ఏప్రిల్ 28, తిరుమల 2021: లోకసంక్షేమం కోసం, కరోనా మహమ్మారిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ మే 3 నుండి 18వ తేదీ వరకు తిరుమలలో షోడశదిన సుందరకాండ అఖండ పారాయణం జరుగనుందని తిరుమల తిరుపతి దేవస్థానాల సంస్థ (TTD) తెలిపింది.
తిరుమలలోని వసంత మండపంలో ప్రతిరోజూ ఉదయం 16 మంది వేద, శాస్త్ర పండితులతో పారాయణదీక్ష చేపడతారు. అలాగే మరో 16 మంది వైఖానస పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో జప, తర్పణ, హోమాదులు నిర్వహిస్తారని టిటిడి ఒక ప్రకటనలో పేర్కొంది.
షోడశదిన సుందరకాండ అఖండ పారాయణలో జప – తర్పణ – హోమాదులు సకలశుభాలను ప్రసాదిస్తాయి. ఆయురారోగ్యాలు వెంటనే అనుగ్రహిస్తాయి.
శ్రీమత్ సుందరకాండ ఒక మహామంత్ర అక్షర సముదాయం. హనుమద్వైభవ సౌందర్యం. హనుమద్వర్ణిత సీతారామ సౌందర్యం. సీతాసాథ్వి పాతివ్రత్య ప్రభావ సౌందర్యం ముందు భౌతికంగా సుందరమైన లంక వెలవెలపోయింది. ఈ సుందరమైన కాండలో ప్రతి అక్షరం మంత్రాక్షరమే. అమృతస్వరూపమే. సుందరకాండ దీక్షగా చేసే పారాయణానికి అనేక పద్ధతులున్నాయి.
సర్వవిపత్తులు తొలగడానికి, సకల సంపదలు కలగడానికి, శత్రుపీడ నివారణకు, నష్టవస్తువులు తిరిగి లభించడానికి, ఆపదలు తొలగడానికి, వ్యాధులు నయమవడానికి, తలపెట్టిన ధర్మకార్యముల ఫలాన్ని పొందడానికి, భగవదనుగ్రహానికి, గ్రహదోష నివారణకు ఇలా ఎన్నో మహాఫలాలను ప్రసాదించే శక్తి ఉన్న మహామంత్రం శ్రీమత్ సుందరకాండ. ఈ పారాయణ దీక్షలో షోడశదిన సుందరకాండ పారాయణం ఏకావృత్తిగా చేయడానికి ఒక పద్ధతి ఉంది. అంటే 16 రోజులలో క – ట – ప – యాది సంకేతాక్షరాలతో పారాయణ చేసే పద్ధతి. ఇది చాలా ప్రసిద్ధమైనది. అంటే ఒక్కో దశకంలో ఉండే అక్షర సంఖ్యను బట్టి ఆ అక్షర మార్గదర్శనంలో అన్ని సర్గలు పారాయణం చేయడం – దీనికి ఆధారంగా రెండు పాదాలున్నాయి.