ఉగాది పండగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 వ పి.ఆర్ సి ని ప్రకటిస్తారని రాష్ట్రం లో ఉద్యోగులంతా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పిఆర్ ఎసి అమలు ప్రకటన చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనితో ఆంధ్ర ఉద్యోగులు తమ ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేయాలని కోరుతున్నారు.
పి.ఆర్.సి ఆలస్యం అయితే ఉద్యోగుల జీతభత్యాల విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి 11 పి.ఆర్.సి ప్రకటిస్తారని ఆశ గా ఎదురు చూస్తున్నామని ఏ. పి జె.ఏ. సి అమరావతి ఛైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
‘సి.ఎఫ్.ఎం.ఎస్ మాకు వరమో శాపమో తెలియట్లేదు. మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ రోజుకి పెన్షన్ అందని పరిస్థితి నెలకొంది,’ అని ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
వందలాది మంది ఉద్యోగులకు రావాల్సిన దాచుకున్న డబ్బులు గత కొంతకాలంగా నిలుపుదల చేసింది. ఏ ఉన్నతాధికారులు చెప్పుకుందామన్న ఎవరు మాకు అందుబాటులో లేరు. ఈ ఆలస్యం వల్ల ఇంట్లో శుభకార్యాలు కూడా వాయిదా పడ్డాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను పిలిపించి సమీక్ష నిర్వహించాలని ఉద్యోగులు కోరుతున్నారని ఆయన చెప్పారు.