ఇండియాలో ఇప్పటికి ఉన్న‘మయసభ’ ఇది, ఎక్కడుందో తెలుసా?

ఉన్నదని లేనట్లు,లేనిది ఉన్నట్లుగా చూపే మహాభారత  ‘మయసభ’  గురించి మనకు తెలుసు. అయితే, ఇలాంటి మయసభ నిజంగానే భారతదేశంలో ఒకటి ఉందని చాలా మందికి తెలియదు.  దాని పేరు హజారీద్వారి ప్యాలెస్ ( Hazariduari Palce). అంటే వేయి ద్వారాలున్న మహా రాజభవనం. ఇది కోల్ కతా కు 176 కి.మీ దూరాన ఉన్న ముర్షిదాబాద్ (Murshidabad)లో ఉంది.

కొంత జనరల్ జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లకు ముర్షిదాబాద్ అంటే పట్టు పరిశ్రమ గుర్తుకు వస్తుంది. చారిత్రక దృష్టి ఉన్న వాళ్లకు మరుగున పడిన గొప్ప చరిత్ర కళ్ల ముందు ప్రత్యక్ష  మవుతుంది.

ఎందుకంటే బెంగాల్ కు ఒకప్పటి రాజధాని ముర్షిదాబాదే,కలకోత కాదు.  ముర్షిదాబాద్ ఉజ్వల చరిత్ర 1704లో  మొదలయింది. ఆ యేడాది చక్రవర్తి ఔరంగాజేబు  బెంగాల్ దీవాన్ అయిన ముర్షిద్ ఖులీ ఖాన్ రాజధానిని ఢాకా నుంచి భాగీరధి నది ఒడ్డున ఉన్న చిన్న వూరికి మార్చి దానికి తన పేరు పెట్టాడు. అప్పటి నుంచి అది ముర్షిదాబాద్ అయింది. ఆ తర్వాత  12 సంవత్సరాలకు దీవాన్ ఏకంగా బెంగాల్ నవాబ్ నజీమ్ (1824-1838)గా ప్రమోషన్ పొందాడు.  ఆయన పూర్తి పేరు నవాబ్ నజీమ్ హుమయూన్ జా. అప్పటి బెంగాల్ లో   బీహార్ ఒదిశాలు కూడా ఉండేవి. ఆయన కట్టించిన భవనమే హజారీద్వార భవనం.

ఇందులో వేయి ద్వారాలున్న మాట నిజమే. అయితే, వాటిలో 110 మాత్రమే  నిజమయిన వాకిళ్లు. మిగతావన్నీ మాయా వాకిళ్లు మాత్రమే. ఆ రోజుల్లో ఇలా  భ్రమ కలిగించే  890 మిథ్యా  ద్వారాలతో ఒక రాజభవనం ఎందుకు నిర్మించారో ఇప్పటికీ తెలియడం లేదు.

ఇది రాజ ప్రాసాద భద్రత కోసమని కొందరి అభిప్రాయం. నవాబును హత్య చేయడానికి ఎవరైనా లోనికి ప్రవేశించినా, అంతఃపుర తిరుగుబాటు వచ్చినా ఏ ద్వారం గుండా బయటకు వెళ్లాలో, లోపలికి ప్రవేశించాలో తెలియకుండా తికమక పెట్టేందుకు ఇలా మాయా ద్వారాలను ఏర్పాటు చేసి ఉంటారని కొంతమంది చరిత్రకారుల అనుమానం.

Murshid Quli Khan (wikimedia commons)

ఈ అనుమానం ఎందుకంటే, 19శతాబ్దంలో  ముర్షిదాబాద్ కుట్రలకు కుతంత్రాలకు కేంద్రం. ముర్షిదాబాద్ మీద చాలా మంది కన్నేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుండే వారు. చివరకు 1757 ప్లాసీ యుద్దం (Battle of Plassey)తర్వాత బెంగాల్ నవాబుల దగ్గిర నుంచి ఈస్టిండియా కంపెనీకి స్వాదీనమయింది. నవాబు అధికారం నామమాత్రమయింది. పైకి నవాబీ హంగులున్నా, పరిపాలనకు సంబంధించి స్వేచ్ఛ లేకుండా పోయింది.

అయితే,  నవాబ్ హమయూన్ జా ఒక రాజభవనం నిర్మాంచాలనుకున్నాడు. ఈ పనిని యూరోపియర్ ఆర్కిటెక్ట్ కర్నల్ డంకన్ మెక్లియాడ్ (Duncan Mcleod)కు అప్పగించాడు.  ఆయన యూరోపియన్ శైలిలో ఈ భవననమూనా తయారుచేశాడు.  1829 ఆగస్టు 9 ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1837 లో నిర్మాణం పూర్తయింది. మొదట్లో దీనిని బారా కోఠి (Bara Koti) అని పిలిచే వారు. నిజామత్ ఖిలా లోని ఒక మూలన దీనిని నిర్మించారు.

ఇండో ఐరోపా వాస్తు రీతిలో భారత భూభాగం మీద కట్టిన మొదటి భారీ  భవనం ఇదే. ఇది మూడంతస్థుల భవనం. 424 ఆడుగుల పొడవు, 200 అడుగుల వెడల్పు,  80 అడుగుల ఎత్తన ఉంటుంది. భవనంలోకి ప్రవేశించాలంటే 37 మెట్లున్న విశాలమయిన స్టైర్ కేస్ ఎక్కి రావలసి ఉంటుంది. ఇందులో కింది మెట్టు పొడవు  108 అడుగులు.

పోర్టికోలో  ఏడు భారీ స్థంభాలుంటాయి. ఒక్కొక్క స్థంబం అడుగున 18 అడుగుల చుట్టుకొలతతో ఉంటుంది. ప్యాలెస్ లో 114 గదులున్నాయి.  41 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ప్యాలెస్ పోర్టికో పైన రాజముద్రిక శిల్పం చెక్కి ఉంటుంది.

Foundation Stone (museums.org)

ఇంత వాస్తు వైభవంతో  ఈ భవనాన్ని నిర్మించేందుకు ఆ రోజుల్లో  16 లక్షల బంగారా నాణేలు ఖర్చయ్యాయి. అయితే, ఇందులో నవాబు కుటంబం ఎపుడూ నివసించనే లేదు. కేవలం దర్బార్ ల కోసం, భారత దేశం సందర్శించే బ్రిటిష్  ఉన్నత స్థాయి అతిధులకు విడిది గృహంగా మాత్రమే వాడేవారు. భవనం నిర్మించాక  నవాబ్ నజీమ్ కు ఈ  వాస్తురీతి నచ్చలేదు. ఇదంతా ఐరోపా భవనం లాగా ఉందని , దేశీయత ఇందులో కనిపించడం లేదని  ఆయన అసంతృప్తి కనబర్చాడు. దానికి తోడు ఇది ఆయన స్థాయికి చిన్నదిగా కూడా అనిపించేది. అందుకే ఆయన కుటుంబం ఈ భవనం చుట్టూర ఉన్న  ఇతర ప్యాలెస్ లలోనే ఉన్నాడు తప్ప హజారీ ద్వార్ ప్యాలెస్ లోకి రాలేదు.

ఈ భవనం  1985లో భారత భారత వస్తు శాఖ ఆదీనంలోకి వెళ్లింది. భారత పురావస్తు శాఖ దీనిని అద్భుతమయిన  ప్యాలెస్  మ్యూజియం గా మార్చేసింది.   ఇదిపుడు ఇండియాలోని ప్యాలెస్ మ్యూజియాలలో ప్రముఖ దర్శనీయ స్థలమయింది. దేశంలోని అతిపెద్ద ప్యాలెస్ మ్యూజియం (Stie Museum) ఇదే. ఇందులో20 గ్యాలరీలులన్నాయి. 4742 చారిత్రక ప్రాధాన్యమున్న వస్తువులను భద్రపరిచారు.

ముర్షిదాబాద్ రైల్వే స్టేషన్ రెండు కిలో మీటర్ల దూరాన ఈ ప్యాలెస్ ఉంటుంది. ఇక్కడికిచేరుకోవడం చాలా సులభం. కోల్ కతా విమానాశ్రయం నేతాజీ సుబాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఇక్కడికి 239 కి.మీ దూరాన ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *