన అవసరం ఉన్నది.

కడవెండి గ్రామానికి చెందిన నల్ల నరసింహులు జీవిత భాగస్వామి నల్ల వజ్రమ్మ. ఆమె సాయుధపోరాటం లోనూ,జీవితంలో భాగస్వాములుగా భర్తతో కలిసి ఉద్యమాన్ని నిర్మించిన క్రమం ఎంతో ఆదర్శవంతమైనది.

1942 నుండి సాయుధ పోరాటం ముగించిన 1952 వరకు నల్ల వజ్రమ్మ పోషించిన పాత్ర నాటి తోటి సహచర మహిళలకు ఉద్యమ కార్యకర్తలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది.

కడివెండి గ్రామం లో ఈమె నాయకత్వంలో జరిగిన చైతన్య కృషికి స్థానిక మహిళలు సహకరించడంతో మహిళా దళాలను ఏర్పాటు చేసుకుని సాంస్కృతిక బృందాలు గా పాటలను పాడుతూ, chuttukamudu ఆడుతూ, బుర్రకథ, గొల్ల సుద్దుల తో గ్రామాలలో పటిష్టమైన రక్షణ వ్యవస్థను నిర్మించుకున్నారు.

దళ సభ్యురాలిగా పని చేసిన నల్ల వజ్రమ్మ భర్త తెలంగాణ టైగర్ నల్ల నరసింహులు.దళం స్థాయిలో దళ కార్యకలాపాలను నిర్వహిస్తూ గర్భవతిగా ఉన్న తాను కార్యకలాపాలకు ఆటంకం అని భావించి గర్భస్రావము చేయించుకొని చురుకైన పాత్ర పోషించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

1946 జూలై 4వ తేదీన విసునూరు దేశముఖ్ గుండాల దాడిని తిప్పికొట్టడానికి ర్యాలీగా బయలుదేరిన సంఘం కార్యకర్తలపై కడివెండి గ్రామం లో గుండాలు జరిపిన కాల్పుల్లో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడు. దీనితో ప్రజా ప్రతిఘటన 1947 సెప్టెంబర్ 11 నుండి 1951 అక్టోబర్ వరకు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా చరిత్రలో అనేక గ్రామాలు తిరుగుతూ మహిళలను చైతన్యవంతం చేస్తూ పోలీసులు, రజాకార్లను, గుండాలను రాళ్లతో, రోకలి బండలు, కారంపొడి తో తరిమికొట్టిన ఘటనల్లో పాల్గొన్నారు. ఎర్రగొల్లపహాడ్ కు చెందిన పుట్నాల రామక్క, కడివెండి గ్రామానికి చెందిన చాకలి యాకమ్మ , షేరమ్మ, వెంపటి గ్రామానికి చెందిన మేదర బోయిన లచ్చవ్వ పెద్ద తండాకు చెందిన పుల్లమ్మ వంటి అనేకమంది మహిళలకు ధైర్యాన్ని స్ఫూర్తిని నూరిపోసింది నల్ల వజ్రమ్మ.

తన ఊరు అత్తగారి ఊరు కడివెండి గ్రామమే కావడంతో పోలీసుల గుండాల రజాకార్ల నిఘా నిరంతరం ఉన్నప్పటికీ పట్టుదలతో తప్పించుకొని తమ కుటుంబాలు ధ్వంసమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో గ్రామాలలో పర్యటించి, ఓదార్చి, ధైర్యాన్ని నూరిపోసి, పోరాటంలో శిక్షణ ఇచ్చినటువంటి ఘనత నల్ల వజ్రమ్మ కు దక్కింది.

కడివెండి గ్రామంలో పోలీసులు గుండాలు రజాకార్లు 400 మందికి దాడి చేయడంతో పాటు నల్ల నరసింహులు ను పట్టి ఇవ్వమని హింసాకాండకు పూనుకున్నప్పుడు ప్రక్క గ్రామాలలో నరసింహులు రక్షణ తీసుకుంటే భార్య వజ్రమ్మ కడవెండి గ్రామంలోనే ముస్లింలు ,ఇతరుల సహాయంతో రక్షణ తీసుకుని వారి బారిన పడకుండా తనను, ఉద్యమాన్ని కాపాడుకున్నది.

పోలీసుల ఒత్తిడి తీవ్రమై నందున మేనమామ ఇంట్లో 15 రోజులు ఉండి ఆ తర్వాత రఘునాథపల్లి లో బండి ఎక్కి  వజ్రమ్మ  షోలాపూర్ వెళ్ళిపోయి తప్పించుకున్నది.

నాటి గెరిల్లా పోరాటం లోని మూల సూత్రం దళాలు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి కదులుతూ శత్రువు యొక్క కదలికలను అంచనావేయడం, శత్రువు బలం పెద్దగా ఉన్నప్పుడు తిరోగమన పద్ధతిలో సంచరించడం వంటి విషయాలలో దళ సభ్యురాలిగా వజ్రమ్మ ఉద్యమాన్ని కాపాడుతూనే తనను తాను రక్షించుకుని ఎంతటి త్యాగానికైనా అనేకసార్లు సిద్ధపడింది.

గ్రామ రాజ్యాల స్థాపన, పేదవారికి భూముల పంపకం విషయంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రాంతంలో జరిగినటువంటి పంపకాల కార్యక్రమంలో పురుషులతో పాటుగా నల్ల వజ్రమ్మ కూడా కడవెండి, దేవరుప్పుల కామారెడ్డి గూడెం, మొండ్రాయి, రామవరం ,రామన్నగూడెం ,ధర్మాపురం, పాకాల ముత్తారం, పోచంపల్లి, రంగాపురం, పాలకుర్తి వంటి అనేక గ్రామాలలో పాల్గొని అటు దళానికి ఇటు ప్రజలకు బాసటగా నిలిచినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది.

భూమి , భుక్తి, దోపిడీ పీడన నుండి విముక్తి కోసం జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమంలో అనేక మంది యువకులు బలిదానాలు చేసినా తమ కొడుకులు పేద ప్రజల కోసమే పోరాడుతున్నారు అన్న భావన మహిళల్లో రావడంతో పాటు ఉద్యమ కార్యకర్తలను కాపాడుకోవడంలో నాటి స్త్రీలు పురుషులతోపాటు సహకరిస్తేనే ఉద్యమము విజయవంతమై పది లక్షల ఎకరాల భూమిని పంపకం చేయడం జరిగిందని ఈ విషయంలో నల్ల వజ్రమ్మ వంటి అనేక మంది మహిళా యోధులు చేసిన త్యాగాలను ఈ పోరాట చరిత్ర గుర్తుకు తెస్తుంది.

నిండు గర్భవతి అయిన నల్ల వజ్రమ్మ ఉద్యమ నేపథ్యంలో అడవుల్లో తిరగడం మంచిది కాదని భావించిన కమిటీ బాధ్యులు ఎర్ర గుంటుపల్లి ,దేవరకొండ తదితర ప్రాంతాలలో రహస్యంగా ఉంచడానికి రక్షణ ఏర్పాట్లు చేస్తే తాను పోరాడటానికి సిద్ధమని ఆపద సమయంలో కూడా తన కర్తవ్యాన్ని సంసిద్ధతను తెలిపినప్పటికీ కమిటీ ఆమె రక్షణకు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది

నల్ల వజ్రమ్మ అరెస్టు విడుదల

గర్భవతిగా ఉండడంతో భీమదేవరపల్లి లోని ఆస్పత్రిలో చేరిన తర్వాత భర్త నల్ల నరసింహులు జాడ కోసం ఆమెను అరెస్టు చేసి తీసుకు పోవడానికి పోలీసులు కుట్రలు చేసినా భరించింది.

1952 జూన్ 6వ తేదీ న ఆడ శిశువుకు జన్మనిచ్చిన ప్పటికీ వెంటనే ఆమెను అరెస్టు చేసి సికింద్రాబాద్ సెంట్రల్ జైలు కి పంపించి చిత్రహింసలకు గురి చేశారు పసిపాపకు తనకు గుడ్డలు పాలు లేకున్నప్పటికీ వారి హింసను భరించింది.

వజ్రమ్మ  జైలులో ఉన్నపుడే  తల్లి గారి ఇంటి పై పోలీసులు దాడి చేసిన క్రమంలో  తండ్రికి దెబ్బలు తగిలి చనిపోయారు.  ఈ విషయమే ఆమె తెలియదు. అంటే ఎంతటి నికృష్టమైన పరిస్థితులను ఉద్యమ కార్యకర్తగా వజ్రమ్మ ఎదుర్కొన్నదో మనం అవగతం చేసుకోవచ్చు.

భర్త పరారీ కుట్రకేసులో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించడం తో పాటు దేవరకొండ హైదరాబాదులో జరిగిన రెండు చోట్ల కేసులను ఎదుర్కొని తన పోరాట పటిమను చాటుకుంది కానీ లొంగి పోలేదు. జమానతు పై బయటికి వచ్చిన మానవతా దృక్పథంతో చంటిపిల్ల తల్లి అని క్షమించి విడిచి పెడుతున్నట్లు జడ్జి ప్రకటించాడు. కానీ తాను మాత్రం అలసిపోలేదు అధైర్యపడలేదు.

నల్ల నరసింహులుకు ఉరి శిక్ష ఖాయం అయినప్పటికీ అంతర్జాతీయంగా జరిగిన పోరాట ఫలితంగ, నాటి ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి కృషి వలన ఉరి శిక్ష నుండి బయటపడి 1959 జనవరి 26న నల్ల నరసింహులు స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చాడు.

జీవితమంతా పోరాటం రూపంలో కలిసి సాగించిన భార్యాభర్తలు ఇరువురు తెలంగాణ పోరాటం జరిగిన నేలమీదనే నివసించడానికి నిర్ణయించుకొని జనగామ లో నివసిస్తూ ప్రజల కష్టసుఖాలలో పాల్గొని ఉద్యమం తర్వాత కూడా ఇద్దరూ కలిసి ప్రజల కోసమే పని చేసినారు.

జీవిత, ఉద్యమ సహచరిగా పనిచేసిన నల్ల వజ్రమ్మ కంటే ముందుగానే భర్త 1993 లో చనిపోయినా వీరనారిగా తనను తాను రుజువు చేసుకున్న వజ్రమ్మ 2017 మే 26వ తేదీన తనువు చాలించింది. కడవెండి గ్రామములో పేద పద్మశాలి కులం లో జన్మించిన వీరి జీవిత సాంగత్యము కంటే నిజాం ప్రతిఘటన లోనే సగం జీవితం సాగించిన తన జీవితానికి సార్థకత ను,
అర్థాన్ని నిలుపుకున్న ఉద్యమ కెరటం నల్ల వజ్రమ్మ జీవిత అనుభవాలు నేటి అసమానతల సమాజ మార్పుకు మహిళా చైతన్యానికి తోడ్పడుతాయి అని ఆశిద్దాం.

(ఈ వ్యాసకర్త కవి రచయిత సామాజిక రాజకీయ విశ్లేషకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *