అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కోవిడ్ సంకోభాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటున్న ఆసుపత్రుల మీద విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ఇప్పటిదాకా 30 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. వివిధ రకాల అక్రమాలకు పాల్పడుతున్న ఆరు ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
డబ్బుకు ఆశపడి ఎక్కువ మంది రోగులను చేర్చుకోవడం, ఆరోగ్యశ్రీ రోగులను చేర్చుకునేందుకు నిరాకరించడం, అత్యవసరమయిన ఇంజక్టన్ రెమ్డెసివిర్ ఎక్కువ ధరలకు విక్రయించడం, ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపుల్లో ఔషధాల అమ్మకాల రికార్డులు లేకపోవడం వంటి అవకతవకలున్నట్లు గుర్తించారు. ప్రకృతి వైఫరీత్యాల చట్టం, ఔషధ నియంత్రణ చట్టం కింద ఈ ఆసుపత్రుల మీద కేసులు నమోదు చేశారు.
పిడుగురాళ్లలోని పల్నాడు ఆస్పత్రి, అంజిరెడ్డి ఆస్పత్రి,చిత్తూరులోని సుభాషిణి ఆస్పత్రి, విజయవాడలోని వేదాంత ఆస్పత్రి,శ్రీకాకుళంలోని సూర్యముఖి ఆస్పత్రి, కడపలోని సిటీ కేర్ ఆస్పత్రికి కొవిడ్ పేషెంట్లను చేర్చుకునే అనుమతి రద్దు చేశారు.ఈ ఆరు ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు పెట్టారు.
చిన్న చిన్న ఆసుపత్రుల మీదే కాకుండా పెద్ద పెద్ద ఆసుపత్రుల మీద కూడా దాడులు సాగాలని, వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని, అత్యవసర మందుల బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కూడా చర్యలుండాలని ప్రజలు కోరుతున్నారు.