ప్రభాస్ వంటి ఎక్స్ ప్రెస్ వే మేకర్లే మిగులుతారు

ఓటీటీ – పానిండియా ఈ రెండు పదాలు ఇవ్వాళ తెలుగు సినిమా కొత్త మార్కెట్ ని నిర్వచిస్తున్నాయి. ఓటీటీతో వుండే బహుళ ఆదాయ వనరుల అవకాశాలతో తెలుగు సినిమాలు ఇక లాభాల బాట పట్టాలంటే, గ్లోకల్ గా మారాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. దీనికి పానిండియా మూవీస్ తో తెలుగు స్టార్ ప్రభాసే ఒక ఎక్స్ ప్రెస్ వే వేస్తున్నప్పుడు, ఆ ఎక్స్ ప్రెస్ వే మీద, ఫాలో ది తెలుగు స్టార్ అంటూ చిన్నాచితకా మూవీస్ కొత్త ఆదాయ అవకాశాల్ని అందుకుంటూ వెళ్ళడమే. అంటే లోకల్ గానూ, గ్లోబల్ గానూ వర్కౌటయ్యే కంటెంట్. ఇంకా తెలుగు మూస దగ్గరే ఆగిపోతే, తెలుగు ప్రేక్షకుడు తెలుగు మూసగా లేడు. వూరూరా గ్లోకల్ కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తెలుగుకి పరిమితమై పోకుండా, దేశంలో ఏకైక రియల్ పానిండియా స్టార్ గా ప్రభాసే రిస్కు చేసి నాలుగు సినిమాల 700 కోట్ల బడ్జెట్ ని భుజాన వేసుకుని, ఎక్స్ ప్రెస్ వే నిర్మిస్తూ దూసుకెళ్తున్నప్పుడు, తెలుగుకి వస్తున్న ఈ ఆలిండియా గుర్తింపుని చిన్నాచితకా సినిమాలు సొమ్ము చేసుకోవడమే ప్రభాస్ బాటలో సాగిపోయి.

ఎందుకు చిన్నా చితకా సినిమాలు? ఓ పది పన్నెండు, లేదా పదిహేను స్టార్ సినిమాలు తీస్తే, వందల్లో తీసేది చిన్నాచితకలే గనుక. ఇవి లేకపోతే సంక్షోభమే గనుక. అయితే ఇవి వుండీ సంక్షోభమే సృష్టిస్తున్నాయి. ఇవి టెక్నీషియన్లనీ, ప్రొడక్షన్ విభాగాల్నీ బతికించవచ్చు. కానీ అవతల థియేటర్ల దగ్గర గుండు సున్నాలే. ప్రేక్షకులున్నా లేకపోయినా థియేటర్లకి అద్దెలొస్తాయి. కానీ థియేటర్ స్టాల్స్ వాళ్ళు, పార్కింగ్ వాళ్ళు, పాన్ షాపువాళ్ళూ సైతం తెగ తిట్టుకుంటారు ప్రేక్షకుల్లేక ఈ సినిమాల్ని. కొన్నిసార్లు చిన్నాచితకలు విడుదలైతే వీళ్ళు కనపడరు, కట్టేసుకుని వెళ్లిపోతారు. భారీ నష్టాలు అద్దెలు వెళ్ళక. అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్టు చూస్తే తెలుస్తుంది చిన్నాచితకా మేకర్లకి. మల్టీ ప్లెక్సుల్లోనూ ఇదే పరిస్థితి.

చితకని వదిలేద్దాం, వాళ్ళెలాగూ చేతగాక సినిమాలు తీస్తారు. కాస్త మాన మర్యాదలున్న చిన్న సినిమాలు కూడా తీయడం చేతగాక పోతే, వేరే సినిమాలకి పని చేసుకోవడం బెటర్, మేకర్ ఆలోచనలు మానుకుని. ఈ ఏప్రెల్ నెల లిస్టు చూస్తే, 13 ప్రధాన సినిమాలు విడుదలవుతున్నాయి. అంటే సగటున రెండు రోజుల కొకటి. వీటి మధ్యన 33 చిన్నా చితకా సినిమాల విడుదల తేదీల్ని ప్రకటించి పారేశారు!! సగటున రోజుకొకటి కన్నా ఎక్కువే. చిన్నా చితక లతో ఇంత కామెడీ చేస్తున్నారు. విడుదలైతే అవుతాయి, కాకపోతే పోతాయన్నట్టు. ఎవరికోసం యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి? ఏం ఎమర్జెన్సీ వచ్చిందని? చిన్నా చితకని వచ్చే నెల బ్యాన్ చేస్తామని ప్రభుత్వమేమైనా ప్రకటించిందా? ఈ లిస్టు చూస్తే థియేటర్ల స్టాళ్ళూ పార్కింగులూ, పాన్ షాపుల వాళ్ళూ, ఇంకా గేట్ల సందుల్లోంచి పడిపడి పల్లీ బజ్జీలమ్మే వాళ్ళూ గుండెపోట్లు తెచ్చుకుంటారు.

కోటీ రెండు కోట్లతో, పోనీ 3 కోట్లతో చిన్న సినిమాలు తీసే వాళ్ళు ఔటాఫ్ బాక్స్ కంటెంట్ అంటూంటారు. ప్రభాస్ గనుక ఈ నాల్గు సినిమాల తర్వాత ఇంకో నాల్గు అలాటి పానిండియా సినిమాలతో జైత్ర యాత్ర కొనసాగిస్తే ( కొనసాగిస్తాడు. బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులూ క్యూలో వున్నారు. ఇవ్వాళ ప్రభాస్ బాలీవుడ్ కి కూడా కొత్త ద్వారాలు తెరిచాడు) చిన్న సినిమాలకి ఔటాఫ్ బాక్స్ గాకుండా పానిండియా కంటెంటే అవసర మవుతుంది. మలయాళంలో ఏ పానిండియా స్టార్ వున్నాడని మలయాళం సినిమాల్ని పానిండియా ప్రేక్షకులు గుర్తించి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ మూలాలు ఇండిపెండెంట్, ఆర్ట్, రియలిస్టిక్ సినిమాల్లో వుండడం వల్ల.
ఓటీటీ ఇవ్వాళ సినిమాలకి సంబంధించి విభిన్న కళల వేదికయింది. మూస మసాలా టెంప్లెట్ ఎంటర్ టైనర్లు ఇంకెంత మాత్రం మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కావనీ, ఇండిపెండెంట్- ఆర్ట్- రియలిస్టిక్ సినిమాలే మెయిన్ స్ట్రీమ్ సినిమాలనీ తేల్చి చెప్పేస్తోంది. ట్విట్టర్లో ఆధునిక ప్రేక్షకుడు మీరు మారితే మేం థియేటర్లకి వస్తామని ట్వికటాట్టహాసం చేస్తున్నాడు. ట్విట్టర్ తో ఆవో ట్విస్ట్ కరే ఆహ్వానాలు పంపుతున్నాడు. ఓటీటీ కంటెంట్ అంటే థియేటర్ లకి పనికి రాని కంటెంట్ అని కాదు. ఏ వేదికకి అయినా ఒన్ నేషన్, ఒన్ సినిమా అనేది నేటి నినాదమయిందని తెలుసుకోవాలి. ఏ భాషలో ఏ సినిమా బావున్నా జాతీయ మీడియాలో రివ్యూలొస్తున్నాయి. వివిధ జాతీయ పత్రికల, ఛానెళ్ళ వెబ్సైట్స్ లో రోజువారీ టాలీవుడ్ న్యూస్ కూడా ఇస్తున్నారు. తెలుగులో ఒక టీజర్ రిలీజ్ అయితే దాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇంత ప్రోత్సాహం తెలుగుకి జాతీయ స్థాయిలో మీడియా అందిస్తున్నా, ఇంకా చిన్న సినిమాల మేకర్లు ఈ ఎవెర్నెస్సే లేక, ఎబిసి సెంటర్ల పాత లెక్క లేసుకుంటూ, ఎందుకూ పనికి రాని మూస కంటెంట్ తో కాలం గడుపుతున్నారు.

ఔటాఫ్ బాక్స్ అంటే మళ్ళీ ఎబిసి లెక్కలే వస్తాయి. చిన్న సినిమాలకి కొందరు హీరోలకి ఔట్ ఆఫ్ బాక్స్ కథలు చెప్పినా, మూసకింద మార్చమంటున్నారని అనే వాళ్ళున్నారు. అల్లరి నరేష్ ‘నాంది’ ని, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ ని మూసగా తీయడం వల్లే అవి ఎబిసికి పరిమిత మయ్యాయి. ‘మోసగాళ్ళు’ ఎబిసిని కూడా మెప్పించ లేకపోయింది. నిజానికి ఈ రెండు సినిమాల్లో ఎబిసి కంటెంట్ కాదు, ఏకంగా పానిండియాకి వెళ్ళి సంచలనం సృష్టించే క్రిటికల్ కంటెంటే వుంది. ఇది తెలుసుకోక లోకల్ మూసకి కుదించేశారు. లేకపోతే ఈ హీరోలిద్దరూ పదిరెట్లు పానిండియా బాక్సాఫీసుతో, జాతీయ మీడియాలో వుండేవాళ్ళు (ఈ రెండు సినిమాల కంటెంట్ గందరగోళం గురించి గత రెండు వ్యాసాల్లో విశ్లేషించుకున్నాం).

ఔటాఫ్ బాక్స్ కాదు, ఓటీటీగా భాష మార్చుకోవాలి. చిన్న సినిమాకైనా ఎవరైనా హీరోలు ఏళ్ళుగా పొగుబడిన వాళ్ళ పాత భావాల చట్రంలో మూస చేయమంటే, కొత్త హీరోలతో వెళ్ళడమే. కొత్త కంటెంట్ ని క్రియేట్ చేయగల్గుతున్నప్పుడు, కొత్త హీరోల్ని ఎందుకు సృష్టించలేరు.

ప్రపంచంలోనే శరవేగంగా విస్తరిస్తున్న ఒటీటీ మార్కెట్ ఇండియానే. 2024 నాటికల్లా 2.9 బిలియన్ డాలర్ల బృహత్ మార్కెట్ గా ప్రతాపం చూపనుంది. చందాదార్లు 50 కోట్ల మందికి చేరిపోతారు. ఇదీ సమీపంలో కన్పిస్తున్న భవిష్యత్తు. సుదూర లోకాల్లో మూస చలి కంబళ్ళు కప్పుకుని ముడుచుకు జీవించడాలు ఇక చాలించు కోవాలి. కోవిడ్ లాక్ డౌన్ కాలంలో 15 కొత్త ఓటీటీలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఓటీటీ కంపెనీలు వయోలెంట్, అడల్ట్ కంటెంట్ తో అర్బన్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తే, ఈ కొత్త కంపెనీలు ఖాళీగా వున్న రూరల్ ఇండియా స్పేస్ ని టార్గెట్ చేసి, రూరల్ ప్రేక్షకుల్నిఖాతాదార్లుగా చేసేసుకుంటున్నాయి. అక్కడి ప్రేక్షకుల స్థానిక భాషల్లో క్వాలిటీ కంటెంట్ ని అందిస్తున్నాయి. దీంతో గ్రామీణ స్త్రీలు సైతం తమలాగే మాట్లాడే పాత్రల్ని చూసి, తమ కథల్లాగే వుంటున్న వాస్తవిక కథల్నీ చూసి, వంటింటి సీరియళ్ళని వదిలిపారేసి, ఓటీటీని ఇంటింటికీ తెచ్చుకుంటున్నారు. కోవిడ్ లాక్ డౌన్ పుణ్యమాని తొంభై శాతం రూరల్ ఇండియా ఇంటర్నెట్ మయమైపోయింది. ఇలా వుంటే, ఓటీటీల ప్రభావంతో ఛానెళ్ళలో ప్రదర్శిస్తున్న సినిమాల టీఆర్పీలు పడిపోతున్న సన్నివేశం వేరే వుంది. ఓటీటీతో గ్లోబల్ కంటెంట్ కి ఎక్స్ పోజ్ అవుతున్న ప్రేక్షకులు, తమ భాషల్లో కూడా క్వాలిటీ కంటెంట్ నే కోరుకుంటున్నారనేది ఓటీటీ బాసులు చెప్తున్న మాట.

ఈ క్వాలిటీ కంటెంట్ కి డిమాండ్ పెరుగుతూ వుంటే, మార్కెట్ ని ఆక్రమించిన క్వాలిటీ నివ్వలేని లోకల్ తెలుగు మూస మేకర్లు మార్కెట్ నుంచి అదృశ్యమైపోయే కాలం పొంచే వుంది. క్వాలిటీ నివ్వగల అల్ప సంఖ్యాకులెవరైనా మిగిలితే వాళ్ళకి అవకాశాలు మెరుగవుతాయి. జో ఎక్స్ ఓ ప్రెస్ వే పే జాయేగా, వో జియేగా. బాఖీ సబ్ బర్ఖాస్త్ హోజాయేగా.

సికిందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *