కోవిడ్ విదేశీ సాయంలో స్నేహమెంత? రాజకీయమెంత?: డాక్టర్ జతిన్ కుమార్ వివరణ

(డాక్టర్ సూర్యదేవర జతిన్ కుమార్)

మన దేశంలో కరొనా  రెండవ ప్రభంజనం అత్యంత విషాదకర పరిణామాలకు దారి తీస్తోంది. రోజుకు 5 లక్షల కేసులకు, 4 వేల మరణాలకు దారి తీస్తోంది. ఈ వ్యాధి వల్ల ఇన్ని మరణాలు సంభవించటం అనివార్యమేమీ కాదు . కరొన వ్యాధి అంత ప్రాణాంతక మైనదేమీ కాదు. కానీ వ్యాధిని నివారించటంలోనూ, చికిత్స అందించటం లోనూ  మన వ్యవస్థ విఫలం కావటం వల్ల సంభవిస్తున్న మరణాలు ఇవి. అసలు ఇది మన పాలకుల నిర్లక్ష్యం వల్ల, వారి ప్రాధాన్యతలు వేరుగా వుండటం వల్ల పెరుగుతున్న విపత్తు గా భావించటం సబబే నేమో.

Dr S Jatinkumar

ప్రజల ప్రాణాల రక్షణ కన్న రాష్ట్ర ప్రభుత్వాలను కైవసం చేసుకోవాలనే తపన ముఖ్యం కావటం ఈ వైఫల్యానికి దారితీసిన బలమైన కారణం. హోలీ సంబరాల  తరువాత 150%. ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో 530%గా రోగుల సంఖ్య పెరిగిందని  పరిశీలనలు  స్పష్టం  చేస్తున్నాయి.

మందులు, ఆసుపత్రిలో పడకలు, వెంటిలేటర్లు ఎటూ లేవు సరిగదా, కనీసం ఆక్సిజన్ ఇచ్చే సదుపాయం కూడా లేక  మరణిస్తున్నారంటే ఇది గొప్ప మానవ కల్పిత విషాదం గానే  భావించాలి. చనిపోయిన తమ వారికి సక్రమంగా అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేని  పరిస్థితి, శ్మశానాలలో చోటులేక బహిరంగ ప్రదేశాలలోనూ, వీధుల పక్కన , సామూహిక శవ దహనాలు చేయటం ప్రజలను కలిచి  వేస్తోంది. భయ భ్రాంతులై వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవటానికి టీకాల కోసం  వెతికితే  “నో స్టాక్” బోర్డులు పరిహసిస్తుంటే , ప్రజలు కోపానలం తో దహించుకు పోతున్నారు. ఈ స్తితిని గమనించిన విదేశాలు వార్తలు రాస్తుంటే కూడా సహించలేని  స్థితికి వచ్చింది ప్రభుత్వం. 

 మిత్రులనుకున్న దేశాలు సాయం చేయవల్సింది పోయి, కేవలం సానుభూతి వచనాలు పలుకుతూ,  అనేక వ్యాపార నిబంధనలు, ముడిసరుకులపై ఆంక్షలు  విధిస్తుంటే ప్రభుత్వం కిమ్మన లేక పోతున్నది.  తాము పంపే సహాయం ఫలానా సంస్థలకు, ఫలానా కార్యక్రమాలకు వాడాలి అని వారు షరతులు పెడుతుంటే ఏమీ అన లేకపోయారు.

ఈ పాండెమిక్  విపత్కర స్థితిని తమ ఆర్ధిక ,రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న సామ్రాజ్యవాద  శక్తులకు ,బడా పెట్టుబడిదారీ దిగ్గజాలకు  తలవొగ్గి  వాళ్ళు దయాధర్మంగా  ఇస్తున్నట్లు  చేస్తున్న  కొద్దిపాటి సహాయాన్ని గొప్ప వితరణ గా, మన  పాలకుల అంతర్జాతీయ ప్రతిష్టకు చిహ్నంగా ,అదే వారి సమర్థతగా చెప్పుకుంటూ  పులకించి పోతున్నారు. 

అమెరికా USAID నుండి, లక్ష NH 95 మాస్కులు,440 ఆక్సిజన్ సిలెండర్లు, 9 లక్షల 60 వేల పరీక్ష కిట్లు  అందాయి. వేయి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు సేకరిస్తున్నట్లు వారు  చెప్పారు. రష్యా నుండి కూడా22 టన్నుల మేరకు ఆవిధమైన పరికరాలు, కోవిడ్  మందులూ మే 1 న  గ్రాంట్ రూపంలో అందుకున్నారు.  

అమెరికా, రోమానియా, ఐర్లాండ్, ఇంగ్లాండ్  వంటి దేశాల నుండి ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, కొన్ని మందులు  మే 2 వ  తేదీన కూడా  అందాయి. అమెరికాతో జాతీయ రక్షణ సలహాదారు ధోవల్ , విదేశాంగ మంత్రి జయశంకర్  వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు  చర్చిస్తూ, వారి సహాయ కార్యక్రమాల గురించి సమీక్షిస్తున్నారు.

అమెరికా జాతీయ ప్రయోజనాలు, అవసరాలు తీరిన తరువాతే ఇండియా విషయం ఆలోచిస్తామని  ప్రకటించిన వాళ్ళు ఈలోగా కొన్ని తీయటి మాటలు మాత్రం చెబుతున్నారు. వారి షరతులకు మన అంగీకారం పొందిన తరువాతనే “సహాయం” పంపిస్తున్నారు. తైవాన్ వంటి చిన్న ప్రాంతాల నుండి కూడా 50 కాన్సెంట్రేటర్లు, 500 ఆక్సిజన్  సిలెండర్లు  సహాయంగా స్వీకరించారు. 

అయితే  ఆధిపత్య దేశాల వ్యాపార ధాష్టీకాన్ని దాచి పెట్టి, భారత ప్రజలంతా ఆ వ్యాపార దేశాలపట్ల  కృతజ్ఞతాభావంతో  మెలగాలన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఆ దేశాల వదాన్యత ను వేనోళ్ల పొగుడుతున్నారు. ఆపదలో ఆదుకున్న వాళ్లకు ధన్యవాదాలు చెప్పటం కనీస మానవ సంస్కారమే కానీ మన పాలకులు ఈ సుగుణాన్ని అందరి పట్ల ప్రదర్శించటం లేదు మరి. మన పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనా అందరికంటే ముందుగా సహాయాన్ని ప్రకటిస్తే , దాన్ని స్వీకరించటానికి సిద్దపడలేదు. పైగా వాటిని శత్రు రాజ్యాలుగా భావించి , మనను అవమాన పరచటానికే సాయం ప్రకటించారని దురుద్దేశాలు అంట గట్టారు.

ఇక మీడియా కూడా మన విషాద స్థితిలో  సైతం చైనా మనకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని,  వస్తున్న సాయానికి కూడా అడ్డంకులు సృష్టిస్తోందని అభూత కల్పనలు చేశారు. చివరకు పేరున్న సినీ నటులు కూడా ఈ చైనా వ్యతిరేక ప్రచారంలో గొంతు కలిపారు. పశ్చిమ దేశాల నుండి వచ్చే  సహాయం కోసమే  ఎదురు తెన్నులు చూస్తున్నారు.  మరి వాస్తవాలు ఎలాగున్నాయి?

గతంలో చైనా వస్తువులు  బహిష్కరించాలనీ, చైనాతో వ్యాపార సంబంధాలు పూర్తిగా తెంచివేసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం జరిపారు. ప్రభుత్వం కూడా ఈ ఉద్దేశాలను సమర్ధిస్తున్నట్లుగా కొన్ని బహిరంగ చర్యలకు  దిగింది.

