వైసిపి రెబెల్ ఎంపి రఘురామకృష్ణరాజు అరెస్ట్ నిన్న చాలా నాటకీయంగా జరిగింది.
ఆయనను అమరావతి పోలీసులు అరెస్టు చేసిన విధానం తీవ్ర విమర్శలకు గురయింది. వైసిపి తరఫున నరసాపురం నుంచి ఎంపిగా గెలుపొందిన రాజు చాలా తొందరగా నాయకత్వం మీద తిరుగుబాటు చేశారు.
రఘరామకృష్ణ రాజు కూడా జగన్ లాగే యువకుడు. ఉడుకు రక్తం ఉన్నవాడు. దానికి తోడు బాగా ఇన్ ఫ్లుయన్స్, డబ్బు,ధన సమీకరణ మెలకువలు, బ్యాంకుల నుంచి వందల కోట్ల లోన్ పుట్టించగల సామర్థ్యం ఉన్నవాడు. అందువల్ల పార్టీ అధినేత కంట్రోల్ ను కొంతవరకే భరించగలరు. ఆయనకు కులం,ధనం, వయసు రీత్యా రెబెల్ కు కావలసిన లక్షణాలున్నాయి. పార్టీలో సర్దుకు పోయి, పలుకుబడి ఉపయోగించుకుని గుట్టుగా వ్యాపారం చేసుకుందాం లే అనుకునే బాపతు కాదు అని నిరూపించాడు. ఆయన రాజకీయ లక్ష్యం ఏమిటో తెలియదు.
వైసిపిలో , అన్ని ప్రాంతీయ పార్టీలలాగనే ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పూర్తిగా సరెండర్ కావలిసిందే. లేకపోతే, పార్టీ నుంచి వెళ్లి పోవాలి తప్ప రెబెల్ గా నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ, కేసులు పెడుతూ ఉంటే ‘బలమయిన అధినేత’ ఎపుడూ క్షమించడు.
ఇదే రఘురామ కృష్ణ రాజు విషయంలో జరిగింది. సిఐడి కేసు అనేది చట్టాన్ని ఫాలో కావాలి కాబట్టే వాడుకున్న సాధనాలు మాత్రమే. వ్యవహారమంతా రాజకీయం. ముఖ్యమంత్రి జగన్ కు సిబిఐ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రెబెల్ రఘురామకృష్ణ రాజు పిటిషన్ వేయడం దీని వెనక కారణం కావచ్చు. అది కేసుల రూపం తీసుకుంది. రెబెల్ఎంపి రాజు మీద కేసులు పెట్టినట్లు ఏపీ సీఐడీ అధికారికంగా ధృవీకరించింది.
‘వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు: సీఐడీ
ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు.సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యూస్ ఛానళ్లు, వ్యక్తులతో కలిసి విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు. అందువల్ల 124(A), 153(A), 505 IPC, R/W 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిఐడి ప్రకటన విడుదల చేసింది.
ఇపుడేమవుతుంది?
రెబెల్ రఘురామకృష్ణ రాజు బెయిల్ కోసం ప్రయత్నిస్తారు. బెయిల్ వస్తే ప్రభుత్వానికి ఎదురు దెబ్బతగిలినట్టే. బెయిల్ రాకుండా జ్యుడిషియల్ కస్టడీనికి పంపినా ప్రభుత్వం అనుకున్నది కొంత నెరవేరుతుంది. ఎందుకంటే రఘరామకృష్ణరాజును బయట ఉంచితే ఏదో ఒకటి చేస్తున్నాడని, ముందు ముందు పార్టీకి ఇంకా తలనొప్పి అవుతాడని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఆయనని జెయిలుకు పంపాలన్నది పార్టీ ఉద్దేశం కావచ్చు. ఇంతకాలం ఓపిక పట్టి ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సహించడం వెనక ఆయన కులం,ధనం ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. చిన్నచితకా ఎంపి అయితే, ఈ పాటికి కథ ఎపుడో ముగిసి ఉండేది. అయితే, ఆయన ‘లోపల’ ఉంచేంతగా కేసులు బలంగా ఉన్నాయా?
రఘరామకృష్ణ రాజును అరెస్టు చేసిన తీరు, ఆయన ఆరోగ్యం, కరోనా కారణంగా జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేస్తున్న విషయాలు కూడా కోర్టు పరిగిణనలోకి తీసుకోచ్చు. ఏమవుతుందో చూద్దాం.