కరోనా నేర్పుతున్న పాఠం!!!

(వడ్డేపల్లి మల్లేశము)

అంధ విశ్వాసం,మూఢత్వం, అజ్ఞానం వల్ల చివరికి ప్రాణాలమీదికి తెచ్చుకునే దుస్థితి దాపురిస్తోంది అనడానికి కరోనా కష్టకాలంలో లక్షలాదిమంది బలైన ఈ సంఘటనలే తార్కాణం!

గత సంవత్సరం కరోనా ప్రారంభమైన తొలిదశలో కరోనాను శాస్త్రీయంగా పరిశోధనలు చికిత్స వైద్య ప్రమాణాల ఆధారంగా అదుపు చేయవలసింది పోయి కరోనాతో బుజ్జగింపులకు మనం పాల్పడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.

ప్రభుత్వ అధినేతలు ఇచ్చిన పిలుపు మేరకు చప్పట్లు కొట్టడం ద్వారా కరోనా పారిపోతుంది అనుకున్నాం .కానీ స్వాగతం పలికినట్లు అయినది. దీపాలు వెలిగించడం ద్వారా మన విధేయతను చాటుకుని మన జోలికి రావద్దని విజ్ఞప్తి చేసినా మన మర్యాదను చూసి మన వద్దనే తిష్టవేసి రెండవ దశలో మరింత ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ది. నాదాన్ని మోగించి బెదిరించాలి అనుకున్నాం. ఆనాదమే అనురాగమై కరోనా ను అక్కున చేర్చుకున్నది.

కరోనా- శాస్త్రీయత -ప్రమాణాలు

ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి ధర్మాలను పరిశీలిస్తూ ప్రకృతి విభిన్నంగా పోయిన సందర్భంలో ప్రకృతి కన్నెర్ర చేసిన ప్రతి సారి కూడా వాటికి శాస్త్రవేత్తలు, విరుగుడు కనిపెడుతూనే ఉన్నారు. అయితే 2020 సంవత్సరం జనవరి ప్రాంతంలో భారత దేశంలో తొలిసారిగా ప్రవేశించినా,  కరోనా కు ప్రధాన కారణం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ముస్లిం మత పెద్దల సమావేశం అని బాహాటంగా ప్రచారం జరిగింది.

అయినప్పటికీ శాస్త్రవేత్తలు వారి శక్తి మేరకు పరిశోధనలు జరపడం ద్వారా కూడా అనేక రకాల మందులను కనిపెట్టి కొంతవరకు అదుపు చేయడం జరిగింది.

అప్పటి నుండి శాశ్వతంగా దీనికి విరుగుడు ను సాధించే క్రమంలో వ్యాక్సిన్లు కోసం, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు ప్రయోగాలు జరిగినవి.

పర్యవసానంగానే ఇటీవలి కాలంలో దాదాపుగా 18 కోట్ల మందికి భారతదేశంలో వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది . ఇది చాలా సంతోషించదగినది. కానీ శాస్త్రవేత్తలకు తగినటువంటి ప్రోత్సాహం అందకపోవడం ,పరిశోధనా సంస్థలకు ఆర్థికంగా వెసులుబాటు హామీ మేరకు ఇవ్వకపోవడం, శాస్త్రీయత కన్నా మూఢ విశ్వాసాలకు పాలకులు కొంతమంది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మంత్రులు సైతం ఎమ్మెల్యేలు తగిన విధంగా వ్యవహరించక ప్రజలకు సహకరించకపోవడం తో కరోనా రెండవ దశలో మరింత విస్తృతంగా వ్యాపించి ప్రాణాలను బలిగొంటోంది.

కొన్ని అంధ విశ్వాసాలకు సంబంధించిన ఘటనలు

వ్యక్తులు ,ప్రభుత్వాలు, పాలకులు, మంత్రులు వ్యక్తిగతమైన అభిప్రాయాలు కలిగి ఉండటం వేరు. ప్రజలకు సంబంధించినటువంటి సామాజిక అంశాల పట్ల శాస్త్రీయ వైఖరి అవలంబించడం వేరు. ఇక్కడే పాలకులు శాస్త్రీయతను పక్కనపెట్టి గుడ్డి విశ్వాసాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా ఒకవైపు వైద్యులు పరిశోధకులు ఎంతో కృషి చేసినప్పటికీ వారి కృషి ఫలించడం లేదు. మరోవైపు రాజకీయ రంగం ఎన్నికల కోసం ఆరాటపడుతూ నిబంధనలను పక్కన పెట్టిన కారణంగా కూడా ఇటీవలి కాలంలో కరోనా మరింత విస్తృత రూపుదాల్చింది. దీనికి గౌరవ ప్రధాన మంత్రి నుంచి మొదలు కొంటే రాష్ట్రస్థాయి ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు అందరి వరకు బాధ్యులే.

– అతి సంక్షోభ ససమయంలో కుంభమేళాను నిర్వహించడం, దానికి ఆమోదం తెలపడం, 31 లక్షల మందికి పైగా జనం గుమిగూడడంతో పాటు, పశ్చిమబెంగాళ్, కేరళలో జరిగిన ఒక ఎన్నికల సభలలో స్వయంగా ప్రధానమంత్రి  లక్ష మందితో సభ నిర్వహించడం కరోనా ను పెంచి పోషించుకున్నట్లు కాదా?

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను కూడా పండుగలాగా నిర్వహించినటువంటి నిర్వాహకులకు సారథ్యం వహించిన ఎన్నికల సంఘానికి ఈ స్పృహ లేకపోవడం బాధాకరం.

– ప్రార్థనలు చేసి కాలితో తొక్కి తే కరోనా నశించిపోతుందని పాటలు పాడుతూ చేసిన గోల ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది?

– ఆవు పేడ పూసుకొని ఎండలో ఆరబెట్టి కొని స్నానం చేయడం ద్వారా కరోనా జోలికి రాదనే అంధవిశ్వాసాలు శాసనసభ్యులు ,రాజకీయ నాయకులు , బుద్ధి జీవులను కూడా ఆలోచింప చేయకపోవడం బాధాకరం.

– ముక్కు లో నిమ్మ రసం వేసుకుంటే కరోనా చనిపోతుందని గుడ్డి నమ్మకాన్ని అమలు చేసిన కారణంగా ఎంతోమంది కరోనాకు బలైపోయిన సంఘటనలు కూడా ఇటీవల మనం విన్నాము.

– పవిత్ర గంగానదిలో స్నానం చేస్తే కరోనా రాదని దాని నుండి విముక్తి పొందవచ్చు అని అనేక మంది ముఖ్యమంత్రులు సైతం చేసిన ప్రకటనలకు నేడు గంగానది నిండా వేలాది శవాలు తేలి ఆడుతుంటే మన నమ్మకాలు ఏమైనట్లు పాలకుల ఆలోచనలకు అర్థం లేదా?

– కరోనా నాకు లేదు మాస్కు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఘంటాపథంగా చెప్పిన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే చివరికి కరోనాతో ని చనిపోవడం అత్యంత బాధాకరం ఎందుకు అలసత్వం?

– ఉత్తరప్రదేశ్లో స్వయంగా ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు కరోనా కు బలి కావడాన్ని ఏరకంగా తీసుకుందాం?

పెళ్లికి 50 మంది చావుకు 20 మందిని మాత్రమే పరిమితం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రభుత్వాలు తమ విలాసాలకు తమ రాజకీయ కార్యకలాపాలకు వేలాది మందితో ప్రదర్శనలు నిర్వహించడం బాధ్యత మరచిన శాస్త్రీయత లేని పాలకుల వైఖరి కారణం కాదంటారా?

అంధ విశ్వాసాలను అంతం చేయడానికి మరో కొత్త వ్యాక్సిన్

భారతదేశంలో కోవాక్సిన్,కోవిషీల్డ్ తో పాటు ఇటీవల దేశంలో ప్రవేశపెట్టబడిన స్పుత్నిక్-V వంటిది మాత్రం కాదు ఈ కొత్త వ్యాక్సిన్. శాస్త్రీయత కొరవడి, సామాజిక రుగ్మతల బారిన పడి, తమ బాధ్యతను విస్మరించి ,కేవలం డబ్బు సంపాదన కు మాత్రమే పరిమితమై, బతుకుతున్న టువంటి యువత,మిగతా జనం ,విద్యార్థులు, మధ్యవయస్కులు ఆలోచించవలసిన టువంటి కొత్త వ్యాక్సిన్ ఇది.

భారతదేశంలో క్రమంగా శాస్త్రీయత కొల్లగొడుతూ అంధ విశ్వాసాల బారిన పడుతున్న మనం ఈ కొత్త వాక్సిన్(మానసికపరమైన దృఢ నిర్ణయాన్ని) తక్షణమే తీసుకోకపోతే సమీప భవిష్యత్తులో కరోనా వంటి అనేక ప్రమాద ఘంటికలు ఈ దేశంలో ఎంతో మందిని బలి తీసుకునే ప్రమాదం ఉన్నదని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ విరించి విరివింటి గారు హెచ్చరిస్తున్నట్లు గా తులసి మేడం గారి వీడియో ద్వారా తెలుస్తున్నది.

ఈ కొత్తరకం వ్యాక్సిన్ పేరు కాగ్నిటివ్ వ్యాక్సిన్. అంటే శాస్త్రీయతను పెంచి పోషించే ,ఆత్మ ఆత్మ స్థైర్యాన్ని ,శాస్త్రీయ వైఖరులను డెవలప్ చేసే దిశగా కొనసాగవలసిన అవసరం ఎంతో ఉన్నది. అప్పుడు మాత్రమే ఈ దేశంలోని ప్రజలందరూ ధైర్యంగా ఉండి శాస్త్రీయంగా ఆలోచించి పరిష్కారాలను వెతుక్కుంటారు. లేకుంటే మూడ విశ్వాసాలతో భవి ష్యత్తు నాశనమవుతుందని డాక్టర్ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.

రాజ్యాంగంలో కూడా శాస్త్రీయతను పెంచి పోషించాలని, శాస్త్రీయ వైఖరి ప్రజల్లో కలిగించాలని స్పష్టమైన టువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ఆదేశాలను పక్కన పెట్టిన ప్రభుత్వాలు తమ విశ్వాసాలను ప్రచారం చేయడం ద్వారా కూడా ప్రజలు అశాస్త్రీయంగా తయారవడం జరుగుతున్నది.

ఈ వ్యాక్సిన్ అంటే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఒక మేలుకొలుపు. ఒక ప్రోత్సాహం. ఒక నూతన చైతన్యం. వ్యక్తిపూజకు లొంగిపోవడంతో పాటు గొర్రెలు గా తల ఊపే దీన స్థితి నుండి బయటపడి మనిషిగా, మంచి మనిషిగా స్వయంకృషితో ,స్వీయ అనుభవంతో శాస్త్రీయంగా ఎదగడమే దీని యొక్క లక్ష్యం. ఆ వైపుగా యువత , విద్యార్థిలోకం లోపల కూడా ఆత్మస్థైర్యాన్ని, శాస్త్రీయ వైఖరి నిపెంచి పోషించడం కోసం విద్యారంగం , ఉపాధ్యాయులు,ప్రభుత్వాలు కృషి చేయవలసిన అవసరం ఉన్నదని డాక్టర్ గారు వివరిస్తున్న విషయాన్ని సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది.
ఈ కాగ్నిటివ్ వ్యాక్సిన్ను(శాస్త్రీయ,సానుకూల నిర్ణయం)తీసుకోక పోతే వందలాది టీకాలు వచ్చినప్పుడు కూడా మనం ఇలాంటి భయంకర రోగాల నుండి విముక్తి పొంద లేము.
” శాస్త్రీయత ముద్దు అంధవిశ్వాసాలు వద్దు”
” శాస్త్రీయ వైఖరులను పెంపొందించు కుందాం గుడ్డి నమ్మకాలను తరిమికొడదాం”

(ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు, కవి, రచయిత, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *