(టి.లక్ష్మీనారాయణ)
కృష్ణపట్నం ఓడరేవులో ముందు 75% వాటాలను సొంతం చేసుకొన్న ఆదానీ గ్రూప్ (Adani Ports and Special Economic Zone -APSEZ) మిగిలిన 25% వాటాలను కూడా రు.2800 కోట్లకు కొని, మొత్తం కంపెనీని సొంతం చేసుకొన్నది. విశాఖలోని గంగవరం పోర్టును ఆదానీ గ్రూప్ కొన్నది.
గత అక్టోబర్ లో 75 శాతం వాటాని రు.13,675 కోట్లకు కొనుగోలు చేసింది. ఇపుడు 25 శాతం వాటా తీసేసుకుంది. దీనితో మొత్తం పోర్టు అదాని సామ్రాజ్యంలో భాగమయింది. కృష్ణపట్నం రేవుకు ఉన్న భూములను ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తయారుచేస్తామని ఈ కంపెనీ ఈ సందర్భంగా విడుదల చేసిన ఒకప్రకటనలో పేర్కొంది. కృష్ణ పట్నం ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరు జిల్లాలో తమిళనాడుకు కూడా సమీపాన ఉంటుంది. అందుకే ఈ రేవుకు చాలా వ్యూహాత్మక ప్రా ము ఖ్యం ఉంది.
గుజరాత్ రాష్ట్రంలోని ముండ్రా, దహేజ్, తునా, హజిరా, గోవాలోని మోర్ముగావ్, మహారాష్టలోని డిఘీ, తమిళనాడులోని కట్టుపల్లి, ఎన్నోర్, ఒడిస్సాలోని ధర్మా, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం, గంగవరం, కేరళలో విజింజం వద్ద నిర్మించబడుతున్న ఓడరేవుతో కలిపి మొత్తం 12 పోర్టులతో ఆదానీ గ్రూప్ క్రమేపీ ఓడరేవుల రంగంలో ఆధిపత్యం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.
మన దేశంలోని మొత్తం ఓడరేవుల సామర్థ్యంలో 24% వాటాను ఆదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఇప్పటికే సొంతం చేసుకొన్నదని ఆ కంపెనీ అధికారికంగానే వెల్లడించింది.
ప్రభుత్వ రంగంలోని విశాఖ పోర్టులో ఒక టెర్మినల్ ను లీజుకు తీసుకొని దాన్ని మాత్రం వినియోగించుకోకుండా విశాఖ పోర్టుకు నష్టం వాటిల్లేలా చేసింది. ప్రభుత్వ రంగంలో ఉన్న ఓడరేవులకు నష్టం చేస్తూ, సముద్రతీరంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లోని ఓడరేవులను సొంతం చేసుకొంటూ ఓడరేవుల రంగంలో గుత్తాధిపత్యం కోసం ఆదానీ గ్రూప్ తహతహలాడుతున్నది.