ఇండియాలో మొదట మద్య నిషేధం అమలైన తెలుగు జిల్లాలేవో తెలుసా?

ఇండియాలో మొట్టమొదట మద్య నిషేధం అమలులోకి వచ్చిన 8 జిల్లాలలో 5 తెలుగు జిల్లాలున్నాయి.

 

1937లో మద్రాసుప్రెసిడెన్సీ అసెంబ్లీ  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం రెండు సభల పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పాటుచేశాక జరిగిన తొలి ఎన్నిక అది.  చక్రవర్తి రాజగోపాలాచాారి (రాజాజీ)  1937 జూలై 14న ముఖ్యమంత్రి అయ్యారు.  ఆయన గాంధేయ వాది. మద్యపానానికి బాగా వ్యతిరేకి.
అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మద్యపాన నిషేధం  లేకపోయినా,  ప్రెసిడెన్సీలో మద్యం తాాగడం,తయారుచేయడం,అమ్మడం నిషేధాంచాలనుకున్నారు.
1937 సెప్టెంబర్ లో  ప్రొహిబిషన్ చటం తీసుకువచ్చారు. అక్టోబర్ 1, 1937న మొదట ప్రయోగాత్మకంగా తన సొంత జిల్లా సేలం  ప్రవేశపెట్టారు.
రాజాజీ సొంతవూరు తోరపల్లి నాటి ధర్మపురి తాలూకాలో ఉండింది. మద్రాసు  మద్యనిషేధం చట్టందేశం లోనే మొట్టమొదటి మద్యనిషేధ ప్రయత్నం.
ఆ మరుసటి సంవత్సరం అక్టోబర్ 1న  దీనిని కడప చిత్తూరు జిల్లాలకు విస్తరింపచేశారు. 1939 అక్టోబర్ 1 నార్త్ ఆర్కాట్ జిల్లాకు మద్య నిషేధం విస్తరించారు.
మద్యనిషేధం విజయవంతమయితే, మద్రాసు ప్రెసిడెన్సీ భారతదేశానికే కాదు, యావత్రపంచానికి చుక్కాని అవుతుందని ఆయన వ్యాఖ్యానించేవారు.
ఎందుకంటే, మద్యాన్ని నిషేదించేందుకు అమెరికా కూడా ప్రయత్నించి విఫలమయింది. అందుకే అమెరికా చేయలేని మద్రాసు ప్రెసిడెన్సీలో తాను చేయాలని ఆయన కలగన్నారు.
సేలం, కడప, చిత్తూరు, నార్త్ ఆర్కాట్ జిల్లాలలో మద్య నిషేధం  అమలు చేసి విదేశీ మద్యం తాగాలనుకునేవారికి పర్మిట్లు ఇచ్చే విధానం ప్రవేశపెట్టారు.
అంతేకాకుండా, తెల్లవాళ్లను మద్య నిషేధం పరిధి నుంచి తప్పించారు.
అయితే, రాజాజీ మద్య నిషేధానికి బాగా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే  ఈ వ్యతిరేకత వచ్చింది. దానికి తోడు కడప చిత్తూరు  జిల్లాలో నాటుసారా కాచడం విపరీతమయింది. మద్య నిషేధాన్ని ఎక్కువ మంది హర్షించినా, అక్రమంగా సారా తయారుచేయడం, కల్లు గీయడం,అమ్మడం తీవ్రమయింది. దానికి తోడు ఎక్సయిజ్ నుంచి పడిపోయిన రాబడిని పూడ్చేందుకు  సేల్స్ టాక్స్ పెంచాల్సి వచ్చింది.
 1940 అప్పటి ఎక్సయిజ్ కమిషనర్ ఆస్టిన్ కడప, చిత్తూరు జిల్లాలో పర్యటించి మద్యనిషేధం అమలు జరుగుతున్నతీరు మీద ఒక నివేదిక సమర్పించారు.
జమ్మలమడుగు, పులివెందుల,బద్వేల్, ప్రొద్దుటూరులలో నాటు సారా కాచడం ,అమ్మడం విపరీతంగా పెరిగిందని ఆయన నివేదికలో పేర్కొన్నారు.
అధికారికంగా నార్త్ ఆర్కాట్ లో మద్య నిషేధం అమలు విజయవంతమని  ప్రకటించినా, చిత్తూరు  జిల్లాలో తయారుయిన నాటు సారా నార్త్ అర్కాట్ కు, కర్నాటకలోకి కోలార్ గోల్డ్ ఫీల్డ్ ప్రాంతానికి తరలిపోయేది.
అయినా సరే రాజాజీ ప్రభుత్వం మద్యనిషేధాన్ని అమలుచేసేందుకే పూనుకుంది. అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడానికి నిరసన తెలుపుతూ 1939 అక్టోబర్ నెలాఖరు రాజాజీ ప్రభుత్వం రాజీనామా చేసింది.
మళ్లీ ఎలెక్షన్ 1946 దాకా జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయాక మద్య నిషేధం గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు.
దీనితో 1943 నవంబర్ లో మద్రాసు ప్రభుత్వం 1937 మద్య నిషేధ చట్టాన్ని రద్దు చేస్తూ కొత్త చట్టం తీసుకువచ్చింది. దీనితో 1945 అక్టోబర్ 1 నుంచి సారా దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయి. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రొహిబిషన్ మాయమయింది.
1946  మార్చిలో జరిగిన జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది.
టంగుటూరి ప్రకాశం పంతులు
ప్రెసిడెన్సీలో  215 స్థానాలలో కాంగ్రెస్ కు 162 స్థానాలు వచ్చాయి.కౌన్సిల్ లోని  54  స్థానాలలో 27 ని గెల్చుకుంది.
ఏప్రిల్ లో టంగుటూరి ప్రకాశం పంతులు ‘ప్రధాన మంత్రి’ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.  అపుడు ఎక్సైజ్ మంత్రి తెలుగు వాడే. కడప కోటిరెడ్డి. కొత్త ప్రభుత్వం వచ్చాక మద్యనిషేధం మీద మళ్లీ చర్చ మొదలయింది. రాజాజీ తీసుకువచ్చిన విధానాన్ని అమలు చేయాల వద్దాఅనే దాని మీద తర్జన భర్జనలు మొదలయ్యాయి.
నిషేధం విధించాలా వద్దా అనే విషయం మీద కాంగ్రెస్ వాళ్లు  ప్రతిచోట ప్రజలను అడగడం మొదలుపెట్టారు. ప్రెశిడెన్సీలో మద్య నిషేధం తప్పక ఉంటుందని, ప్రెశిడెన్సీలోని అన్ని జిల్లాల్లో విధించడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని జిల్లాలను ఎంపిక చేసి అక్కడ మద్యనిషేధం విధిస్తామని ఎక్సైజ్ మంత్రి కోటిరెడ్డి గుంటూరు లో ఒక సభలో  మాట్లాడుతూ చెప్పారు. రాజాజీ మాత్రం, కొన్ని జిల్లాల్లో కాదు, అన్నిప్రెశిడెన్సీ లోని జిల్లాల్లో మద్యనిషేధం  విధించాలని వత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రమంతా విధించాలని పట్టుబట్టింది.
ఈ వత్తిడికి కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక పోయింది. చివరకు అసెంబ్లీ లో ప్రధాని ప్రకాశం పంతులు మద్య నిషేదం విధిస్తున్నట్లు ప్రకటన చేయాల్సి వచ్చింది.
అయితే, గతంలో రాజాజీ ప్రభుత్వం  మద్యనిషేధం విధించిన నాలుగు జిల్లాలలో మాత్రమే ఇపుడు అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.
అంటే, సేలం,నార్త్ ఆర్కాట్, కడప, చిత్తూరుజిల్లాలలో మాత్రమేమద్య నిషేధం మళ్లీ అమలవుతున్నన్నదన్నమాట.
 ప్రకాశం పంతులు ఈ వత్తిడికి తలొగ్గి పాక్షికంగానే మొదట విధిస్తామని చెప్పారు. అయితే, ఈ నాలుగు జిల్లాల్లో కఠినంగా మద్యనిషేధం అమలుచేయాంటే ఇతర ప్రాంతాలనుంచి వీటికి అక్రమంగా సారా రాకుండా అడ్డుకోవాలి.  ఈ నాలుగు జిల్లాల చుట్టూర చాలా సంస్థానాలున్నాయి. వాటికి  ప్రెశిడెన్సీ ప్రభుత్వంతో సంబంధంలో లేదు.  వాటితో స్మగ్లింగ్ నివారణ ఒప్పందాలు చేసుకోవాలని భావించాయి.
అయితే, మద్య నిషేధం నాలుగు జిలాలకు పరిమితం చేయకుండా ప్రెశిడెన్సీ మొత్తం అమలుచేయాలని 196 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ప్రధాని ప్రకాశానికి విజ్ఞాపన పత్రం సమర్పించారు.
ఇలా అన్ని వైపు లనుంచి వత్తిడి రావడంతో మరొక నాలుగు జిల్లాలకు మద్యనిషేధం చట్టం వర్తింప చేస్తామని ప్రకాశం పంతులు ప్రకటించారు.  నాలుగు జిల్లాలు: కొయంబత్తూరు, బళ్లారి, అనంతపురం,కర్నూలు.
వీటిలో 1946 అక్టోబర్ 1 నుంచి మద్య నిషేధం అమలులోకి వస్తుందని ప్రకాశం పంతులు అసెంబ్లీ లో ప్రకటించారు. మద్య నిషేధం ఈ నాలుగు జిల్లాల్లో అమలు చేస్తే  227.84 లక్షల రుపాయల రెవిన్యూ పడిపోతుందని ఆయన చెప్పారు.
మొదటి నాలుగు జిల్లాల నుమచి రు. 230 లక్షల ఆదాయం పడిపోయింది. అందువల్ల ప్రెశిడెన్సీ మొత్తం అమలుచేయడం సాధ్యం కాదనేది ప్రకాశం పతుల వాదన. సంపూర్ణ మద్య నిషేధం కోరుతున్న కాంగ్రెస్ శాసన సభ్యులను శాంతింప చేసేందుకు   మూడేళ్లలో మొత్తం ప్రెశిడెన్సీకి నిషేధం  విస్తరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇలా  1946 అక్టోబర్ 1 నుంచి మద్రాస్ ప్రెశిడెన్సీలోని 8 జిల్లాల్లో మద్య నిషేదం రెండో సారి అమలులోకి వచ్చింది. ఇందులో  5 జిల్లాలు తెలుగు ప్రాంతాలవే.

(తర్వాాత 1947 అక్టోబర్లో మరొక 8 జిల్లాకు ప్రొహిబిషన్ విస్తరించారు. కొన్నిశక్తులు అక్రమ సారా జోరుగా సాగిందని హైలైట్ చేసినా, ఈ ప్రొహిబిషన్ వల్ల చాలా కుటుంబాలు బాగుపడ్దాయని చాలా మంది పరిశోధనల్లో తేలింది.  అయితే, ఎంతో కాలం సాగలేదు. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది స్వాతంత్య్రం వచ్చాక.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *