కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ఎంతకాలం పనిచేస్తుంది?

ఈ ప్రశ్న ప్రపంచ శాస్త్రవేత్తలను, ప్రజలను పీడిస్తూ ఉంది. ఈ ప్రశ్నకు  ప్రపంచంలో ఎవరి దగ్గిరా సరైన సమాధానం లేదు.అందుకే చాలామంది వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా, వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనే సంశయంలో కొట్టు మిట్లాడుతూ ఉంటారు.

అసలు కోవిడ్-19 అనేది మనిషికి తెలిసిన ఇటీవలే పరిచమయిన  కొత్త జబ్బు కావడంతో వ్యాక్సిన్  తీసుకుంటే అది శరీరంలో ఎంత కాలం కోవిడ్ రోగం రాకుండా అడ్డుకుంటుందో ఎవరికీ తెలియదు.

కాబట్టి వ్యాక్సిన్ ప్రభావం ఎంతకాలం ఉంటుంది? ఆరునెలలా,  ఏడాది,  రెండేళ్లా…? ఈ ప్రశ్నకు సింపుల్ సమాధానం ‘తెలియదు’ అని బోల్డ్ గా చెప్పుకోవాలి.

ఎందుకంటే,  వ్యాక్సిన్ ప్రభావం మీద పరిశోధనలు ఇంకా  జరుగుతూనే ఉన్నాయి. నిజానికి అసలు ప్రయోగాలు మొదలయి ఇంకా అర సంవత్సరం కూడా కాలేదు.

కోవిడ్ వ్యాక్సినేషన్ మొదలయి చాలా దేశాల్లో ఆరునెలలు కాలేదు. భారతదేశంలో మొదటి వ్యాక్సిన్ ని జనవరి 16 వ తేదీన ఢిల్లీలో మనీష్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చారు. అంటే ఆరు నెలలు ఇంకా కాలేదు.

అమెరికాలో డిసెంబర్ 14న తొలి వ్యాక్సిన్ ని న్యూయార్క నగరంలోని  ఒక ఆసుపత్రి ఐసియులో పనిచేసే ఒక నర్సుకు ఇచ్చారు. అంటే ఆమె శరీరంలో ఆరు నెలల తర్వాత ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియాలంటే ఆరు నెలలు వచ్చే దాకా ఆగాలి. అంటే మే దాకా ఆగాలి.

అమెరికాలో ఫైజర్ (Ffizer) అనే కంపెనీ తొలి వ్యాక్సిన్ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సంస్థ అంచనా ప్రకారం రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాక ప్రభావం  కనీసం అరునెలలు అంటుంది. ఈ కంపెనీ పరిశోధనల్లో ఆరునెలల తర్వాత కూడా యాంటిబాడీలలో తగ్గుదల కనిపించలేదు.

ఇదే విధంగా  మాడెర్నా (Moderna) వ్యాక్సిన్ (mRNA-1273) తీసుకున్నాక ఆరునెలల తర్వాత కూడా యాంటీబాడీలు దృఢంగా ఉండటం పరిశోధనల్లో కనిపించింది. 209 వ రోజు నాటికి కూడా యాంటీబాడీలున్నట్లు మాడెర్నా వ్యాక్సిన ప్రభావం మీద జరిగిన పరిశోధన లో తేలింది.ఈ పరిశోధన వివరాలు  The New England Journal of medicine లో వచ్చాయి.

“…antibodies that were elicited by mRNA-1273 persisted through six months after the second dose, as detected by three distinct serologic assays,” అని ఈ అధ్యయనం చేసిన వారు రాశారు.

వ్యాక్సిన్ ప్రభావం ఎంతకాలం ఉంటుందో కరెక్టుగా చెప్పలేకపోవడానికి కారణం, శాస్త్రవేత్తల దగ్గిర ఇపుడున్నది కేవలం ఆరు నెలల డేటా మాత్రమే.

మరొక ఆరునెలలు పోతే, ఒక ఏడాది డేటా అందుబాటులోకి వస్తుంది. ఆపైన మరొక ఏడాడి గడిస్తే వ్యాక్సిన్ ప్రభావం  రెండేళ్ల తర్వాత శరీరంలో ఎలా ఉంటున్నదో తెలుస్తుంది. అంత వరకు ఆగాలి.అదీ పరిస్థితి.

అయితే, అమెరికా టూసాన్ (Tucson)లోని అరిజోనా యూనివర్శిటీకి ఇమ్యూనో బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్  దీప్తా భట్టాచార్య మాత్రం చాలా కాలం కొంతవరకైనా వ్యాక్సిన్ లు కరోనానుంచి రక్షణ కల్పిస్తాయని నమ్మకంగా చెబుతున్నారు.

ఫైజర్, మాడెర్నా వ్యాక్సిన్ ల మొదటి డోస్ తో ఒక మాదిరి రక్షణ ఉంటుంది. రెండో డోస్ తో శరీరంలో ని యాంటిబాడీ సెల్స్, టి సెల్స్ ఒక్కసారిగా పెల్లుబుకుతాయి. టిసెల్స్ అంటే ఒక రకమయిన తెల్ల రక్తకణాలే. ఇవి శరరంలోకి ప్రవేశించిన వైరస్ లను నాశనం చేస్తాయి.  ‘క్రమంగా ఇమ్యూనిటీ తగ్గిపోయేందుకు చాలా ఆస్కారం ఉంది.అయితే,వ్యాక్సిన్ లతో  కొంతవరకు రక్షణ పొందవచ్చు,’ నని ఆయన వాల్ స్ట్రీట్ జర్నల్ కు  చెప్పారు.

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తీసుకున్నపుడు రెండు వారాలనుంచి 70 రోజుల మధ్య యాంటీబాడీస్ పెరగడం కనిపించింది.

వ్యాక్సిన్ లతో జీవితాంతం రక్షణ ఉంటుందా?

వ్యాక్సిన్ ల ప్రభావం ఎంతో కొంత సంవత్సరాల తరబడి ఉండే అవకాశం లేకపోలేదని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనికి కొన్ని అధ్యయనాలను ఉదహరిస్తున్నారు. ఉదాహరణకు  కోవిడ్-19 జబ్బు తీసుకువచ్చే వైరస్ ను పోలిన్ SARS  వైరస్ లకు వ్యతిరేకంగా ప్రయోగించిన వ్యాక్సిన్ లమీద 2020 జూలైలో  Nature జర్నల్ లో  ఒక రీసెర్చ్ పేపర్ అచ్చయింది. దీని ప్రకారం SARS కోసం తీసుకున్న వ్యాక్సిన్ ప్రభావం  17 సంవత్సరాల తర్వాత కూడాకనిపించింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో  T Cell Immunity కొనసాగుతూ ఉండటం కనిపించింది.

అలాగే మరొక అద్భుతమయిన విషయం  2008లో Nature లోనే అచ్చయిన మరొక పరిశోధన వెల్లడించింది. 1918లో ఇన్ ఫ్లుయంజా పాండెమిక్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఉపద్రవంలో బతికి బయటపడిన  వారిలో తిరిగి ఒక అదే ఇన్ ఫ్లుయంజా వైరస్ ను ఎక్కిస్తే  శరీరంలోని మెమెరీ బి సెల్స్ (memory B cells)వాటికి వ్యతిరేకంగా 9 దశాబ్దాల తర్వాత కూడా యాంటీబాడీలను సృష్టించాయి. మెమొరి బి సెల్స్ అనేవి కూడా ఇన్ ఫెక్షన్ సోకినపుడు శరీరంలో తయారయ్యే ఒక రకమయిన యాంటిబాడీలే. ఇవి వైరస్ తో పోరాడుతున్నపుడు వైరస్ ను గుర్తుపెట్టుకుంటాయి. రెండో సారిఇదే వైరస్  మళ్లీ దాడి చేసినపుడు ఇవి పాత యుద్ధం గుర్తుకు తెచ్చుకుని అపుడు సృష్టించిన యాంటిబాడీల సైన్యాన్ని ఇపుడు కూడా సృష్టించి మనిషిని కాపాడే యత్నం చేస్తాయి. కాబట్టి కొన్ని వ్యాక్సిన్ లు తయారుచేసిన యాంటిబాడీలు ఎంతకాలమయినా పనిచేస్తూనే ఉంటాయని అనుకోవాలి.

