ఆంధ్ర అంబులెన్స్ ల మీద తెలంగాణ ఆంక్షలు, ఎపిలో నిరసన

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వస్తున్న రోగులను సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసుల అడ్డుకుంటున్నారు. తెలంగాణ లోకి వస్తున్న కోవిడ్ పేషేంట్స్ అనుమతిపై తెలంగాణ పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్సులకు అనుమతిస్తున్నారు. ఆసుపత్రులకు అనుమతి లేకుండా కరోనా పేషేంట్ ను అంబులెన్స్ లు నిలిపివేస్తున్నారు. అనుమతి లేని అంబులెన్స్ లను బోర్డర్ దగ్గర నుంచే వెనక్కి తిప్పి పంపుతున్నారు. అయితే, సాధారణ వాహన ప్రయాణికులను మాత్రం అనుమతిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే…

గుంటూరు పోలీసులు ఈ విషయంలో ప్రజలకోసం ఒక ప్రకటన జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రులలో చికిత్స నిమిత్తం ప్రైవేట్ అంబులెన్సు లలో వెళ్ళే వారు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని వారు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

అలా కాని పక్షంలో, రోగికి తాము చికిత్స చేయడానికి సిద్దముగా ఉన్నామని రోగి కోసం తమ ఆసుపత్రిలో పడక(Bed) కూడా సిద్దముగా ఉందని చికిత్స అందించే ఆసుపత్రుల యాజమాన్యం నుండి  అంగీకార పత్రాన్ని / ధృవీకరణ పత్రాన్ని పొందాలని గుంటూరు జిల్లా యంత్రాంగం పేర్కొంది.

“ఆంధప్రదేశ్ నుండి కొంత మంది ప్రజలు వివిధ అనారోగ్య కారణాలకు సంబంధించి చికిత్స నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రులకు వెళ్ళడం జరుగుతుందని అందరికీ తెలుసు.

కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం వారు వివిధ అనారోగ్య కారణాల వలన తమ రాష్ట్రములోని ఆసుపత్రులలో చికిత్స తీసుకోవడం కోసం ప్రైవేట్ అంబులెన్సులలో వచ్చే వారికి కొన్ని షరతులతో కూడిన అనుమతులను జారీ చేయడం జరిగినది. అనుమతులను ముందుగా పొంది మాత్రమే గుంటూరు జిల్లా ప్రజలు చికిత్స నిమిత్తం ప్రైవేట్ అంబులెన్సు లలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళవలసినదిగా తెలియచేయడమైనది.”

సిపిఐ ఖండన

ఆంధ్ర ప్రదేశ్ పేషెంట్ల అంబులెన్సులను తెలంగాణ సరిహద్దులో పోలీసులు నిలిపివేయడం అమానుషం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు.హైదరాబాదులో మెరుగైన వైద్యం కోసం ఏపీ నుండి హైదరాబాద్ వెళ్లే అంబులెన్స్ లను పోలీసులు అడ్డుకోవడం తగదని, రోగుల ప్రాణాలతో చెలగాటమాడే అధికారం తెలంగాణ పోలీసులకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని  రామకృష్ణ పేర్కొన్నారు.

బిజెపి ఖండన

హైదరాబాద్‌ పదేళ్ల వరకు తెలంగాణ-ఆంధ్రకు ఉమ్మడి రాజధాని అందువల్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయం ఇది అనే విషయాన్ని తెలుంగాణ పోలీసులు గుర్తించాలని బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

“హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌. కరోనా రోగులు, అత్యవసర సేవల కోసంఆంధ్రనుంచివచ్చేఅంబులెన్స్‌లను తెలంగాణ ప్రాంతంలో ఆడ్డుకుంటున్నారు.-ఉమ్మడి రాజధానిలో మరో మూడేళ్ల వరకు మౌళిక సదుపాయాలు వినియోగించుకునే హక్కు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా ఉంది.వైద్యానికి సంబంధించి అయితే ఎల్లలు కూడా అవసరం లేదు,” అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *