అన్ లాక్ ఆల్ – టీకా
(నిమ్మ రాంరెడ్డి)
ఒక ధీర్ఘ శ్వాస మధ్యలో
శూన్యమౌతున్న శ్వాసలెన్నో
హఠాత్తుగా తగిలిన పోట్రాయికి
కూలుతున్న నిటారు నిచ్చెనలెన్నో
నామరూపం లేకుండా పోతున్న
శిఖరాల శ్రేణులు
భయోత్పాతంలో సంస్కారాలు చచ్చుబడగా
నదీమ తీరాలలో కళేభర తెప్పోత్సవాలు
తాడు లేదు బొంగురం లేదు
బొట్టు బోనం వెంటా లేదు
ప్రాణ భీతి పరిగెత్తించగా
మూలకు నక్కిన ముత్తాలె అంతా
ఇపుడు
వానొచ్చిందంటే మృత వీరుల ప్రవాహ తాండవమే
వరదొచ్చిందంటే తేలిన
ఆత్మల అశాంతుల అలజడులే
ఇపుడు
ఎక్కడ పిడుగువడుతదో
ఎక్కడ పటువ వలుగుతదో
తెగే తాళ్లెన్నో
మిగిలే మోళ్లెన్నో
ఎవరూ ఊహించని గతికాల పరీక్షలే అన్ని
సుక్కా ముక్కా బొక్కాసులకు ఆశపడ్డంత కాలం
తాడు తెంచే కత్తెరలు
ఏలికలైతనే ఉంటయ్
గోళిబిళ్లలు ముక్కుపుటాలలో
దిగవడతనే వుంటయ్
గరీబోడు గాలిలో కలిసిపోతనే ఉంటడు
అభయం అందనంత దూరంలో
అరస్టయ్యే ఉంటది
శాస్త్రీయ లోగిలిలో పయనించినవో
భయం నీ బానిసే
బతుకు మీద తీపి కండూతి
విసర్జించినవో
ధైర్యం నీకు భరణమే
ఇపుడు
సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూపే నక్షత్రం ఒక్క టీకా మాత్రమే
టీకా
పొయ్యిరాజేసే లైటర్
బండి పయ్యను తింపే ఇరుసు
బడి గేటును తెరిచే తాళంచెవి
భయావరణంలో దీప్తి
భద్రతా పెన్నిది
ఇపుడు టీకా
శతాయుష్మాన్ భవా అని దీవేంచే బాపమ్మ
పిండాన్ని రక్షించే జరాయువు
గుమ్మానికి గుమ్మడికాయ
పెద్దర్వాజ తోరణం
గాలి అలికిడి
అన్ లాక్ ఆల్.