గోపీ చంద్ తప్పు చేస్తున్నాడా?

2015 నుంచి నటించిన ఏడూ వరుసగా ఫ్లాప్ అయి, ఫ్యాన్ బేస్ కోల్పోతూ వచ్చిన గోపీచంద్, మళ్ళీ తనదైన అదే మార్కు రొటీన్ మసాలా ‘సీటీ మార్’ (అంటే ఈల వేయ్) తో వస్తున్నాడు. కబడ్డీ ఆటతో మరో స్పొర్ట్స్ డ్రామా ఇది. దీన్ని ఏప్రెల్ 2 న విడుదల ప్రకటించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని చెప్పి విడుదల వాయిదా వేశారు. నిజానికి అదే ఏప్రెల్ 2 న నాగార్జున, కార్తీ ల రెండు భారీ సినిమాలు ‘వైల్డ్ డాగ్’, ‘సుల్తాన్’ లు ఉండడం వల్ల ‘సీటీ మార్’ ని వాయిదా వేశారు. తాజాగా మరో తేదీ ప్రకటించారు. ఈ తేదీకి మళ్ళీ పెద్ద పోటీయే వుంది. ఇదే ఏప్రిల్ 30 న ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రానా ‘విరాటపర్వం’ వుంది!

 

ఇంకా సమీపంలో, అంటే ఒక్క వారం ముందు, ఏప్రెల్ 23 న నాని ‘టక్ జగదీష్’ వుంది. జయలలిత బయోపిక్ ‘తలైవి’ కూడా 23 నే వుంది. 30 న ‘విరాటపర్వం’ తో బాటు నాగశౌర్య ‘లక్ష్య’ కూడా వుంది. నాగశౌర్య ‘వరుడు కావలెను’ కూడా 30 నే వుంది. సుధీర్ బాబు ‘శ్రీదేవీ సోడా సెంటర్’ కూడా 30 నే వుంది. ఇంకాస్త వెనక్కి వెళ్తే, 20 న మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ వుంది. అంటే 20 – 30 తేదీల మధ్య గోపీ చంద్ కి పోటీగా 6 ప్రధానమైన సినిమాలున్నాయి. ఇంత పోటీని ఎలా తట్టుకుంటాడనేది ట్రేడ్ వర్గాల్లో ప్రశ్నగా మారింది.

 

ఇలా వుండగా, ఏప్రిల్ లో ఇంకా విడుదలవుతున్న ప్రధాన సినిమాలున్నాయి. 2 న ‘వైల్డ్ డాగ్’, ‘సుల్తాన్’ ల తర్వాత, 9 న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ వుంది. 14 న సాయి ధరమ్ తేజ్ ‘ఎస్ పి టి’ వుంది. సందీప్ కిషన్ ‘రౌడీ బేబీ’ కూడా వుంది. 16 న నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, 19 న శ్రియ – నిత్యా మీనన్ ల ‘గమనం’ వున్నాయి.

ఏప్రెల్ నెలలో మొత్తం కలిపి 13 ప్రధాన సినిమాలున్నాయి ‘సీటీ మార్’ కాక. ‘సీటీ మార్’ ని రెండో తేదీనే రిలీజ్ చేస్తే వెనుక ‘రంగ్ దే’ తప్ప మరొకటి లేదు. 2 న నాగ్, కార్తీల సినిమాలే వున్నాయి. అందులోనూ కార్తీ సినిమా డబ్బింగ్. నాగ్ ది యాక్షన్ మూవీ. ఈ రెండిటి ముందు ‘సీటీ మార్’ బీసీ సెంటర్ల మాస్ సినిమాగా ఎంతో కొంత సేఫ్ అయ్యేది. అదే ఎప్రెల్ 30 నా విడుదల చేస్తే, ఆల్రెడీ విడుదలైన ఏడు తో బాటు, ఇంకో ఆరు ‘సీటీ మార్’ ని ఛిన్నాభిన్నం చేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *