కాలమంతా ఎన్నికల్లో గెలిచేందుకు, ఫిరాయింపులు ప్రోత్సహించేందుకేనా?

(వడ్డేపల్లి మల్లేశము)
ఈ మధ్య భారతదేశం లో ప్రభుత్వాలు తమ సమయాన్ని ప్రజల బాగోగులను చర్చించడానికి, అవసరమైన చట్టాలు చేయడానికి, క్రింది స్థాయి వరకు ఫలితాలను అందించడానికి, సమానత్వ సాధనకు, వివక్షతను రూపుమాపడానికి, రాజ్యాంగ ఫలాలను చట్టబద్ధంగా ప్రజలకు అందించడానికి కృషి చేస్టున్నట్లు కనిపించడం లేదు. దానికి బదులుగా ఎన్నికల్లోనో, ఉప ఎన్నికల్లోనో శాసన మండలి లేదా రాజ్యసభ కు సంబంధించిన ఎన్నికల్లోనో తప్పక గెలవాలనే కార్యక్రమాలల్లోనే బిజీగా ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోనైతే వరుస ఎన్నికల షెడ్యూళ్లు, ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీలు పడుతున్న తాపత్రయం, ఎన్నికల హామీలు, సమీకరణలు ఎలా ఉన్నాయో చూడండి, పరిస్థితి అర్థమవుతుంది. ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తుంది.
పార్టీ ప్రభుత్వాలు కనుక పార్టీని కాపాడుకోవడానికి మాత్రమే పనిచేయాలనే స్పృహ ఇటీవలి కాలంలో బలంగా పెరగడంతో అధికారంలోకి వచ్చిన వారు తమ విలువైన సమయాన్ని ప్రజల ఆలనాపాలనా కోసం గడపకుండా ఎన్నికల్లో గెలిచేందుకు, ప్రతిపక్షాలను ఎలా ఓడించాలనేందుకు, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించేందుకు, ప్రతిపక్షాలే ఉండకుండా చూసేందుకు ఎత్తులు పై ఎత్తులు వేసేందుకే ఎక్కవ శక్తి వెచ్చిస్తున్నట్లు కనిపిస్తుంది.
ప్రభుత్వం యావత్తూ ఈ కార్యక్రమాల చుట్టే తిరుగు ఉందన్న వాస్తవాన్ని మనమందరం గమనిస్తున్నామా?దీనిని పరిశీలించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
ఎన్నికై ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించడానికి రాజ్యాంగ పరిధి మేరకు చట్టాలకు లోబడి పరిపాలన చేయాలి. మంచి పరిపాలన అందించాయి. అది పోయి సేపు రాజకీయ పార్టీ బలోపేతానికి ప్రభుత్వ పెద్దలు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి మొదలుకుని మొదలుకుని కింది నాయకులదాకా పనిచేయడమే కనిపిస్తుంది. ప్రజల గురించి పట్టించుకునే వారు ఎవరు ఎక్కడో ఏ మూలనో కనబడతారు. ఎప్పుడూ ఎన్నికలే ఉంటున్నపుడు ఇక ప్రభుత్వాలకు ప్రజల గురించి పట్టించుకోవడం సాధ్యమేనా?
అందుకే అధికార పార్టీలకు అధ్యక్షులు వేరే ఉండాలి. ఇది తక్షణా అవసరం. కానీ, నియంతృత్వ అధికారాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి అలవాటు పడిన నేతలు పార్టీ అధ్యక్షడిని లేదా ప్రధాన బాధ్యతలను వేరేవారికి అప్పగించే స్థితిలో లేరు. ఏ బాధ్యతలను ఎవరికీ అప్పగించకుండా తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.
అందుకే ఇటీవలి కాలంలో ప్రభుత్వాలుండేది “ప్రజల కోసమా? ఎన్నికల కోసమా?”అనే ప్రశ్న ఎదురవుతున్నది.
అత్యున్నత స్థాయిలో ఉన్నవారు కూడా ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో లేదా ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహించే దోరణి ప్రదర్శిస్తున్నారు. చాలా సార్లు అధికార పార్టీ నుండి లేదా ప్రతిపక్ష పార్టీ నుంచి ‘మాకు చాలా మంది టచ్ లో ఉన్నారు’, అనే కవ్వింపు ప్రకటన చేయడం ఇటీవలికాలంలో మామూలైపోయింది.
ఇక తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలు జరిగిన తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చాయి. మళ్లీ ఇపుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో స్థానిక సమస్యల మీద ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా వరాల జల్లు కురిపించడం దేనికి సంకేతం?
ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వరాలు ప్రకటించడం రాజ్యాంగబద్ధమా? ఒకసారి ఆలోచించాలి.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి పర్యటనలో ప్రభుత్వ పక్షాన అనేక ఎత్తిపోతల పథకాలను ఒకేనాడు ప్రకటించడం ఎలా సాధ్యం? ఎన్నికల కోసం పథకాలా, ప్రజల కోసం పథకాలా, ఇది ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ప్రశ్నించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రజలను బానిసలుగా చూసే ఒక దురదృష్ట సంప్రదాయం రాజకీయరంగంలో బలపడే ప్రమాదం ఉంది.
దాదాపుగా తెలంగాణలో 38 లక్షల వరకు యువత ఉన్నారని ఒక అంచనా. ఉంటే అందులో కనీసం అక్షరాస్యత, ఉద్యోగానికి కొద్దో గొప్పో అర్హతలున్న వాళ్లను కలుపుకుంటే 20 లక్షల వరకైనా ఉంటారు. ఇప్పటివరకు వాళ్లకు సంబంధించి యువజన విధానం అంటూ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ప్రకటించలేకపోయింది. ఎలాంటి స్వయం ఉపాధి పథకాలు గాని ఖాళీగా లేదు. ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగ భృతి అని ఆశ కల్పిస్తూ ఒక ప్రకటన తెర మీదికి తీసుకురావడం ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం, సంక్షేమం కోస౦అభివృద్ధి కోసం ఎలా అవుతుంది?
ఇలాంటి ప్రకటనలతో ఎన్నికల్లో గెలుపు ఓటములను సవాలుగా తీసుకొని ప్రతిపక్షాలు లేకుండా చేయాలని జరుగుతున్న కుట్రను న్యాయవ్యవస్థ, రాజ్యాంగ నిపుణులు ఆలోచించాలి. అంతే కాకుండా, రాజ్యాంగ ఫలాలు అందకుండా పోతున్నపుడు ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధ పడకపోతే ప్రజాస్వామ్యం భ్రష్టు పడిపోతుంది. అప్పుడు రాజ్యాంగం విఫలమైతే ప్రజలు తమకు నచ్చిన విధంగా రాజకీయ యంత్రాంగాన్ని నిర్మించుకుంటారన్న అంబేద్కర్ హెచ్చరిక నిజమయ్యే రోజు వస్తుంది.

( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు, కవి, రచయిత, సీనియర్ ఉపాధ్యాయ నాయకుడు, జాగృతి కళాసమితి అధ్యక్షుడు, హు స్నాబాద్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *