కృష్ణపట్నం ఆనందయ్య కోవిడ్ మందు మీద జరుగుతున్న వివిధ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని, ఆ రిపోర్టులు అందగానే మరొక మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ తెలిపారు.
ఆనందయ్య ఇస్తున్న మందులలో కంటిలో వేసే మందువల్ల ఏదైనా ప్రమాదం ఉందా అనే విషయం మీద విషయ సేకరణ జరుగుతూ ఉందని, ల్యాబ్ లలో ఇదే విషయం మీద జరుగుతున్న పరీక్షల ఫలితాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎదురు చూస్తున్నదని ఆయన చెప్పారు.
ఆనందయ్య మందు తయారీని ఆయూష్ కమిషనర్ స్వయంగా పరిశీలించారని హైదరాబాద్ ల్యాబ్ కు పంపిన శాంపిళ్ల రిపోర్టులు కొన్ని వచ్చాయని, మరికొన్ని రావాల్సి ఉందని ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.
శుక్రవారం లోగా ఆ మందుపై క్లారిటీ రాబోతోందని సింఘల్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ స్టడీష్, తిరుపతి ఆయుర్వేదిక్ కాలేజీకి చెందిన నిపుణులు కృష్ణపట్నం మందును పరిశీలిస్తున్నారని చెబుతూ కంటిలో వేసే మందు వినియోగంతో ఎవరికైనా నష్టం కలిగిందా అనే వివరాలు సేకరించాలని ఆయూష్ కమిషనర్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
అదే సమయంలో హైదరాబాద్ ల్యాబ్ కు పంపిన శాంపిళ్లపైనా పూర్తి స్థాయిలో రిపోర్టు వచ్చేస్తుందని చెబుతూ సీసీఆర్ఎఎస్ నుంచి వచ్చే నివేదికల ఆధారంగా కృష్ణపట్నం మందుపై మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.