పొదుపు డబ్బు కొల్లగొట్టేందుకు తెలుగింటి కోడలు ప్రయత్నం, జాగ్రత్
ఆ మధ్య నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి అయినప్పుడు తెలుగు మీడియా మిద్దెలెక్కి, ఛాతీ విరుచుకుని, ఆవేశం తో ఊగిపోతూ తెలుగు వాళ్ల కోడలు ఎంత ఎత్తు ఎదిగిందన్నారు. అయితే, ఆమె ఎపుడు తాను తెలిగింటికోడలని గర్వంగా ‘రాజకీయ’ సందర్భాల బయట చెప్పుకున్నట్లు లేదు. ఒకవేళ చెప్పుకున్నా, అది గర్వపడేలాగాచెప్పుకోలేదు. తెలుగు మీడియా ‘పేక్ ప్రైడ్’ ను క్రియోట్ చేసేంది తప్ప, ఆమె నిర్ణయాల్లో ఎక్కడా తెలుగుదనం కనిపించలేదు.
అయితే, తెలుగు వాళ్ల ఆత్మగౌరవం మీద ఆమె రెండు సార్లు చావు దెబ్బ వేసింది. ఒకటి ఆంధ్రా బ్యాంక్ ని యూనియన్ బ్యాక్ లో విలీనం చేయడం. ఆంధ్ర బ్యాంక్ పేరును కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించనవసరం లేదు, ఖర్చుచేయనవసరం లేదు. ఆంధ్రా బ్యాంక్ అనే పేరు వల్ల తెలుగువాళ్లకు వచ్చే లాభమేమీ లేకపోయినా అది ఆత్మ గౌరవ సంకేతం. ఆంధ్రా బ్యాంక్ లాభార్జనకోసం పుట్టిన బ్యాంక్ కాదు. స్వాతంత్ర్యోద్యంలో భాగంగా, జాతీయోద్య విలువలతో డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య ఏర్పాటు చేశారు.
ఆంధ్రుల జాతీయోద్యమంలో ఒక కీలకఘట్టమయిన బ్యాంకు పేరు తుడిచేస్తున్నపుడు తెలుగువాళ్ల కోడలు అలోచించాలి కదా. బాంకులను విలీనం చేయవచ్చుగాక, ఒక ప్రాంతానికి చెందిన 5 కోట్ల ప్రజలకు ఆత్మగౌరవానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటున్నపుడు వీసమంత పక్షపాతం చూపడం తప్పేమి కాదు. దానికి కేంద్రం డబ్బు ఖర్చు చేయాల్సిన అసవరం లేదు. ఆంధ్రాబ్యాంకు పేరు కొనసాగించినందున ఉత్తరాదిలో ఉద్యమం వచ్చే ముప్పూలేదు. అయినా కూడా ఆంధ్ర పేరును సునాయాసంగా తెలుగు వాళ్ల కోడలు తీసేయగలిగిందంటే దీని వెనకేదో రాజకీయ కోణం ఉండాలి.బిజెపికి ఎంతకూ లొంగని, చివరకు దేశాన్నంతా జయించిన మహాబలుడు ప్రధాని నరేంద్రమోదీకి కూడా మొండిచేయి చూపిన ఆంధ్రుల మీద ఏదయినా చాణక్య శపథం చేశారా? ఇలాంటి అనుమానం వస్తుంది.
నిర్మలా సీతారామన్ తెలుగువాళ్ల మీద వేసిన రెండో దెబ్బ విశాఖ స్టీలు ప్రయివేటీకరణ. అందునా రెండులక్షల కోట్ల విలువయిన 20 వేల ఎకరాలున్న ఈ ప్లాంటును ప్రయివేటీకరించడం ఒక కుంభకోణమవుతుందిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ ఇఎఎస్ శర్మ హెచ్చరిస్తునే వస్తున్నారు. ఎప్పటి నుంచో విశాఖ స్టీల్ మిగులు భూముల మీద సెంట్రల్ పవర్ కి దగ్గరగా ఉన్న కార్పొరేట్ కంపెనీలకు కన్నుంది. గతంలో ఇదే బిజెపి (ఎన్ డిఎ) ప్రభుత్వం ఒకసారి ప్రయత్నించింది. అది సక్సెస్ లేదు. ఇపుడు పార్లమెంటులో ఉన్న అఖండ మెజారిటీ, కేంద్రం నిర్ణయాలను ప్రశ్నించలేని రాష్ట్రాలున్న సమయంలో ’విశాఖ ఉక్కు, ఆంధ్రులహక్కు‘ ని కాల రాసేందుకు పూనుకున్నారు. ఈ ప్లాంట్ కి సొంత ఐరన్ వోర్ గనులు కేటాయిస్తూ బాగుపడతుందని అంతా అంటుంటే, కేంద్రమేమో, అన్నింటిని తెగనమ్మేస్తాం అంటున్నారు. అన్నింటిని తెగనమ్మేయడం ఒక ఎత్తు, ఆంధ్రల హక్కుని అమ్మేయడం మరొక ఎత్తు. ఇక్కడైనా తెలుగు వాళ్ల కోడలు ఈ నిర్ణయాన్ని తాను ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు తీసుకోకుండా వాయిదా వేయించి కనీసం తెలుగు పక్షపాతాన్ని నటించి చూపించి వుండవచ్చు. అదీ జరగలేదు.
ఈనిర్ణయాలు వెనక ఏదో బలమయిన ఆంధ్రవ్యతిరేక కోణమేదో ఉండి ఉండాలి.అంత ఆంధ్ర వ్యతిరేకత పెంచుకుంటే ఎలా? సబబా?
ఇపుడు నిర్మలా సీతారామన్ మరొక పెద్ద కీలకనిర్ణయం తీసుకున్నారు. అది పేదల, అల్పాదాయ వర్గాల, రిటైరయిన సీనియర్ సిటిజన్ల జేబులు కత్తిరించాలనుకోవడం. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లో ఎవరు డబ్బు దాచుకుంటారు? జీవితాంతం ఉద్యోగాలు చేసి నాలుగు రూకలు కూడబెట్టుకుని, వాటి మీద వచ్చే వడ్డీతో బతకాలనుకునే చిరుద్యోగులు, కేవలం వడ్డీ డబ్బుల మీద బతకాలనుకునే వర్గాలు స్మాల్ సేవింగ్స్ లో పొదుపు మొత్తాలు దాచుకుంటారు. కేవలం ఈ వడ్డీ డబ్బుతో బతికేకుటంబాలు కూడా ఉన్నాయి.
అసలే బ్యాంకుల్లో వడ్డీ తగ్గించేశారు. ఇపుడు స్మాల్ సేవింగ్స్ మీద కూడ వడ్డీ కోత విధించారు. దీనితో సినియర్ సిటిజన్లు, అల్పాదాయ వర్గాల వడ్డీ ఆదాయం తగ్గిపోతుందన్నమాట. ఒక వైపు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరొక వైపు వడ్డీరేట్లు ఇలా తగ్గిపోతున్నాయి.పేదల జీవితాల్లో, అల్పాదాయ వర్గాల జీవితాల్లో, సీనియర్ సిటిజన్ల జీవితాల్లో సంక్షోభం సృష్టించడం కాదా ఇది?
సేవింగ్స్ అక్కౌంట్లపై మూలుగుతూ మూలుగుతూ నానా ఆపసోపాలు పడుతూ ఇస్తోన్న 4శాతం వడ్డీని కూడా ఒకేసారి అరశాతం కోసేసిందని మీడియా వ్యాఖ్యానిస్తున్నది. ఈ ఏడాది పాటు ఉండే డిపాజిట్లపై 5.5శాతం నుంచి 4.4శాతానికి, 2ఏళ్ల డిపాజిట్లపై5.5శాతం నుంచి 5శాతం, 3ఏళ్ల డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 5.1శాతం, 5ఏళ్ల డిపాజిట్లపై 6.7శాతం నుంచి 5.8శాతానికి ,సీనియర్ సిటిజెన్ల డిపాజిట్లపై 7.4శాతం నుంచి 6.5శాతానికి తగ్గిస్తూ కేంద్ర ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాస్తో కూస్తో వడ్డీ గ్యారంటీ కోసమని ఈ స్కీమ్ లలో డిపాజిట్లు చేసే సీనియర్ సిటిజెన్లకు ఇది భారీ షాక్. ఇదొక్కటే కాదు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లలో వడ్డీ కూడా 7.1శాతం నుంచి 6.4శాతానికి తగ్గించారు.ఇదైతే మరీ దారుణంగా గత 46ఏళ్లలో లేని కనిష్టస్థాయికి చేరింది. కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీని 6.9శాతం నుంచి 6.2శాతానికి తగ్గించారు. ఇక సుకన్య సమృద్ధి అక్కౌంట్ స్కీమ్ నుంచి వచ్చే వడ్డీని కూడా 7.6శాతం నుంచి 6.9శాతానికి తగ్గించారు.
ఇలా ఎందుకు చేస్తున్నారు, ఈ డబ్బు కొల్లగొట్టేందుకేనా?
కొల్ల గొట్టేందుకే నని అనుమానం వస్తుంది. ఎలాగో చూడండి.ఇపుడు దేశంలో అత్యంత ఆకర్షణీయం కులుకుతున్న రంగం ఒక్కటే స్టాక్ మార్కెట్. కరోనా కాలంలో ఇది ఇంకా బాగా సింగారించుకుంది. స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ కు రెక్కలొచ్చేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. స్టాక్ మార్కెట్ మిళమిళ మెరిసేలా చేస్తున్నది. దీనితో నాలుగు రూకల పొదుపు డబ్బులున్నవాళ్లంతా ఒక సారయినా మనుసు పారేసుకునేలా కళ్లు మిరమిట్లు గొలిపేలా స్టాక్ మార్కెట్ సంపదని చూపిస్తున్నది. అంతా లొట్టలేసుకుంటూ అటువైపు చూసేలా చేస్తున్నది.
నాలుగు డబ్బులు వెనకేసున్న వాళ్లంతా కరోనా కాలంలో ‘పొదుపు’ చేసుకున్న మొత్తాలను స్టాక్ మార్కెట్లోకి మళ్లించి పండగ చేసుకున్నారు. మాల్స్,రెస్టరాంట్లు మూత పడటం బయటి ఫుడ్, బయటి తిరుగుళ్లు మానేసి బాగా డబ్బు పొదుపుచేసుకున్నారు. ఇంటి దగ్గిర ఉన్నారు కాబట్టి వీళ్లంతా డిమ్యాట్ అకౌంట్ లను కోట్ల సంఖ్యలో తెరిచారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థంభించినా కొన్ని కంపెనీల షేర్ల ధరలు మార్చి 2020- జనవరి 2021 మధ్య రెట్టింపయ్యాయి. దీనికి కారణం, షేర్ మార్కెట్ బుల్లిష్ అయింది. రిటైల్ షేర్ల కొనుగోలు విపరీతంగా పెరిగింది. ఇంతవరకు సేవింగ్ అకౌంట్లకు పరిమితమయిన జనమంతా కరోనా కాలంలో డిమ్యాట్ అకౌంట్లు పెద్ద ఎత్తున తెరిచారు. కరోనా వల్ల కుటుంబాల ఆదాయం కొంత తగ్గినా ఖర్చులు కూడా తగ్గడంతో ప్రతి కుటుంబం సగటు 20 వేల దాకా ఆదా చేసింది. ఈ డబ్బంతా షేర్ మార్కెట్లోకి దుమికింది. ఇవిగో విశేషాలు:
2009 డిసెంబర్- 2019 డిసెంబర్ మధ్య సిడిఎస్ ఎల్ (CDSL), ఎన్ ఎస్ డిఎల్ (NSDL) ఓపెన్ చేసిన కొంత డిమ్యాట్ అకౌంట్లు కేవలం 2.1 కోట్లు.
దీనితో 2019 డిసెంబర్ నాటికి దేశంలో ఉన్న మొత్తం డిమ్యాట్ అకౌంట్లు 3.93 కోట్లయ్యాయి.
డిసెంబర్ 2020 నాటికి అంటే ఒక ఏడాదిలోొ దేశంలో డిమ్యాట్ అకౌంట్లు 4.98 కోట్లకు చేరాయి. డిసెంబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 మధ్య 1.5 కోట్ల డిమ్యాట్ అకౌంట్లు వచ్చాయి. ఈ కాలమంతా కరోనా లాక్ డౌన్ కాలమే.
ప్రతినెలా 8 లక్షల డిమ్యాట్ అకౌంట్లు తెరిచారన్న మాట. లాక్ డౌన్ మొదలయ్యాక సగటున నెలసరి ఓపెన్ అయిన డిమ్యాట్ అకౌంట్లు10 లక్షలు.
కొల్లగొట్టడం ఎలా జరుగుతుందటే…
బ్యాంకు వడ్డీలు, స్మాల్ సేవింగ్స్ వడ్డీలు ఆకర్షణీయంగా లేవుకాబట్టి, నాలుగు డబ్బు సంపాయించాలనుకుంటే వీటికంటే స్టాక్ మార్కెట్ నయమనే భావన ప్రజల్లో కల్పించేలా కేంద్రం ముస్తాబు చేస్తున్నది. హౌస్ హోల్డ్ పొదుపులో భారత్ బాగా ముందుంది. ఇండియాలో హౌస్ హోల్డ్ సేవింగ్స్ రేటు 2020లో జిడిపిలో 21.4 శాతానికి పెరిగింది. ఇది రికార్డు. 2020 జూన్ క్వార్టర్ కు ముందు ఇది కేవలం 7.9 శాతమే. అందువల్ల పొదుపు మొత్తాలను ఊరికే స్మాల్ సేవింగ్స్ లో, బ్యాంకు డిపాజిట్లో మగ్గిస్తే ఎలా? ఈ పొదుపు డబ్బుని ఎలెక్టోరల్ బాండ్ లతో పార్టీని ఆదుకుంటున్న కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడేలా చేయాలి. ఎలా? ఈ హౌస్ హోల్డ్ సేవింగ్సని స్టాక్ మార్కెంట్ వైపు మళ్లించాలి. అపుడు కార్పొరేట్ కంపెనీలకు ఈ సంపద ఉపయోగపడుతుంది. ఈ ప్రయత్నం వడ్డీ రేట్ల తగ్గింపులో కనబడుతుంది.
“మీరంతా మా బ్యాంకులను, స్మాల్ సేవింగ్స్ పథకాలను మానుకోండి. వడ్డీ రేట్లు మేం తగ్గిస్తున్నాం. మీరు చక్కగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టు చేయండి. బాగా రాబడి ఉంటుంది. మా పరిపాలనలో సెన్సెక్స్ ఎలా పెరుగుతున్నదో మీరే చూడండి. అందువల్ల మీద పొదుపు డబ్బుతో షేర్లు కొనండి, అమ్మండి, మ్యూచ్యువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టండి. బ్యాంకు ఇంటరెస్టు కంటే అక్కడ మీకు ఎక్కు వ రాబడి వస్తుంది,” అని పరోక్షంగా ఉసి గొల్పడమే ఇది.
ఇలా వడ్డీరేట్లను క్రమంగా తగ్గిస్తూ పోతే ప్రజలు ఏంచేస్తారు?
దీనికంటే ఒక పరకో బేడో ఎక్కవ వచ్చే స్టాక్ మార్కెట్ వైపు వెళ్తారు. అక్కడ మీకు అదృష్టం ఉండి, జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే డబ్బులొస్తాయి. లేదంటేపోతాయి. మీకు వడ్డీ చెల్లించాల్సిన భారం ప్రభుత్వం మీద ఉండదు కదా? మీచావేదో మీరు చస్తారు. స్టాక్ మార్కెట్ చాలా జాగ్రత్తగా అడాల్సిన గేమ్. ఇందులో నాలెడ్జ్ లేక నష్టపోయిన వాళ్లే ఎక్కువ. ఒకె, మరి ట్రేడంగ్ చేతకాదా? మ్యూచ్యువల్ ఫండ్స్ లో పెట్టుకోండి. మీ తరఫున వాళ్లే ట్రేడ్ చేసి మీకు డివిడెండ్ ఇస్తారు. ఏదయితే ఏముంది కార్పొరేట్ కంపెనీల బొక్కసంలోకి మనచిన్న మొత్తాలన్నీ ఎగిరిపోయే రోజొస్తున్నది. జాగ్రత్త.