-చట్టాలకు విలువలేదు…కోర్టు ఆదేశాలకు దిక్కులేదు
-జగన్ నేతృత్వంలో యథేచ్చగా మానవహక్కుల ఉల్లంఘన
(వర్ల రామయ్య టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి)
రాష్ట్రంలో పోలీసులకు చట్టాలంటే గౌరవం లేదు…కోర్టు ఆదేశాలంటే లెక్కలేదు…ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో యథేచ్చగా రాజ్యాంగ నిబంధనలకు పాతరేస్తున్నారు. ఎంపి రఘురామకృష్ణంరాజు హైదరాబాద్ లో గూండాల్లా వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేయడం, గుంటూరులో సిఐడి పోలీసులు కర్కశంగా లాఠీచార్జి ప్రయోగించడం, కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా జైలుకు తరలించడం చూస్తే ఒక ఫ్యాక్షన్ సినిమాను తలపిస్తోంది. దీనినిబట్టి రాష్ట్రంలో పోలీసులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుచేయడం మానేసి జగన్ డైరక్షన్ లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటువంటి అవాంఛనీయ, అమానవీయ ఘటనలు దేశంలో ఇదివరకెన్నడూ చూడలేదు.
ఏపీ లో ఆవరించిన కరోనా వైరస్ కన్నా కక్షల రాజకీయం ప్రమాదం. విమర్శని సైతం సహించలేని ఆందోళన కర వాతావరణం నెలకొన్నది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు వ్యవస్థను తమ రాజకీయ అవసరాలకు రాళ్ళేత్తే కూలీలుగా మార్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో వున్నామా?రాచరికపు పాలనలో వున్నామా ?అని అర్ధం కావడం లేదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మాకు తిరుగులేదు,ఎదురులేదు అని ఎగిరేగి పడిన వారు ఎంతో మంది కాల గర్భంలో కలిసిపోయిన వాస్తవాలు గుర్తించాలి.
హత్యకేసులో ముద్దాయినైనా కొట్టే అధికారం పోలీసులకు లేదు. గౌరవనీయ ఎంపిని కొట్టడం ద్వారా రాష్ట్రంలోని పౌరులకు ఏం సంకేతాలు ఇవ్వాలని చూస్తున్నారు? తమ భర్తకు ప్రాణహాని ఉందని రఘురామ భార్య ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత మూడు నెలలుగా గుండెజబ్బుతో బాధపడటమేగాక సిఐడి పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగంతో రఘురామ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అందువల్లే రఘురామకు రమేష్ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని సిఐడి కోర్టు ఆదేశించింది. ఇవేమీ పట్టించుకోకుండా హడావిడిగా జైలుకు తరలించడం చట్టవిరుద్దం. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఖచ్చితంగా సిఐడి పోలీసులు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి అనాగరిక, అమానవీయ చర్యలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రంలోని మానవహక్కుల సంఘాలు, మేధావులంతా ఈ సంఘటనపై స్పందించాలి. ఇలాగే వదిలేస్తే రేపు మరెవరికైనా ఇటువంటి పరిస్థితులు రావచ్చు.