ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను
-టి లక్ష్మినారాయణ
ఆప్తమిత్రుడు సజ్జల దివాకర్ రెడ్డి మృతి బాధ కలిగించింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దివాకర్ నేడు మరణించడంతో ఒక విలువైన మిత్రుడ్ని కోల్పోయాను. మా మిత్రబంధానికి నాలుగున్నర దశాబ్ధాలు. మౌనంగా రోధిస్తూ, మా దివాకర్ కు నివాళులర్పిస్తూ, దివాకర్ సతీమణి భాగీరథమ్మకు, కుమారుడు సందీప్ కు, కుమార్తెకు, తమ్ముడు సజ్జల రామకృష్ణారెడ్డి – లక్ష్మీ, అన్న జనార్ధన్ రెడ్డి, నర్రెడ్డి భరద్వాజ్ రెడ్డి తదితర కుటుంబ సభ్యుల విషాదంలో పాలుపంచుకొంటున్నాను. దివాకర్ అంత్యక్రియల్లో పాల్గొనలేక పోతున్నందుకు చింతిస్తున్నా.
దివాకర్ తో నాకున్న అనుబంధం, ఉద్యమ స్మృతులు తొలిచేస్తున్నాయి. ప్రత్యేకించి విద్యార్థి దశలో నేను తిరుపతి ఎస్.వి.ఆర్ట్స్ కాలేజీలో బి.కాం.(1975-78) విద్యార్థిగా ఉన్నప్పుడు దివాకర్ ఎస్.వి.యూనివర్సిటీలో ఎం.ఎస్.(జియాలజీ) విద్యార్థి. 1977లో, విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో ఒకవైపు నారా చంద్రబాబునాయుడు(నాడు రీసర్చ్ స్కాలర్)గారు బలపరిచిన అభ్యర్థి, మరొకవైపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(నాడు రీసర్చ్ స్కాలర్)గారు బలపరిచిన అభ్యర్థి రంగంలో ఉన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏ.ఐ.ఎస్.ఎఫ్.) అభ్యర్థిగా మా దివాకర్ ను యూనియన్ ప్రెసిడెంట్ స్థానానికి పోటీ చేయించి, ఘనవిజయం సాధించాం. ప్రత్యర్థులు కంగుతిన్నారు. ఒక ప్రత్యర్థివర్గం ఓటమిని జీర్ణించుకోలేక పోయింది.
ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల తర్వాత ఏ.ఐ.ఎస్.ఎఫ్. జాతీయ సమితి విద్యార్థుల సమస్యలపై దేశ వ్యాప్త సమ్మెకు పిలుపిచ్చింది.
ఎస్.వి.యూనివర్సిటీలో కూడా సమ్మె చేయించాం. దివాకర్ సైన్స్ విభాగం. ఆర్ట్స్ విభాగం నుండి యూనియన్ సెక్రెటరీగా గెలిచిన వ్యక్తి ప్రత్యర్థివర్గానికి చెందినవాడు. మా ఆర్ట్స్ విభాగంలో ఎలా సమ్మె చేయిస్తారంటూ అతను గిల్లిగజ్జాలు పెట్టుకోవడం మొదలు పెట్టాడు. ఒక రోజు అర్థరాత్రి పూట ఘర్షణ వాతావరణం నెలకొన్నదని కబురొస్తే వెళ్ళి జోక్యం చేసుకొని నివారించాం. అటుపై నాలుగైదు రోజులకు మళ్ళీ ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
విద్యార్థులుకాని వారు క్యాంపస్ లోకి వచ్చారని తెలిసి ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడానికి వెళుతుంటే దారి మధ్యలో మాపై దాడి చేశారు. అప్పుడు దివాకర్ తో పాటు నేను, తులసేంద్ర, రణధీవె, ఇద్దరు ఈశ్వరయ్యలు అంటే ఆరు మంది మాత్రమే ఉన్నాం. పైపెచ్చు నిరాయుధులం. ప్రత్యర్థులు సైకిల్ చెయిన్స్, దోమతెర ఐరెన్ రాడ్స్, వగైరా ఆయుధాలతో దాడి చేశారు. మమ్మల్ని మేం రక్షించుకోవడానికి ఎదురొడ్డి నిలిచాం. ప్రత్యర్థుల చేతుల్లోని ఆయుధాలను లాక్కొనే ప్రయత్నాల్లో ఉండగా ఒకతను మా దివాకర్ ను వెనుక నుంచి నైప్ తో వీపుపై పొడిచాడు. వాళ్ళ టార్గెట్ దివాకరే. దాంతో కుప్పకూలిపోయాడు. మేం ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఉండి వెనుక ఏం జరిగిందో గమనించే లోపే దూరం నుంచి గమనించిన కొందరు మిత్రులు పరుగు పరుగున వచ్చి రక్తం మడుగులో పడిఉన్న దివాకర్ ను రుయా హాస్పిటల్ కు తీసుకెళ్ళి పోయారు. ఇది గమనించిన ప్రత్యర్థులు వెనకడుగు వేసి, పారిపోవడం మొదలు పెట్టారు. మేం వెంటపడి పొడిచిన వ్యక్తిని పట్టుకొని, పోలీసులకు అప్పగించాం. అనేక రోజుల చికిత్స అనంతరం నాడు మా దివాకర్ మరణం అంచుల వరకు వెళ్ళి, తిరిగొచ్చి మాతో ప్రయాణాన్ని కొనసాగించాడు. అంతగట్టి ప్రాణం ఈవాళ నిర్జీవమై పోయింది.
దివాకర్ ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా కొంత కాలం ఉన్నారు. ఎం.ఎస్సీ. పూర్తి చేశాక దివాకర్ ముందు ఒక ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, అటుపై పారిశ్రామికవేత్తగా మారాడు. నేను కమ్యూనిస్టు ఉద్యమంలో పూర్తి కాలం పని చేయడానికి నిర్ణయించుకొని ఉద్యమంలో కొనసాగాను.
దివాకర్ తొలినాళ్ళలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. నేను సిపిఐ, కడప జిల్లా కార్యదర్శి(1991-95)గా ఉన్న రోజులవి. ఒక రోజు దివాకర్ ఫోన్ చేసి, అప్పు కావాలన్నాడు. నాకు అప్పిచ్చే స్తోమతలేదు కదా! అన్నాను. నేను అడుగుతున్నది పార్టీ డబ్బు ఏమైనా ఉంటే అప్పుగా ఇమ్మని అన్నాడు. పార్టీ అవసరాల కోసం ప్రజల నుండి విరాళాల రూపంలో పోగుచేసిన నిధిని అప్పుగా ఇవ్వడం సాధ్యం కాదు. నీవు ఇబ్బందుల్లో ఉన్నావని ఒక మిత్రుడుగా నేను అప్పు ఇస్తే త్యాగధనుడైన కా.యన్.శివరామిరెడ్డి గారి ప్రతిష్టపై ప్రభావం పడుతుంది. ఆయన అల్లుడు కాబట్టే పార్టీ డబ్బును అప్పుగా ఇచ్చారనే దురభిప్రాయం కొందరికైనా కలిగే అవకాశం ఇచ్చిన వారమవుతాం. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడైన కా.యన్.ఎస్. కు సంబంధం లేకుండానే ఆయనకు మచ్చతెచ్చిన వాళ్ళం అవుతాం! అందువల్ల పార్టీ నిధిని అప్పుగా ఇవ్వలేనని నిర్మొహ మాటంగా చెప్పేశాను.
ఆ తర్వాత కొంత కాలానికి పార్టీ సమావేశంలో పాల్గొనడానికి కడప నుండి హైదరాబాదుకు వెళ్ళాను. దివాకర్ ఫోన్ చేసి భోజనానికి ఆహ్వానించాడు. హిమయత్‌నగర్ లోని ఒక చైనీస్ హోటల్ లో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పు ఎంత డబ్బు కావాలో అన్నాడు. నేను బిక్కమొఖం వేసి నా మీద నీకు బాగా కోపం ఉన్నట్లుందే! నాకు డబ్బు అవసరం లేదని సమాధానం చెప్పాను. నీ మీద కోపం రావడానికి నువ్వేం చేశావ్! పార్టీ డబ్బు, ప్రజల డబ్బు, మిత్రుడైనంత మాత్రాన అప్పు ఇవ్వలేను అన్నావ్! అది నాకు నచ్చింది. ఆర్థికంగా స్థిరత్వం వచ్చింది. అందుకే పార్టీకి విరాళం ఇవ్వాలని నిర్ణయించుకొన్నా. నీకు కాదు, పార్టీకి అడుగు అన్నాడు. ఆ మాటలు విని ఎంతో ఉప్పొంగిపోయాను. మిత్రుడి ఔన్నత్యం, ఉదారత నన్నెంతో ఉత్తేజపరిచింది. పార్టీ కోసం అయితే నీ బుద్ధిపుట్టినంత విరాళంగా పంపు అన్నాను. ఒక మొత్తం చెప్పాడు. వారం తిరగక ముందే చెక్ పంపాడు. అటుపై ప్రతి సంవత్సరం పంపేవాడు.
దివాకర్ యొక్క ఆర్థికపరమైన విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి నేను ఏనాడు కనబరచలేదు. కానీ, ఒకరిద్దరు మిత్రులు చెప్పగా విన్నాను, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు చేసిన అప్పులను ఆర్థికంగా కుదుటపడ్డాక రుణదాతల ఇళ్ళకు వెళ్ళి ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా అప్పు మొత్తాలను తిరిగి చెల్లించాడని చెప్పినప్పుడు “దటీజ్ దివాకర్” అని ఎంతో సంతోషించాను.
దివాకర్ వాళ్ళ మామ కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన అమరజీవి కా.యన్.శివరామిరెడ్డి గారి మొదటి సంస్మరణ సభ కడపలో నిర్వహించినప్పుడు దివాకర్ ఫోన్ చేసి సభకు నువ్వు అధ్యక్షతవహించి, నిర్వహించాలని మేమంతా(కుటుంబ సభ్యులు) భావిస్తున్నామని చెప్పాడు. నా మీద వారికున్న అభిమానాన్ని నేనెలా కాదనగలను, సరే అని ఒప్పుకొన్నా.
మేము పెద్దగా తరచూ కలుసుకొనే వాళ్ళం కాదు. కానీ, మా మధ్య ఉన్న మిత్రబంధం అభిమాన పునాదులపై నిర్మించబడింది. అవాంతరాలు వచ్చినా ఆ బంధం ఏ మాత్రం చెక్కు చెదర లేదు.
విద్యార్థి దశలో ఉద్యమ సహచరుడు, తదనంతర కాలంలో ఒక మంచి విశ్వసనీయమైన మిత్రుడు సజ్జల దివాకరరెడ్డికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నా.
(టి.లక్ష్మీనారాయణ,సామాజిక ఉద్యమకారుడు)