నాగార్జున సాగర్ లో TRS ఘనవిజయం…

టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను  భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు.

భరత్ తండ్రి నోముల నరసింహయ్య అకస్మిక మరణంతో ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగింది.

ఇక్కడ పోటీ హోరా హోరీగా సాగింది. కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు కె జానారెడ్డి నిలబడ్డారు. బిజెపి తన దుబ్బాక్ నుంచి మొదలయిన కాషాయం గాలి  సాగర్ తీరానికి సాగుతుందని భావించింది. అదేమీ జరగలేదు. మొత్తానికి ఈ ఎన్నిక క్యాంపెయిన్ ను  కెసిఆర్  ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయంగా నడిపించారు.  రెండు బహిరంగ సభల్లో మాట్లాడారు. ఆయన కరోనా సోకింది కూడా సాగర్ సభలోనే నని చాలా  మందికి అనుమానం. ఏదిఏమయిన టిఆర్ ఎస్ అఖండవిజయం సాధించింది.

టిఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సిఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సిఎం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామని సిఎం తెలిపారు. ఎన్నికల సందర్భంలో పార్టీ నాయకులు సేకరించిన ప్రజా సమస్యన్నింటిని కూడా సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఆయన ఇచ్చారు.

ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా.. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన ప్రజలకు సిఎం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు ప్రజాసేవకు టిఆర్ఎస్ పార్టీ మరింతగా పునరంకితమౌతుందని.. సిఎం మారోమారు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
విజయం సాధించిన అభ్యర్ధి నోముల భగత్ కు సిఎం కెసిఆర్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. చక్కగా ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని నోముల భగత్ కు సిఎం సూచించారు.
నోముల భగత్ విజయం కోసం కృషి చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సిఎం అభినందనలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *