నిన్న బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ఎన్నికల కమిషనర్ (ఎస్ ఇసి) నీలం సాహ్నీ మొదటి అధికారిక అఖిల పక్ష సమావేశం ఫెయిలయింది. అధికార పార్టీ వైసిపి, సిపిఎం తప్ప ఇతర పార్టీలన్నీ సమావేశాన్ని బహిష్కరించాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైరయ్యాక రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్థానంలో కొద్ది నీలం సాహ్నిని స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ గా నియమించారు. నిన్న ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. పెండింగులో ఉన్న జిల్లా పరిషత్ పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీల సాయం కోరుతూ ఆమె ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే, ఆమె మీద బలమయిన వైసిపి ముద్ర పడింది. దీనితో ఆమె వైసిపి అనుకూల నిర్ణయాలే తీసుకుంటారనే అనుమానం రాజకీయ పార్టీలో వచ్చింది. అందుకే ఆమె సమావేశాలను తెలుగుదేశం, బిజెపి, జనసేన, సిపిఐ పార్టీలు బహిష్కరించాయి. ఒక్క సిపిఎం మాత్రమే హాజరయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా నియమితులయిన తొలి మహిళ నీలం సాహ్ని. అయితే, ఆమె పదవీ కాలం సాఫీ ఉండేలా కనిపించడం లేదు. మొన్నటి దాకా ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సంగతి తెలిసిందే.
మార్చినెలాఖలరున రిటైరైన కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తెలుగుదేశం ముద్ర పడినట్లే నీలం సాహ్నికి వైసిపి ముద్ర పడింది. ఇది చెరగిపోవడం కష్టం.
రాజకీయ పార్టీలతో తాను సమావేశమవ్వా లనుకుంటున్నట్లు ఆమె గురువారం సాయంకాలం పార్టీలకు ఆహ్వానం పంపారు.
ఈ ఆహ్వానం పంపిన రెండు మూడు గంటల్లోనే గత కమిషనర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. గతంలో నోటిఫికేషన్ జారీ చేసినా కోవిడ్ కారణంగా దానిని పెండింగులో పెట్టారు. ఈ లోపు రాజకీయ పార్టీలు తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఆమె రాజకీయ పార్టీలతో సంప్రదించాలనుకుంటున్నట్లు పార్టీలు భావించాయి.
తమని సమావేశాలను పిలిచి, తమ వాదనేమిటో వినకుండానే కొత్త కమిషనర్ ఏకపక్షంగా పాత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించడాన్ని టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు విమర్శించాయి. ముందే తేదీలను నిర్ణయించుకున్నపుడు ఇక తమని సమావేశానికి పిలవడం దేనికి అని బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యనించారు. ఇదే వాదనని జనసేన నేత పవన్ కల్యాణ్ కూడా వినిపించారు.కొత్త ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి వత్తాసుపలుకుతున్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం అవసరంలేదని టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అందుకే తాము జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
ఇలా ఉంటే, పాత షెడ్యూల్ ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదలచేసేలా కమిషన్ ను అదేశించాలని బిజెపి హైకోర్టు ను ఆశ్రయించింది.
ఎన్నికల కమిషన్ ఇక ముందు రాష్ట్రంలో సజావుగా పనిచేసే అవకాశం తగ్గిపోయింది. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎవరిని నియమించినా అది రూలింగ్ పార్టీ ముద్ర నుంచి తప్పించుకోవడం కష్టం.
సాధారణంగా రాష్ట్రఎన్నికల కమిషనర్ ప్రభుత్వాలు రిటైరైన ఐఎఎస్ అధికారులనే నియమిస్తుంటాయి. ఉదాహరణకు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన కమిషన్ కు తొలి కమిషనర్ గా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ గా రిటైరయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించారు. ఆయన తెలుగు దేశం ఏజంటని వైసిపి యుద్దం ప్రకటించింది.అయితే, ఏమాత్రం జంకని నిమ్మగడ్డ సుప్రీంకోర్టు దాకా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నోరు మూయించారు.
తర్వాత ఆయన మీద ఇద్దరు మంత్రులు సభా హక్కుల భంగం ఫిర్యాదు చేశారు. విచారణకు హాజరుకావాలని ఆయనను సమన్లు కూడా జారీ చేశారు.
చివరిక్షణంలోఏంజరిగిందో ఏమో గాని, ఇపుడా విషయం వినిపించడమే లేదు.
ఈ లోపు నీలం సాహ్ని రెండో కమిషనర్ అయ్యారు. ఆమె మీద టిడిపి, బిజెపి, ఇతర పార్టీలు యుద్ధం ప్రకటించాయి. ఆమెకు వైసిపి ముద్రవేశాయి.
ఇక ఇలాటి వివాదాలకు అంతుఉండదు. భవిష్యత్తులో ఎవరు కమిషనర్ గా వచ్చినా రూలింగ్ పార్టీ రాజకీయ ముద్ర పడి తీరుతుంది. రిటైరయిన అధికారులను కాకుండా న్యాయవ్యవస్థ నుంచితీసుకువచ్చినా ఇదే సమస్య ఉంటుంది. ఎందుకంటే,రిటైరయిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజును ఒక ఆర్డినెన్స్ ద్వారా నియమించినపుడు ఆయన కూడా వైసిపి ముద్ర నుంచి తప్పించుకోలేకపోయారు. కాకపోతే ఆ నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడంతో జస్టిస్ కనగరాజు రభస లేకుండా మద్రాసు వెళ్లిపోగలిగారు