ఏప్రిల్ 20న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 71 వ యేట ప్రవేశిస్తున్నారు. అయితే, ఈ శుభ సందర్భానికి ఆయన రాజకీయ కష్టాలు ఎక్కువయ్యాయే కాని తక్కువ కాలేదు. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాజయం పాలయింది. తన వారుసుడునుకున్న కుమారుడు, నారా లోకేష్, మంగళగిరిలో ఓడిపోయారు. చంద్రబాబు ప్రపంచస్థాయి క్యాపిటల్ ప్రాజక్టు నుంచి మొదట లాభపడింది మంగళగిరి ప్రజలే. అయినా సరే వారు లోకేష్ కు ఓటేయలేదు. పంచాయతీ ఎన్నికల్లో, మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.వరసుగా మూడో పరాజయం ఇష్టం లేని చంద్రబాబు నాయుడు జిల్లాపరిషత్ ఎన్నికలను,మండల పరిషత్ ఎన్నిలను బహిష్కరించారు. ఇదే కారణంతో ఆయన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలను బహిష్కరించలేదు. ఈ ఎన్నికల ఫలితాలు ఆయన 71వ జన్మదినోత్సవనాటికల్లా వెలువడతాయి. అక్కడేదో మ్యాజిక్ జరగకపోతే, తిరుపతి ఎన్నికల ఫలితాలు జన్మదినోత్సవ వేడకలను విచారంలోముంచెత్తుతాయి.
చంద్రబాబు-లాలూప్రసాద్ కష్టాలు ఒకటే...
బీహార్ పెద్దాయన లాలూప్రసాద్ యాదవ్ చంద్రబాబు కంటే రెండేళ్లు పెద్ద. ఆయన 71వ జన్మదినం నాటి పరిస్థితి కూడా ఇదే. పశువులదాణ కేసులో 2013లో ఆయనకు మొదటి సారి ఐదేళ్ల జైలు శిక్షపడింది. దానితో ఆయన ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాజయం పాలయింది. భార్య రబ్డీ దేవీ, కూతురు, మీసా భారతి ఇద్దరు ఆర్ జెడి బలమయిన కేంద్రాల్లోనే ఓడిపోయారు. లాలూప్రసాద్ అంటేనే అవినీతి భారీ కటౌట్ అనే లాగా ఈ శిక్ష తర్వాత పత్రికలు ఆయన గురించి రాస్తున్నాయి. కార్టూన్లు గీస్తున్నాయి. ఆయన మళ్లీ కోలుకోకుండా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ కూడా ఆయనను అవినీతి భూతంలాగా చూపిస్తూ వచ్చింది.
ఈలోపు 2015 ఎన్నికలు వచ్చాయి. తన వారసుడిగా తేజశ్వి యాదవ్‌ను ఎంపిక చేశారు. కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఒక కుమారుడి పెళ్లిబంధం తెగిపోయే పరిస్థితి వచ్చింది. మరికొన్నికేసులలో శిక్ష పడేలాగా ఉంది. చాలా మంది పార్టీ వీడి బిజెపిలో చేరారు. అయితే, 2015 అసెంబ్లీఎన్నికల్లో నితిష్ తో చేతులు కలిపి పార్టీని గెలిపించారు. నితిష్ ముఖ్యమంత్రిగా జెడియు-ఆర్జెడి ప్రభుత్వం ఏర్పడింది. అయితే, ఒక ఏడాది గడించిందో లేదో సిబిఐ తేజశ్విమీద కేసు బుక్ చేసింది. తేజశ్వి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేయాలని నితిష్ సూచించారు. తేజశ్వి అంగీకరించలేదు. నితిష్ తానే రాజీనామా చేశారు. ముందే కుదుర్చుకున్నఒప్పందమా అన్నట్లు, ఆయన రాజీనామా చేస్తానే బిజెపి మద్దతు ప్రకటించింది. అంతే, మళ్లీ జెడియు-బిజెపి ప్రభుత్వం ఏర్పడింది.
దీనితో ఇంక ఆర్ జెడి పని అయిపోయిందనుకునారు. మరికొన్ని కేసుల్లో శిక్ష పడటంతో లాలూ ఇకజైలులో జీవితాంతం ఉంటారన్నారు. తేజశ్వికి పార్టీ నడిపే శక్తి లేదన్నారు, పప్పు అన్నారు. బీహార్ రాజకీయాలను రెండు దశాబ్దాలు శాసించిన నాయకుడి పార్టీ అంతరించిపోతుందనుకున్నారు. రాజకీయ పండితులు సంతాప వార్తలు రాసేశారు.
చంద్రబాబే ఇంకా పెద్ద దిక్కు!
ఇప్పటి చంద్రబాబు దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆయన కుమారుడికి పార్టీ నడిపే శక్తి ఉందోలేదో ఇంకా తేలలేదు. ఇపుడు పార్టీని బాబు ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి. పార్టీ కూడా కుమారుడి నాయకత్వంలో ఇన్ స్పైర్ అవుతున్నట్లు దాఖలా లేదు. ఉంటే ఈ పాటికే ఎక్కడచూసినా లోకేషే కనిపించలేదు. ఇంకా 70 యేళ్ల చంద్రబాబే పెద్ద దిక్కుగా ఉన్నారు.
తేజశ్వియాదవ్ ఆర్ జెడిని బతికించిన తీరు ఇది
మళ్లీ బీహార్ కొకసారి వెళ్దాం. తండ్రి లాలూ ప్రసాద్ జైలుకు పోవడం, కుటుంబంలో తగాదాలు రావడం, పార్టీ నుంచి ప్రముఖులు వెళ్లిపోవడం తేజశ్వియాదవ్ ని బాగా క్రుంగదీసింది. పార్టీని బతికించుకోవాలనే పట్టుదల పెరిగింది. ప్రతిపక్షనేతగా ఆయన విజృంభించాడు. చాలామంది కి తెలియదుగాని తేజశ్వి యాదవ్ స్కూలు రోజుల్లోనే చదవుమానేశారు (స్కూల్ డ్రాపౌవుట్) . టెన్త్ కూడా పూర్తి చేయలేదు. అయితే, ఆయన ఇంగ్లీష్ , హిందీలలో మంచి వక్త. రాజకీయాల్లో చావో రేవో సమస్య వచ్చింది. ఒక కొత్త నినాదం తీసువచ్చాడు. ‘నయీ సోచ్, నయాబీహార్’ అంటూ ఆయన రాష్ట్రమంతా తిరిగాడు. 2017లో తమ ప్రభుత్వం కూలిపోయినప్పటినుంచి ఏకధాటిగా తిరిగాడు. లాలూ కొడుకు రోడ్డెక్కాడనే టాక్ క్రియేట్ చేశాడు.
2020 ఎన్నికల్లో గెలిచి తీరాలి. లేకపోతే, పార్టీ పతనమవుతుంది. ఇదే లక్ష్యంతో తిరిగాడు.
సోషల్ మీడియాలో తండ్రికి, బిసిలకు వ్యతిరేకంగా వస్తున్న దాడిని తప్పికొట్టి ఆ ఫీల్డ్ ను మచ్చిక చేసుకున్నాడు. బిజెపి లాలూ మీద చేస్తున్నదాడులనుంచి పార్టీని కాపాడేందుకు, పార్టీ పోస్టర్ల మీద, బ్యానర్ల మీద నుంచి లాలూ ఫోటో తీసేశాడు. ధైర్యంగా తన ఫోటో పెట్టాడు. బాటా లాలూది, ఫోటో తేజశ్విది. లాలూ-ఆర్జెడిని తేజశ్వి-ఆర్జెడిగా మార్చాడు. రాష్ట్రంలో కొత్త కల కలం సృష్టించాడు.
చివరకు 2020 అసెంబ్లీ ఎన్నిక నాటికి ఏ పరిస్థితి తీసుకువచ్చాడంటే, వచ్చే ముఖ్యమంత్రి తేజశ్వియే అని అంతా అన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయన అన్నాయి.
ఇది పూర్తిగా నిజంకాలేదుకాని, అన్నింటికంటే పెద్దగా పార్టీగా ఆర్ జెడిని గెలిపించాడు. చివరకు ప్రధాని మోదీ నాయకత్వంలోని బిజెపికంటే ఒక సీటు ఎక్కువగా తెచ్చాడు. ఆర్జెడీ నాయకత్వంలోని మహాఘట్ బంధన్ ని సింగిల్ లార్జెస్ట్ గ్రూప్ గా చేశాడు. మహాఘట్ బంధన్ కి 110 సీట్లు వచ్చాయి. బీహార్ అసెంబ్లీ(243) లో 122సీట్లు వస్తేనే ప్రభుత్వం ఏర్పాటుచేయాలి. ఆర్ జెడి 75 సీట్లు వచ్చాయి. బిజెపికి 74 సీట్లు వచ్చాయి. ఇక గ్రూప్ తీసుకుంటే ఎన్ డిఎ కి 125 సీట్లు వచ్చాయి. దీనితో నితిష్ (43 సీట్లు) నే మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తూప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపికి అవకాశం వచ్చింది. అయితే, ప్రపంచం యావత్తు బీహార్ ఎన్నికల్లో నిజమయిన విజేత తేజశ్వి అని కీర్తించింది. కొత్త ఆర్జెడిని చూసి ప్రధానిమోదీ, ముఖ్యమంత్రి నితీష్ జడిసిపోయేలా తేజశ్వి చేశాడు. నార్త్ ఇండియాలో ఇంతవరకు బిజెపి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాని రాష్ట్రం బీహారే. లాలూ జైలుకు పోతూనే ఈ లక్ష్యం నెరవేరుతుందనుకున్నారు. వందసీట్లు పైగా వస్తాయనుకున్నారు. అది జరగకుండా తేజశ్వి అడ్డుకోగలిగారు. 31 సంవత్సరాల తేజశ్వి ప్రధానిమోదీ, ముఖ్యమంత్రి నితిష్ కుమార్ లు ఉధృత ప్రచారాన్ని ఎదుర్కొని ఆర్ జెడిని బతికించారు.
నారా లోకేష్ తేజస్వి పాత్ర పోషించగలరా?
ఇపుడు తెలుగుదేశం పార్టీ కూడ ఇలాగే మారాలి. ఇలాంటి కొత్త తరం నాయకత్వం టిడిపిలో వస్తుందా? టిడిపి కూడా ఆర్ జెడి లాగే కుటుంబ పార్టీయే. లీడర్ పార్టీలోనే పుట్టాలి. బయటినుంచి వచ్చే వీలులేదు. జూనియర్ ఎన్టీఆర్ ను దూరంగా పెట్టేందుకు ఇదే కారణమని అంటున్నారు. జూనియర్ వస్తే ఇపుడున్న పరిస్థితులు అనుకూలిస్తాయా అనేది కూడా అనుమానమే. అందువల్ల పార్టీని గట్టెక్కించాలంటే మిగిలింది నారాకుటుంబ సభ్యలే. ఇందులో ముందున్న వ్యక్తి నారాలోకేష్ మాత్రమే. మరి ఆయన టిడిపిలో తేజశ్వి యాదవ్ కాగలరా?
పార్టీ లో చంద్రబాబు నాయుడి నాయకత్వానికి ఎలాంటి సవాల్ ఎదురుకావడం లేదు. ఆయనే తిరుగులేని నాయకుడు. అయితే, చంద్రబాబు నాయుడి అనుభవాలు, రాజకీయ వ్యూహాలు చాలా పాతవి. ఎపుడో కాంగ్రెస్ కాలం నాటివి. అటువైపేమో కొత్తతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ఎత్తులు పైఎత్తులు వేసి 2024 గెలవాలని చూస్తున్నారు. 2024లో గెలవడం అధికార స్థిరీకరణకు జగన్ కు ఎంత అవసరమో, పార్టీ ని కాపాడుకునేందుకు వచ్చే ఎన్నికల్లో గెలవడం తెలుగుదేశం పార్టీకి అంతే అవసరం. ఇలాంటపుడు జగన్ వ్యూహాలకు ధీటుగా పార్టీని 71 సంవత్సరాల వయసులో చంద్రబాబు తీర్చిదద్దగలరా? అలా కానిపక్షంలో తాను పక్కకు వైదొలగి, నారాలోకేష్ కు పూర్తి నాయకత్వం ఇస్తారా?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు లోకేష్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు. అధికారంలో ఉన్నపుడు కొడుకు మంత్రిని చేయడం ఒకెత్తు, అధికారంపోయి, పార్టీ బలహీనపడుతున్నపుడు పట్టాభిషేకం చేయడం మరొక ఎత్తు. ఒక వేళ ఆయన నారా లోకేష్ కుపూర్తి బాధ్యతలప్పగిస్తే తేజస్విలాగా కొత్త రక్తంతో, కొత్త నినాదాలతో టిడిపి ఉత్తేజపరచగలరా? 71వ జన్మదినం నాడు చంద్రబాబు ఇలాంటి నూతన ప్రకటన చేస్తారా?
టిడిపి ముందున్నవన్నీ ప్రశ్నార్థకాలే!