కానీ వాస్తవంలో 2020 సంవత్సరంలో చైనాతో వ్యాపారం  ఆపలేదు. రెండు దేశాల మధ్య 7767 కోట్ల  డాలర్ల  వ్యాపారం జరిగినది,(2019 లో ఈ వ్యాపారం 8547 కోట్ల డాలర్లు వుంది. ) ఇదే సమయంలో అమెరికాతో మన వ్యాపారం 7595 కోట్ల  డాలర్లు మాత్రమే వుంది. అంటే ఇద్దరి తోనూ దాదాపు సమాన పరిమాణమే.  యుద్ధాలు, రక్త పాతాలు, జాతీయోన్మాద ప్రలాపాలు పెచ్చు మీరిన  ఈ సంవత్సరంలో కూడా  చై నాతో వ్యాపారం స్వల్పం గానే తగ్గింది. అంటే ఆర్ధిక లావాదేవీలు జరుపుతూనే, తమ లాభాలు తాము మూట గట్టుకుంటూనే  పైకి మాత్రం ప్రజలలో చైనా వ్యతిరేక ఉన్మాదం పెంచి పోషించారు. దీనికి రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలే  కారణమన్నది నిజం. 

 ఈనాటి మార్కెట్ల ప్రపంచీకరణలో దేశాల మధ్య ఈ సంబంధాలు ,ఒకరి మీద మరొకరు ఆధారపడటం  చాలా సహజమైన విషయం కానీ మన పాలకులు  ఈ వాస్తవాన్ని విడమరచి  చెప్పకుండా, బూటకపు జాతీయవాదాన్ని, కపటత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక చేత సాయం పొందుతూనే  మరోపక్క దాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. మీడియా కూడా ఈ సాయాలను  కనీసంగా అయినా  ప్రస్తావించటం లేదు. 

మే 2 న చైనా అధ్యక్షుడు జీ జీన్ పింగ్ మన ప్రధానికి, వారి విదేశాంగ మంత్రి వాంగ్, మన విదేశాంగ మంత్రి శ్రీ జయ శంకర్ కి  కరోనాను  ఎదుర్కోవటం లో తాము భారత దేశానికి  అన్నివిధాలా సహాయపడతామని సందేశం పంపారు. ఆ మరునాడు  వాంగ్ ,  జయ శంకర్ తో ఇదే విషయం ఫోను చేసి  చెప్పారు.

సరిహద్దుల వద్ద సంఘర్షణ  జరిగిన తరువాత వారు చొరవ తీసుకుని ఇలా  తమ సుహృద్భావం ప్రకటించారు.  ఈ దశలో భారత్ లో వున్న చైనా రాయబారి శ్రీ సన్ వి డాంగ్  చేసిన ప్రకటనలో వారు అందిస్తున్న సహాయం ఏమిటో కూడా  తెలిసింది. 

చైనా కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం కరొన తీవ్రమవుతున్న స్థితిలో ఈ  ఏప్రియల్ నుంచి చైనా 5000 వెంటిలేటర్లు, 21569 ఆక్సిజన్  జనరేటర్లు, 14 కోట్ల మాస్కులు, 3800 టన్నుల మందులు అందించింది. చైనాలో మేడే సెలవులు తీసుకోకుండా వోవర్ టైము పని చేసీ, ఇండియా నుంచి వచ్చిన ఆర్డర్లు  పూర్తి చేస్తామని  కొన్ని మందుల ఉత్పత్తి దారులు, ఇతర లాజిస్టిక్ కంపెనీలు స్వచ్చందంగా నిర్ణయించుకున్నారు. ‘తమ ప్రజల ప్రాణాలు కాపాడటానికి   అవసరమైన ఈ వస్తువుల కోసం మా ఇండియా కస్టమర్లు ఎదురు చూస్తున్నారని’  వారు చెప్పినట్లు  మీడియాలో  రిపోర్టులు వచ్చాయి.  దాదాపు 25000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు కు ఈమధ్య కాలం లోనే ఆర్డర్లు వచ్చినట్లు చైనాలోని సప్లైదారులు చెప్పారు. 

