దాదాపు మూడేళ్ళకు పైగా విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం ‘వకీల్ సాబ్‘ తో ఏప్రెల్ 9 న ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమవుతున్నాడు. దీన్ని ఫుల్ రేంజిలో క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా పంపిణీదారులందరూ టికెట్ ధరల పెరుగుదలతో పాటు, అర్ధ రాత్రి ప్రదర్శనలకు ప్రత్యేక అనుమతులు పొందారు. ఆ టికెట్ ధర 1500 అంటున్నారు. కొంతమంది పంపిణీదారులు యూఎస్ లో 300 నుంచి 500 డాలర్లకు అమ్మాలని యోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రదర్శనలు ఉదయం 1 గంటలకు ప్రారంభమవుతాయని, తెలంగాణలో ఉదయం 6 గంటల తర్వాత ప్రదర్శనలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. రోజుకు ఐదు ప్రదర్శనలు నిర్వహించడానికి ప్రణాళికలు వున్నాయి. ప్రీమియర్లు యూఎస్ లో కూడా జరగాలని యోచిస్తున్నారు.
ఇప్పటికే బహిరంగప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అయితే అధికారులు అనుమతి నిరాకరించారు. ట్రైలర్ లాంచ్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. విడుదల హడావిడితో దేశవ్యాప్త దృష్టి నాకర్షించాలని ఆలోచన. ఇంతలో ఆందోళనపర్చేపరిణా మాలు ఈ రోజు సంభవించాయి. కోవిడ్ కేసులపెరుగుదల దృష్ట్యా ఈ అదనపు ప్రదర్శనలను నిర్వహించడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించడంలేదని తెలియవస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఉండవునే అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ అదనపు ప్రదర్శనలతో కరోనా కేసులు పెరిగితే థియేటర్లలో సీటింగ్‌పై మరోసారి ఆంక్షల్ని అమలు చేయవలసిన పరిస్థితి వస్తుంది.
అందువల్ల ప్రభుత్వం రిస్క్ తీసుకోకూడదని, ఏరి కోరి విమర్శల్ని స్వాగతించకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ కి ముందు పెద్ద సినిమాలకి బెనిఫిట్ షోలు సర్వసాధారణ విషయంగా వుండేది. తిరిగి ‘వకీల్ సాబ్‘ తో బెనిఫిట్ షోలు ప్రారంభమైతే బాగానే వుండేది. కానీ ఈసారి అంత సులభం కాదని అర్ధమవుతోంది. ఈ ప్రదర్శనలకు అనుమతి లభిస్తే ‘వకీల్ సాబ్‘ కు భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. ప్రభుత్వ నిరాకరణతో ఆశలు సన్నగిల్లాయి. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఏమైనా మలుపు తిరుగుతుందేమో చూడాలి.
వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ లో, నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి, ప్రకాష్ రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.