రాష్ట్రంలో తిరిగి తిరుపతి రుయా ఆసుపత్రి తరహా ఆక్సిజన్ ప్రమాదాలు జరుగకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్ చర్యలు మొదలుపెట్టింది. తిరుపతి ప్రమాదం నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రులలో పైప్ లైన్లు మొదలైన అంశాలను కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జరిగిన సమీక్షా సమావేశంలో పేర్నొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాకపోయినా, పక్కరాష్ట్రం నుంచి రావాల్సిన ట్యాంకర్ సకాలానికి రాకపోయినా సరే బాధ్యత తీసుకుని నిన్నటి రుయా ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్‌ను ఆదేశాలు జారీ చేశారు.
‘వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి పరిహారం ఇవ్వండి, వారి బాసటగా ఉండండి. తప్పులు మళ్లీ జరక్కుండా భవిష్యత్తులో, ఇంకా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై దృష్టిపెట్టాలి,’ అని జగన్ చెప్పారు.
కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలనుంచి మనకు ఆక్సిజన్ వస్తోందని ఆయన చెప్పారు. ‘మూడు రాష్ట్రాలకు ముగ్గురు అధికారులను పంపిస్తున్నాం. ఆక్సిజన్ సప్లై పెంచడానికి వీరు దృష్టిపెడతారు. తమిళనాడుకు కరికాలవలవన్, కర్ణాటకకు అనంతరాములు, ఒడిశాకు ఎకె పరీడాలను పంపిస్తున్నాం.రేపటి నుంచి ఈ వ్యవస్థ పనిచేస్తుంది.అలాగే జిల్లాల్లో ఆక్సిజన్‌వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలి,’ అని జగన్ చెప్పారు.
జగన్ ఇంకా ఏమన్నారంటే…
నిన్న రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. మనం ఎంత బాగా కష్టపడుతున్నాకూడా, ప్రయత్నాలు చేస్తున్నాకూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తోంది. తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందున, ఆక్సిజన్ కొరత ఏర్పడింది.11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే… నిన్నకూడా ఆరు ట్యాంకర్లను గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్ లిఫ్ట్ చేశాం.అక్కడ నింపి… రోడ్డు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నంచేస్తున్నాం. విదేశాల్లో నుంచి ఆక్సిజన్ కొనుగోలు చేసి.. షిప్స్‌ద్వారా తెప్పిస్తున్నాం. ఇన్నిరకాలుగా ఆక్సిజన్ కొరత రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నకూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేకపోవడంవల్ల నష్టాలు జరుగుతున్నాయి. కలెక్టర్లందరికీ కూడా చెప్తున్నా చాలా అప్రమత్తతో వ్యవహరించాలి.
ఆస్పత్రుల్లో ఉండే ఆక్సిజన్ పైపులైన్లను పర్యవేక్షణ చేయండి.టెక్నికల్ స్టాఫ్‌ను కచ్చితంగా నియమించండి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సరైన ఒత్తిడితో ఆక్సిజన్ వెళ్లేలా చేయాలి. అలాగే ఐసీయూలోకూడా ప్రెజర్ బూస్టర్స్‌కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలన చేయండి.
వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటో రాష్ట్రంలోనేకాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు.నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తిచేసే సామర్థ్యం దేశంలో ఉందని అందరికీ తెలుసు. ఇందులో 6 కోట్లు డోసులు నెలకు కోవీషీల్డ్‌ఉత్పత్తి చేస్తుంటే, భారత్ బయోటెక్ 1 కోటి డోసులు ఉత్పత్తిచేస్తోంది. ఈ భారత్ బయోటిక్ ఎవరిది అంటే సాక్షాత్తూ చంద్రబాబుగారి బంధువుది, రామోజీరావుగారి కొడుకు వియ్యంకుడిది.ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. 18 ఏళ్లకు పైబడ్డ వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే ఇప్పటివరకూ కేవలం 17 కోట్లు డోసులు మాత్రమే ఉత్పత్తి అయిన పరిస్థితి కనిపిస్తోంది.45 సంవత్సరాలు పైచిలుకు ఉన్నవారు రాష్ట్రంలో 1.48 కోట్ల మంది ఉన్నారు. వీరికి 2 డోసులు చొప్పున దాదాపు 3 కోట్లు డోసులు ఇవ్వాల.18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్నవారు రాష్ట్రంలో 2 కోట్ల మంది జనాభా సుమారుగా ఉన్నారు. వీరికి దాదాపు 4 కోట్ల డోసులు అవసరం:
అంటే 18 ఏళ్ల పైబడి రాష్ట్రంలో ఉన్నవారికి వ్యాక్సిన్లు ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పటివరకూ 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి మనకు అందాయి. ఈ పరిస్థితి ఉందని అందరికీ తెలుసు.డబ్బులు తీసుకుని మాకు సప్లైచేయండని కోరినా సరే కంపెనీలు తీసుకోవడంలేదు.వ్యాక్సిన్ల పంపిణీ అన్నది కేంద్రం నియంత్రణలో ఉంది.ఈమేరకు సుప్రీంకోర్టులో కేంద్రం కూడా అఫడవిట్‌కూడా దాఖలు చేసింది. జనాభా ప్రాతిపదికన కోటాను నిర్దారిస్తామని అఫిడవిట్లో పేర్కొంది.