(వడ్దేపల్లి మల్లేశము)
అంబేద్కర్ జన్మించి దాదాపు వందేళ్ల అయిన సందర్భంగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు 1990 మార్చి 31 రోజున భారతరత్న ప్రకటించారు. ఆయన భారత్ రత్న పురష్కారం దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆలస్యమైనప్పటికీ ఈ ప్రకటనలోని ఔచిత్యాన్ని మనము గుర్తించక తప్పదు.
మరో కోణంలో చూసినప్పుడు 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చి అప్పటికి దశాబ్దాలు గడిచినా గత ప్రభుత్వాలకు ఈ సోయి లేదు ఎందుకని ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా ఆమోదం పొందినటు వంటిది భారత రాజ్యాంగం. రాజ్యాంగ రచనకు ఏడుగురు సభ్యులు కమిటీకి నాయకత్వం వహించిన అంబేద్కర్ ని భారత రత్న పురస్కారానికి అర్హుడిగా నాటి ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదు? అది కాకతాళీయంగా జరిగినదా లేక కావాలని చేసిన నిర్లక్ష్యమా?
డిసెంబర్ 2 1989 లో అట్టడుగు వర్గాల సామాజిక అనుకూల దృక్పథం కలిగిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనూహ్యరీతిలో ప్రధాన మంత్రిగా వచ్చారు. తర్వాత తన మంత్రివర్గంలో మొదటిసారిగా సామాజిక సాధికారత మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. అట్టడుగు వెనుకబడిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని కలిగించే ప్రయత్నం చేసినారు.
అంతేకాదు రాజ వంశానికి చెందిన వి.పి.సింగ్ రాంవిలాస్ పాశ్వాన్, ఇతర దళిత ప్రగతిశీల నాయకులతో మాట్లాడి అంబేద్కర్ గారి చిత్రపటం పార్లమెంట్ హాల్లో ప్రతిష్టించమే కాకుండా అందరూ మరిచిన ‘మరణానంతర’ భారతరత్నను చాలా ఆలస్యంగానైనాసరే అంబేద్కర్ గారికి ప్రకటించారు. అలాగే బీసీ వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి ప్రయత్నించారు. ఈ విషయంలో ఆయన ఎంత ఒత్తిడికి గురైనారో వూహింవచ్చు.
వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా రాకుంటే బహుశా నేటికి కూడా అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చే వారో లేదో సందేహాస్పదమే.
కార్మికులు మహిళలు,మహిళా కార్మిక చట్టాలు. ఆర్థిక అంతరాలు, రూపాయి విలువ, రిజర్వు బ్యాంకు ఆవశ్యకత అసమానతలు అంతరాలు లేని సమాజం ఆవిర్భావము వంటి అనేక అంశాల పైన తనదైన ప్రత్యేకత నిలుపుకున్న మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఆయన ఏవిధంగా కూడా ఒక వర్గం వారు కాదు. అందరి వారు. కొందరి వారిగా చిత్రించడం ముద్రించడం బాధ్యతా రాహిత్యమే కాదు కుసంస్కారం కూడా.
అంబేద్కర్ గారి కృషి ఈ రోజు అంటే 1 ఏప్రిల్ న, జర్వుబ్యాంకు ఆవిర్భవించిన రోజు కూడా అయింది.