తెలంగాణ రాష్ట్రానికి మరో టెక్స్ టైల్  పరిశ్రమ

తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రముఖ టెక్స్ టైల్  కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. భారతదేశంలో రెడీమేడ్ వస్త్రాల తయారీలో ప్రముఖ పరిశ్రమగా పేరుగాంచిన గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఈ రోజు నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ప్రగతిభవన్లో టెక్స్ టైల్ శాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో పరిశ్రమలు మరియు ఐటీ శాఖ ఉన్నతాధికారులతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఇప్పటికే సిరిసిల్లలో తెలంగాణ ప్రభుత్వం సుమారు 65 ఎకరాల్లో పొద్దురు గ్రామ పరిధిలో ఏర్పాటు చేయనున్న అప్పారెల్ పార్కులో ఈ కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఇప్పటికే ఈ పార్కు కు సంబంధించిన మౌలిక వసతుల కల్పన పూర్తయింది.

ఈ పార్కు పూర్తయిన తర్వాత సిరిసిల్ల కేంద్రంగా పవర్లూమ్ పరిశ్రమ తో పాటు స్థూలంగా టెక్స్టైల్ మరియు అప్పారాల్ పరిశ్రమకి అద్భుతమైన అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కార్యాచరణతో ముందుకు పోతున్న తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు విజయవంతంగా ఈ పార్కు కి ప్రముఖ అప్పారెల్  కంపెనీని తీసుకురాగలిగింది.

ఈరోజు గోకల్ దాస్ ఇమేజెస్  కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుమిర్ హిందూజా మంత్రి కేటీఆర్ ను కలిసి తమ పెట్టుబడి కార్యాచరణను వివరించారు.

తమ కంపెనీ కార్యకలాపాల ద్వారా నేరుగా సుమారు 1100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఇందులో మహిళలకు 75 శాతం ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ఉన్న మహిళలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం తో కలిసి చేపడతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *