“6 మాసాల నుండి జీతాలు లేక సతమతమవుతున్న 167 మంది తహశీల్దార్ల, ఇతర రెవెన్యూ ఉద్యోగుల జీతాలు ఉగాది పండుగకైనా ఇప్పించండి:
గత సంవత్సరము 2020 అక్టోబర్ మాసములో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) గారు తహసీల్దార్ల పదోన్నతులకు సంబంధించి శాఖాపరమైన పదోన్నతులు కమిటీ (డీ.పీ.సి) జరిపి 167 మంది తహసీల్దార్లను వారి వారి జిల్లాలలో ఖాళీగా వున్నా స్థానాలలో వారిని నియమించమని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అయితే, జిల్లా కలెక్టర్లు దానికి విరుద్ధముగా బదిలీలపై నిషేధము ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల ఒత్తిడితో, వారి స్వంత నిర్ణయాలతో 167 మంది తహసీల్దారులను, వారితో పాటు 183 మంది ఇతర రెవిన్యూ సిబ్బందిని బదిలీలు చేశారు.
అయితే, బదిలీలపై నిషేధం ఉందని వీరి జీతభత్యాలు నిలిపివేశారు. ఇది పూర్తి అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, విజయవాడ నేతలు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి , వి. గిరి కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పదోన్నతి ఎవరికైన సంతోషం కల్గించాలిగాని, ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ విభాగం విషాదానికిదారితీస్తున్నదని వారు వ్యాఖ్యానించారు. ఆరునెలలుగా జీతాలు లేక పోతే, పరిస్థితి ఎలా ఉంటుందో వూహించుకుని, వెంటనే జీతాలుచెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చి ఈ కుటుంబాలుకనీసం ఉగాది పండుగ జరుపుకేనేందుకు వీలుకల్పించాలని బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి , వి. గిరి కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రమోషన్లు పొందినందుకు శిక్షించవద్దని వారు కోరారు.
వారు ఇంకా ఏమన్నారంటే…
గత 6 మాసాల నుండి వీరందరికి జీతభత్యాలు అందక, కరోనా నుండి బయటపడి సంక్రాంతి కుటుంబ సభ్యులతో సంబరంగా జరుపుకోలేక నరకయాతన అనుభవిస్తూన్నారు. కుటుంబ నెలవారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన దారుణమైన పరిస్థితులలో నేడు రెవిన్యూ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు ఉగాది పండుగ జరుపుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం అడ్డగోలుగా బదిలీ చేసిన అధికారుల జీతాలు నిలపివేయాలి. కానీ, బదిలీలు చేసిన కలెక్టర్లు మాకు సంబంధం లేనట్లు మిన్నకుండిపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలిసిన ప్రభుత్వం వారిపై, చర్యలు తీసుకోకపోగా బదిలీఅయిన 167 మంది తహశీల్దార్లకు , మరొక 32 మంది డిప్యూటీ . తహసీల్దార్లు , 138 మంది SA/RI లు , 10 మంది జూనియర్ సహాయకులు , ముగ్గురు డ్రైవర్లు వెరసి 350 మంది రెవెన్యూ ఉద్యోగులకు 2020 సంవత్సరం అక్టోబర్ నుండి జీతాలు లేవు. దీని మీద ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. కానీ ఎలాంటి తప్పు చేయని ఈ రెవిన్యూ 6 మాసాల నుండి జీతభత్యాలు ఎందుకు అందుకోవడం లేదు. వారెందుకు బలిపశువులవుతున్నారు.
ఈ విషయాన్ని అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి APRSA పక్షాన తీసుకెళ్లినా ఇంకా కాలయాపన జరుగుతున్నది. ఉపశమన చర్యలు శూన్యం . నెలలు గడుస్తున్నా, సంబంధిత ఫైలు ముఖ్యమంత్రి గారి ఆమోదం పొందాల్సి ఉందని, బదిలీ చేసిన 6 మాసాల తర్వాత కూడా ఉన్నతాధికారులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.
కావున, తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలుగచేసుకుని ఒకవైపు పని ఒత్తిడి, మరో వైపు ప్రభుత్వం చెప్పిన పనులకు నిధులు లేక అప్పులు తెచ్చి మానసిక ఒత్తిడి కి గురి అవుతున్న 167 మంది తహశీల్దార్లకు, వారి పదోన్నతులు సందర్భంగా జరిగిన 183 మంది ఇతర రెవెన్యూ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించేందుకు ఏర్పాటు చేసి, వారంతా తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సంతోషంగా జరుపుకునే భాగ్యం కల్గించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు కోరుతున్నారు.