కరోనా వైరస్ కొత్త వేరియాంట్స్ వ్యాక్సిన్ శక్తిని దెబ్బతీస్తాయా?

దీనిని వూహించడం కష్టం.

ఇంతవరకు  మనకు తెలిసిన వైరస్ వేరియాంట్స్ నుంచి మాత్రమే వ్యాక్సిన్ లు భద్రత కల్పిస్తాయి. కాని ఇలా వ్యాక్సిన్లు శరీరంలోకి ప్రవేశించినపుడల్లా వైరస్ నిరంతరం మ్యూటేషన్ల (మార్పులకు)కు  లోనవుతూ కొత్త కొత్త వేరియాంట్స్ ను పుట్టిస్తూ ఉంటుంది. వ్యాక్సిన్ ప్రభావాన్నుంచి తప్పించుకునే వైరస్ తయారు చేసుకునే వ్యూహం మ్యుటేషన్.

మానవ సమాజం సామూహిక రోగనిరోధక శక్తి(Herd Immuhity)అభివృద్ధి చేసుకుంటున్నపుడు వైరస్ మీద సెలెక్టివ్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అపుడు కొత్త వేరియాంట్స్ వస్తాయి. ఇక్కడే mRNA వ్యాక్సిన్ లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని దీప్తా భట్టాచార్య చెబుతున్నారు.

శరీరంలో సహజంగా వృద్ధి చెందే యాంటీబాడీల కన్నా చాలా ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీలనే mRNA వ్యాక్సిన్ లు సృష్టిస్తాయి. కొన్నివైరస్ వేరియాంట్స్ మనిషిలోని యాంటీబాడీలు వైరస్ ను చట్టుముట్టకుండా అడ్డుకున్నా,   యాంటీబాడీలు చాలా పెద్ద సంఖ్యలో తయారవుతాయి కాబట్టి వాటి వల్ల కొంత రక్షణ ఉంటుందని ఆయన చెబుతున్నారు. పోనీ,ఇది నిజంగానే జరుగుతుందునుకున్నా,  ఇది ఎంత మోతాదులో ఉంటుందో, ఎన్నేళ్లుంటందో ఎవరూ చెప్పలేరు. కారణం SARS-CoV-2 మనిషికి పరిచయయిందీ మధ్యే. అందువల్ల  ఈ వైరస్ ప్రభావం మీద పరిశోధనకు అయిదారు నెలల కంటే ఎక్కువ చరిత్ర లేదు. అందువల్ల ఏవిషయాన్ని స్పష్టంగా చెప్పేందుకు డేటా లేదు.

వ్యాక్సిన్ తీసుకున్నాక కోవిడ్ -19 జబ్బు వస్తే… ఏమవుతుంది?

ఇది కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అందుకే వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కోవిడ్-19 జబ్బు వస్తే, జబ్బు అంత తీవ్రంగా ఉండదని మాత్రం చెబుతున్నారు. ఇమ్యూన్ వ్యవస్థ కు రెండో సారి అనుభవం ఎదురయితే అది జాగ్రత్తలు తీసుకుంటుంది. అదెంత బలంగా ఉంటుంది, ఎంతకాలం సాగుతుంది? మళ్లీ అదే జవాబు.. తెలియదు, చెప్పలేం.