“గత కొన్ని వారాలుగా చైనా నుండి ఇండియాకు అత్యవసరంగ కావలసిన మందులతో  సరుకులు చేరవేసే విమానాలను నడుపుతున్నారు. ఆక్సిజన్ జనరేటర్లు, తదితర వైద్య పరికరాలు తీసుకుని ఒక విమానం ఈ ఉదయం 11.15 గంటలకు చైనాలోని తీయాన్ జేన్ నుండి బయలుదేరింది”  అని మే 2 న చైనా రాయబారి చెప్పారు.

వైద్య సామాగ్రి, సాధనాలతో వున్న కార్గో విమానాల రాకపోకల లో  ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా కస్టమ్స్ శాఖ తగిన  ఏర్పాట్లు చేస్తున్నట్లు  రాయబారి వరుస ట్వీట్లలో తెలిపారు. ఆయన ఒక ఈ-మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చి  భారతీయ దిగుమతి దారులు, కష్టమర్లు ఏ విధమైన అసౌకర్యానికి గురి అయినా,  తన దృష్టికి  తెస్తే తన శక్తి మేరకు  సహాయం చేయగలనని ఆయన ప్రకటించాడు. 

చైనా అధికారులు, వుత్పత్తి దారులు ఇంత సహకార వైఖరిని అవలంబిస్తుంటే మన  ప్రభుత్వమూ, మీడియా కనీస స్నేహభావం కూడా ప్రదర్శి చటం లేదు. 

 డిల్లీ నగరం లో  ఉన్న అనేక  దేశాల దౌత్య కార్యాలయాల లోని  సిబ్బంది కరోనాకు గురి అవుతున్నారు. తమకు కావలసిన  ఆక్సిజన్  సిలెండర్ల వంటి వాటి కోసం ఫిలిప్పీన్ ఎంబసీ, న్యూజీలాండ్  హైకమీషన్ భారత ప్రభుత్వాన్ని కాక కొన్ని ప్రయివేటు సంస్థలను, కాంగ్రెస్ వలంటీర్లను ఆశ్రయించారు. ఆస్ట్రేలియా  ప్రధాని, ఇండియా నుంచి ఎవ్వరినీ తమ దేశంలోనికి  అనుమతించమనీ, ఆస్ట్రేలియా పౌరులయినా అలా వస్తే ఖైదు చేస్తామని ప్రకటించాడు.   ఇండియాలో వస్తున్న వైరస్ రకాలు చాలా ప్రమాదకరం కనుక వీరిని  అమెరికా లో ప్రవేశించ వద్దని అమెరికా  అనేక నిషేధాలు, ఆంక్షలు విధించింది.  

ఇవన్నీ భారత దేశం లో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా వుందని అంతర్జాతీయంగా భావిస్తున్నారో  తెలుపుతాయి.  ఈ స్థితిలో రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి కరోనాపై పోరులో పూర్తి సహకారం అందిస్తామంటున్న చైనా స్నేహవచనాలను మన ప్రభుత్వం ఎందుకు పెడ చెవిని  పెడుతున్నదీ  ప్రజలకు అర్ధం కావటం లేదు.  తమ వ్యాపార చక్రబంధం లో ఇరికించి, తద్వారా మన దేశ వనరులను కొల్లగొడుతున్న ఆధిపత్య వాదుల  చెంతకే  మన పాలకులు ఎందుకు పరుగులు  తీస్తున్నదీ ప్రజలు నిశితంగా పరిశీలించాలి. 

కరొనను అరికట్టడానికి అత్యుత్తమ ఆయుధం వ్యాక్సిన్. అందుకే ధనిక దేశాలు తమ జనాభాకు మించిన వ్యాక్సిన్ డోసులు  కొనుగోలు చేసి నిలువ చేసుకుంటున్నాయి . దీనితో పోటీ పెరిగి పేద,మధ్యస్థ  దేశాలకు వ్యాక్సిన్లు లు అందుబాటులో లేకుండా పోయాయి. అధిక ధర చెల్లించి  కొనుగోలు చేయలేని స్థితిలో వారున్నారు.

చైనా అభివృద్ధి చేసిన ఖరీదు తక్కువ వ్యాక్సిన్లపై  నాణ్యతలేనివన్న ప్రచారం చేసి వాటిని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. చైనా పై పోటీలో భాగంగా  మన ప్రభుత్వం కూడా టీకాల దౌత్యానికి పాల్పడి , మనదగ్గర వ్యాక్సిన్లు ఇవ్వకముందే 7 కోట్ల డోసులు దాదాపు 90 దేశాలకు పంపించింది.  ఇప్పుడు పరిస్థితి విషమించి  మనకే  టీకాలు లేని పరిస్థితి వచ్చింది . పశ్చిమ దేశాల నుండి టీకాలు దిగుమతి చేసుకోవాలని తలపోస్తోంది. టీకాలపై పేటెంట్ హక్కులు తీసివేస్తే ఉత్పత్తి పెంచుకోగలమని  భారత్   ప్రతిపాదన చేసింది. ఆయాదేశాల  కంపెనీలు తమ లాభాలు తగ్గిపోతాయని  భావించి  దీనికి ఒప్పుకోవటం లేదు. వ్యాక్సిన్ల సరఫరా  లో కూడా  మానవత బదులు సామ్రాజ్యవాద రాజకీయ ఆర్ధిక   ప్రయోజనాలు  పై చెయ్యి సాధిస్తున్నాయి. ఇక సహాయం అనే మాటకు అర్ధమై లేదు.  

  మన దేశంలో సరిపోయినన్ని టీకాలు లేక , ప్రజలు వాటి కోసం  ఆతృతగా ఎదురు చూస్తుంటే,  మన సీరమ్ ఇన్స్టి ట్యూట్ ఉత్పత్తుల మీద కన్ను వేసిన  బ్రిటన్, గతంలో వారితో  చేసుకున్న ఒప్పందాలను సాకుగా చూపి, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని  బెదిరించి, వొత్తిడి చేసి, వాక్సిన్‌లు తరలించుకు పోతున్నది  బోరిస్ జాన్సన్ ( బ్రిటిష్ )ప్రభుత్వం. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్  ఈ సమయం లో భారత దేశానికి ,సముద్రమార్గాలను తనిఖీ చేసే ఆరు P 81 యుద్ధ  విమానాలను  అమ్మే ప్రయత్నం చేస్తున్నది. భారత ప్రభుత్వం 2019 లో ఇలాంటి 10 యుద్ధ విమానాలు  కావాలని అమెరికాను  అడిగింది, కానీ ఆ తరువాత  డబ్బులు లేవని తన ప్రతిపాదనను  ఆరు విమానాలకే  కుదించుకుంది. అప్పటి ప్రతిపాదనను ఆధారం చేసుకుని,  ఇప్పుడు  242 కోట్ల డాలర్ల విలువ గల అమ్మకానికి  అమెరికా ప్రభుత్వం ఈ వారం లో అనుమతి ఇచ్చింది. 

ఈ ఉదంతాలు చూస్తే అర్ధం కావటం లేదా? 

 సామ్రాజ్యవాదులు  ప్రతి సందర్భాన్ని లాభాలు పోగు చేసుకునే అవకాశం గా చూస్తారని , భారత దళారి పెట్టుబడి దారునికి మన  జాతీయ  ప్రయోజనం కాపాడే స్వాతంత్ర్యం లేదనీ, సామ్రాజ్యవాద  యజమానికి  సేవ చేయటం కోసమే అతని అధికారం వినియోగ పడుతున్నదనీ.  

ఈ వర్గ స్వభావ  ఫలితంగానే మన పాలకులు చైనా వ్యతిరేకత తో రగిలిపోతున్నారు. పాండమిక్ స్థితిలోనూ విద్వేషాన్ని, వివక్షను పాటిస్తున్నారు . అమెరికా చతుష్టయంలో చేరి పరవశ మవుతున్నారు. దేశ భక్త భారతీయులు దీనిని కొనసాగనిస్తారా?

 

(డాక్టర్ జతిన్ కుమార్ హైదరాబాద్ లో శస్త్రచికిత్స నిపుణుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *