సీనియర్ పాత్రికేయుడు, వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమనేత, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీసభ్యులు కోసూరి అమర్నాథ్( 70) ఏప్రిల్ 20 వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు!
ఆ మధ్య ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశాలకోసం ఢిల్లీ వెళ్లివచ్చిన అమర్నాథ్ కరోనా బారినపడ్డారు!
గత కొద్దిరోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు!
ఆయన భార్య శ్రీమతి కృష్ణవేణి కూడా కరోనా బారినపడి చికిత్స పొంది కోలుకున్నారు!
వారి ఏకైక కుమారుడు శ్రీపద్ డెన్మార్క్ లో ఉంటున్నారు!
తల్లితండ్రుల అనారోగ్యం విషయం తెలిసి ఆయనమొన్ననే హైదరాబాద్ కు వచ్చారు!
జర్నలిస్ట్ యూనియన్ నేతలు కే. శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, నగునూరి శేఖర్, కె.విరహత్ అలీ తదితరులు అమర్నాథ్ ఆరోగ్య విషయమై తెలంగాణాప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేశారు!
ప్రభుత్వపెద్దలు, అధికారులు స్పందించారు!
అయితే ఆయనకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువఉండటంతో కోలుకోలేక పోయారు!
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో కోసూరి సీతారామరాజు, సుభద్రమ్మ దంపతులకు 1952 సెప్టెంబర్ 15 న అమర్నాథ్ జన్మించారు!
వారిది మధ్యతరగతి రైతు కుటుంబం!
ఎనిమిదిమంది అన్నదమ్ములు, ఇద్దరుఅక్కాచెల్లెళ్లు ఉన్న పెద్ద కుటుంబంవారిది!
అమర్నాథ్ ప్రాథమిక విద్యాభ్యాసం మాముడూరులోనూ, ఎస్.ఎస్.ఎల్.సి. పొలమూరు హైస్కూల్ లోనూ జరిగింది! భీమవరంలో పియుసి చదివారు!
తొలినుంచి విద్యలో బాగా రాణించిన అమర్నాథ్ చిన్నతనంలోనే ఇంగ్లీష్ భాషలో మంచిపట్టు సంపాదించారు!
ఆయన సమీపబంధువు ఎస్.ఆర్.దాట్ల కమ్యూనిస్టుపార్టీ ఎమ్మెల్యే!
తనఅన్నలు ఇద్దరుఆర్టీసీలో, మరొకరు రైల్వేలో ఉద్యోగాలు చేస్తూ ఏ.ఐ.టి.యు.సి. అనుబంధ కార్మిక సంఘాలలో క్రియాశీల నేతలుగా పని చేశారు!
దాంతో అమర్నాథ్ బాల్యంలోనే వామపక్షభావజాలం తో ప్రభావితులయ్యారు!
చిన్నతనం నుండి
బ్లిట్జ్ పత్రికను క్రమంతప్పకుండా చదివే అలవాటుఉన్న అమర్నాథ్ ఆ పత్రికలో “వక్స్ పాపులీ” కాలమ్ కు ఆరోజుల్లోనే రాస్తుండేవారు!
ఇంగ్లీష్ లో వచ్చినమార్కుల ఆధారంగాఆయన 1972 ప్రాంతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఎంపికయ్యారు!
పదేళ్లపాటు న్యూఢిల్లీలో యు.పి.ఎస్.సి.కేంద్రకార్యాలయం లో ఉద్యోగంచేశారు!
అప్పట్లోనే ఆయనకు భారత కమ్యూనిస్టుపార్టీ జాతీయ అగ్ర నేతలతో మంచి పరిచయాలు ఏర్ప డ్డాయి!
సి.పి.ఐ. కేంద్రకార్యాలయం అజయ్ భవన్ తోనూ,
ఏ.ఐ.టి.యు.సి. కేంద్రంతోనూ సంబంధాలు ఉండటంతో ఆయనకు కార్మికోద్యమంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది!
అయితే ఆరోగ్యకారణాలతో ఆయన ఉద్యోగాన్నివిడిచి ఆంధ్ర ప్రదేశ్ కు తిరిగి రావాల్సివచ్చింది!
1984 లో హైదరాబాద్ లో ఆంధ్ర భూమి లో సబ్ ఎడిటర్ గా చేరారు!
ఆతర్వాత విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ కేంద్రాల్లో చీఫ్ సబ్ ఎడిటర్ గా, న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు!
హైదరాబాద్ లోనే 2010 ప్రాంతంలో న్యూస్ ఎడిటర్ గా పదవీవిరమణ చేశారు!
ఆ తర్వాత ఎన్.ఎస్.ఎస్. వార్తా సంస్థకు కొంతకాలం పనిచేశారు!
కొన్నాళ్ళు ప్రజాతంత్ర వారపత్రికకు కూడా వ్యాసాలురాశారు!
ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్రఅధ్యక్షునిగా సేవలు అందించారు!
ఐ.జే.యు.జాతీయ కార్యవర్గ సభ్యునిగా, జాతీయకార్యదర్శిగా పని చేశారు!
ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ పాలక మండలి సభ్యునిగా రెండుసార్లు నియమితులయ్యారు!
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రెండుసార్లు సభ్యునిగా ఎన్నికయ్యారు!
“పాత్రికేయులపై దాడులు – వారి భద్రత” కు సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన సబ్ కమిటీకి చైర్మన్ గా దేశంఅంతా పర్యటించి చక్కని నివేదికను అందచేశారు!
పాత్రికేయుల పై దాడులుజరిగినా, పత్రికాస్వేచ్ఛకు భంగంవాటిల్లినా తక్షణం రంగంలోకి దిగడం ఆయనకు అలవాటు!
ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదులుచేసి వాటిపై చర్యలుతీసుకోవాలని పెద్ద పోరాటం సాగించేవారు!
గత పదిహేనేళ్లుగా దాదాపు అన్ని టీవీ న్యూస్ చానెళ్లలో విశ్లేషకునిగా ఆయన విశేషప్రాచుర్యం పొందారు!
ప్రస్తుతం ఐ.జే.యు.ప్రచురిస్తున్న “స్క్రైబ్స్ న్యూస్” ఆంగ్ల మాసపత్రిక సంపాదకునిగా పనిచేస్తున్నారు!
ఆయన సతీమణి శ్రీమతి కృష్ణవేణి ది కూడా పశ్చిమగోదావరిజిల్లా పెన్నాడఅగ్రహారం!
వారికి శ్రీపద్ ఒక్కడే కొడుకు. శ్రీపద్ తనకుటుంబంతో ఉద్యోగ రీత్యా డెన్మార్క్ లో స్థిరపడ్డారు!
అమర్నాథ్ ప్రత్యేకత ఆయనకు గల అపార జ్ఞాపక శక్తి!
రాజ్యాంగం,కోర్టులు,చట్టసభలు, రాజకీయఘటనలు, సినిమాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమం వంటి అంశాలలో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం అనిచెప్పాలి!
వాటిల్లో ఏదిఅడిగినా వెంటనే తడుముకోకుండా చెప్పగలిగే వ్యక్తి అమర్నాథ్ మాత్రమే!
గత పాతికేళ్ళుగా
ఏ.పి.యు.డబ్ల్యు.జే., ఐ.జే.యు., సంబంధించి నివేదికలు, పత్రాలు, తీర్మానాలు, వేజ్ బోర్డుకు వినతి పత్రాలు తయారుచేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు!
తోటినాయకులతో, కార్యకర్తలతో చక్కటిసంబంధాలు కలిగి యూనియన్ లో ఒకపెద్దాయనగా గౌరవంపొందారు!