వేలాదిమంది విద్యార్థులకు తెలుగు భాష , సాహిత్యాలను శాస్త్రీయంగా బోధించిన, వందలాది పరిశోధకులకు మార్గదర్శకులుగా పనిచేసిన ఆచార్య కేకే రంగనాథాచార్యులు కోవిడ్ వ్యాధి సోకి నిన్న సాయంత్రం మరణించారని తెలుసుకోవడం తెలుగు సాహితీలోకానికి ఒక విచారకర సందర్భం.
ఆయన విశ్లేషణాత్మక రచనలు, గంభీరమైన ప్రసంగాలు, చతురోక్తులతో సాగించే సంభాషణ… ఏదైనా … ఆలోచింపచేసేవిగా, విజ్ఞానదాయకంగా, వివేచన కలిగించేవిగా ఉండేవి. మొదట విప్లవ రచయితల సంఘం, తర్వాత జనసాహితి వ్యవస్థాపకులలో ఒక ముఖ్యుడైన జ్వాలాముఖి ,
కె కె ఆర్(14-6-1941), ఒకే ప్రాంగణంలో పుట్టి పెరిగిన వారు. జ్వాలాముఖితో పాటు తాను దిగంబర కవులలో ఒకరు కాకపోయినా వారితో బాగా సాన్నిహిత్యాన్ని నెరిపారు.
మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంతో మాత్రమే సమాజాన్ని చరిత్రను సంస్కృతిని తద్వారా సాహిత్యాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకోగలుగుతామనే నిర్ధారణకు కేకేఆర్ కూడా వచ్చారు.
సారస్వత పరిషత్తు ఓరియంటల్ కళాశాలలో 20 ఏళ్లకు పైగా ప్రిన్సిపల్ గా ఉండి తన అపార సంస్కృత, ఆంధ్ర భాషా పాండిత్య సంపదను విద్యార్థులకు పంచారు.
1987లో కేంద్రీయ విశ్వ విద్యాలయానికి ఆచార్యులుగా, తెలుగు శాఖ ఆధిపతిగా , డీన్ గా పని చేశారు. ఆయన ఆచార్యులకే ఆచార్యుడు అని అంటే అతిశయోక్తి కాదు.
తెలుగు సాహిత్య విమర్శన, పరిశోధనలలో ప్రత్యేక ఒరవడి దిద్దిన
కేకేఆర్, ఏది రాసినా అదొక ప్రామాణిక పత్రo లాగా ఉండేది. 1985 ప్రజాసాహితిలో ఆయన రాసిన సంస్కృతి అంటే… అనే వ్యాసం అనేక ముద్రణలకు నోచుకుంది.
ఆయన రచనల సంకలనం అయిన ‘బహుముఖం’ లోని వ్యాసాలన్నీ సాహిత్యకారులకు ఆకర పత్రాలు (Reference) లాంటివి.
ఒక గొప్ప సాహితీవేత్తను మనం కోల్పోయాము. వారి లేని లోటు పూడ్చలేనిది.
కేకేఆర్ మరణానికి ప్రజాసాహితి పత్రిక జన సాహితి సంస్థ ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తొంది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తోంది.
(కొత్తపల్లి రవిబాబు,దివికుమార్, బి. అరుణ. జనసాహిాతి)