( కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి)
రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి అధికారం చేపట్టిన నాటి నుండి అభివృద్ధిని ఎలాగో తుంగలో తొక్కారనీ, ఇప్పుడు విశాఖ వంటి మహానగరాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ, అమరావతి రాజధానిని విధ్వసం చేయడం సీఎం జగన్మోహనరెడ్డికి తగునా?
విశాఖ మహానగరాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం పావులు కదుపుతోంది. గంగవరం పోర్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా 10.39 శాతాన్ని రు.645 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన 1400 ఎకరాల భూమిని గంగవరం పోర్టు నిర్మాణానికి ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10.39% వాటా లభించింది. ప్రస్తుతం గంగవరం పోర్టుకు వస్తున్న లాభాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా వస్తున్నది. 1400 ఎకరాల భూముల విలువే వేల కోట్లల్లో ఉ ంటుంది. గంగవరం పోర్టులో రెండు ప్రైవేటు సంస్థలకు చెందిన 89.61% వాటాలను ఆదానీ కంపెనీ కొనేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న 10.39% వాటాను రు.645 కోట్లకు అమ్మేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుగా ఉద్యమించి, 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకొన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తామని పార్లమెంటు సాక్షిగానే ప్రకటించింది. విశాఖ పోర్టులో ఇప్పటికే విభాగాల వారీగా ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయబడ్డాయి. ఆదానీ కంపెనీ విశాఖ పోర్టులో ఒక బెర్త్ ను లీజుకు తీసుకొని వినియోగించకుండా పేచీ పెట్టుకొని కూర్చొన్నది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా అమ్మకానికి పెట్టే అవకాశాలున్నాయి.
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం పెను వివాదాన్నే సృష్టించింది. 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని సైతం జగన్మోహనరెడ్డి అర్ధాంతరంగా నిలిపివేశారు. దాదాపు రు.10 వేల కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతిలో చేసిన అభివృద్ధి పనులు బూడిదలో పోసిన పన్నీరు చేశారు. ఇప్పుడు విశాఖ మహానగరాన్ని కార్పోరేట్ శక్తుల కబంధ హస్తాల్లోకి నెడుతున్నారు. జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టి రెండేళ్లు గడచినా ఎపీలో ఏ ఒక్క నూతన పరిశ్రమ ఏర్పాటు కాకపోగా, ఉన్న పరిశ్రమలను మూసివేసే విధానాలను అవలంభిస్తున్నారు.
కక్షపూరిత రాజకీయాలకు ఆస్కారమిస్తున్నారు. ఇసుక కొరత సృష్టించారు. ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. ‘అప్పు చేసి పప్పు కూడు’ అన్న చందంగా పాలన సాగిసున్నారు. ఈ రెండేళ్ల కాలంలో రు.1.70 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అధ:పాతాళంలోకి నెట్టారు. బిల్డ్ ఎపీ పేరుతో ప్రభుత్వ స్థలాలు, గెస్ట్ హౌస్ వంటి వాటిని అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఫలితంగా రాష్ట్రాభివృద్ధి శూన్యమైంది. ఇప్పటికే ల్యాండ్ మాఫియా చేతుల్లో చిక్కిన విశాఖ నగరాన్ని, ఇప్పుడు కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా కట్టబెట్టేందుకు ఉద్యుక్తులవుతున్నారు. మొత్తంమీద జగన్మోహనరెడ్డి ఆంధ్రప్రదేశ్ ను అధోగతి పాల్టేసే పాలన సాగిస్తున్నారేమో అనే అనుమానం బలపడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంభిస్తే ప్రజల నుండి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నాం.
(ఇది సిపిఐ రామకృష్ణ విడుదల చేసిన ప్రకటన)