ఎవరికి ఎవరు ఎవరో?
(నిమ్మ రాంరెడ్డి)
వాట్సాపులో ఇమేజొచ్చిందంటే
ఓపెన్ చెయ్యాలంటే ధైర్యం రావట్లేదు
ఎక్కడ కట్టలు తెగెనోనని
ఏ పచ్చిక బయలు ఎడారిగా మారెనోనని
ఏదో ఆందోళన
ఎందుకో అదుర్తా
నిన్నమొన్నటిదాకా పూసిన నవ్వులు
చితిమంటలై మండుతుంటే
స్వప్నతీరాల్లో కట్టుకున్న బొమ్మరిల్లు
సడన్గా కూలుతుంటే
కళ్లు
కిటికీలను తెరవనంటున్నయ్
కాళ్లు
కాసింతైనా కదలనంటున్నయ్
కాళ్రెక్కలాడందే కడుపునిండని బతుకులను తలుసుకుంటుంటే
నోట్లో ముద్ద దిగట్లేదు
కంట్లో కునుకు దూరట్లేదు
చేయి చాచుదామంటే
పెద్దగాలేదాయె
మోద్దామంటే
వెన్ను దన్నుగా లేదాయె
మేడలు మిద్దెల్లో కూడా
మోగింది నగారా
ఎక్కడ చూసినా
నిస్సహాయ నిర్గుణ నీరవ స్థితిలే
ఇపుడు బతికుంటే బలిసాకు చాలు
విలాప గీతాలు లేని
విషణ్ణ వదనాలు కాని
చెదరని గూడుంటే
అదే పదివేలు
కాసింత గాలాడితే
అదే భాగ్యం
మూసుకపోయిన దారులల్లో
గుడ్డిదీపములకై తండ్లాట
తారలన్నీ రాలిపోతుంటే
తావులకై దేవులాట
అల్లంత దూరాననే
ఆరిపోతున్న అనురాగ దీప్తులు
ఆ నిర్లక్ష్య నికృష్ట ఫలితమో ఏమో
ఈ నిర్దయ నిష్క్రియాత్మక నిశ్చేష్ఠ ఫలితం
ఎవరు కారకులో
ఎవరు బలిపశువులో
ఎవరు సూత్రదారులో
ఎవరు పాత్రదారులో
ఎవరికి ఎవరు ఎవరో
ఆ వేషాలు
ఎపుడు మార్చుకుంటరో
మీనవేషాలు
ఎపుడు మానుతారో
ఈ మీమాంస
ఎపుడు తొలిగేనో
ఏమో ఎమో
ఎట్లనో