తెలంగాణ టీచర్ల సంఘ నేతలకు ఒక సవాల్… నిరుద్యోగుల తరఫున

టీచర్ల సంఘ నేతలకు తెలంగాణ తల్లుల గర్భశోకం వినిపించడం లేదా?

 

(వడ్డేపల్లి మల్లేశము)

2014లో  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అని ప్రకటన చేస్తే, అపుడే ఏర్పడిన బిజెపి కేంద్ర ప్రభుత్వం ఏటా కోటి ఉద్యోగాలతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తామని మాట ఇచ్చాయి. ఆ మాటలు అమలు కాకపోగా ప్రజలందరికీ నిరాశే మిగిలింది.
తెలంగాణ ఆవిర్భావo నీళ్లు ,నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం లక్ష్యాలుగా జరిగితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిప్పటి  నుండి యువజన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించక పోగా ఎలాంటి ఉద్యోగాలను ఇవ్వలేదు. దీనితో నిరుద్యోగులు, పట్టభద్రులు ఉన్నత విద్యావంతులు పరిశోధకులు నిరాశా నిస్పృహలకు లోనై అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఉద్యోగ ఉపాధ్యాయ అభ్యుదయ ప్రజాసంఘాల మౌనమేల?

ఆ రోజు సకల జనుల సమ్మె తోపాటు సబ్బండ వర్ణాల ఉమ్మడి కృషి వల్ల ముఖ్యంగా విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు, పట్టభద్రులు, అన్ని తరగతుల నిరుద్యోగులు ఉద్యోగుల తో సహా అందరం కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.

విశ్వవిద్యాలయాలలో తమ చదువును పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఎందరో విద్యార్థులు బుద్ధిజీవులు అసువులు బయటనే కాదు చిత్రహింసలకు గురి కావడంతో పాటు బలిదానాలకు కూడా పాల్పడ్డారు.ఉద్యోగులుగా మనమూ మన సహకారాన్ని అందించడం జరిగింది, కానీ యువత తమ ప్రాణ త్యాగాలకు తెగించి పోరాడింది. రాష్ట్రం ఏర్పడితే యువజనుల నిరుద్యోగుల సకల సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్దేశంతో రాజకీయ పార్టీలతో సైతం నిరుద్యోగ యువత చేతులు కలిపి సాధించుకున్న విషయం మీకు తెలియదా?

గత ఏడు సంవత్సరాలుగా పోలీసు ఉద్యోగాలు మినహాయించి పెద్దగా సివిల్ ఉద్యోగాలను భర్తీ చేసిన దాఖలాలు లేదు. ఆ కారణంగా ప్రస్తుతం రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ యువతలో నిర్వేదం నిరుత్సాహాన్ని పెంచి పోషిస్తున్నది ప్రభుత్వం.

మొన్న 22 మార్చి రోజున అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల వేతన హెచ్చింపు ను ప్రతిపాదిస్తూ నే ఉద్యోగ విరమణ వయస్సు 58 నుండి 61 కి పెంచుతున్నట్లు గా ప్రకటించడం మీకందరికీ తెలిసిందే. వేతన హెచ్చింపు తోపాటు ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యల పైన పోరాడి సాధించుకున్న ఈ క్రమంలో మీరు ఏనాడు కూడా డిమాండ్ చేసినట్టు వంటి మూడు సంవత్సరాల ఉద్యోగ పెంపుదలను మీరు ఎందుకు ఆమోదించినట్లు?

ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా మూడు సంవత్సరాల వయో పరిమితిని పెంచమని అడగలేదని అంటూనే ఆ ప్రతిపాదన పట్ల మౌనంగా ఉండటం మీకు న్యాయమేనా?

ప్రభుత్వాలకు రాజకీయాలు ఉంటాయి కనుక రాజకీయ ప్రయోజనం కోసం ఏ చర్యలకైనా పాల్పడతాయి. ప్రజాభిమానం కోసం, మద్దతు కోసం లేనిపోని ఆశలు కల్పించి మేనిఫెస్టోలో ప్రకటించినామనే ఏకైక కారణం చూపి నిరుద్యోగుల విద్యావంతుల పొట్టలు కొట్టి నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానం మీకు ఎలా నచ్చింది?

అభ్యుదయ సంఘాలు అని చెప్పుకుంటారు కదా

యుటిఎఫ్, టి పి టి ఎఫ్, డి టి ఎఫ్, వంటి ఉపాధ్యాయ సంఘాలు  అభ్యుదయ వాదులుగా, అభివృద్ధి కాములుగా చెప్పు కుంటారు కదా, ఈ విషయంలో మౌనంగా ఉండడం తో  మీ, అభ్యుదయం, అభివృద్ధి ఏపాటిదో ఎవరికోసమో అర్థమయ్యింది.

ఉద్యోగ సంఘాల్లో ఉన్న నాయకులకు వ్యక్తిగత అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ఎన్నోసార్లు చట్టాలను అతిక్రమించి వ్యక్తిగత ప్రయోజనాలకు పాల్పడింది కనుకనే ఇవాళ అనేక ఉద్యోగ సంఘాల నాయకులు పాలాభిషేకాలు పుష్పగుచ్ఛాలు సన్మానాలు స్వాగత తోరణాలు కడుతున్నాయి.

ప్రభుత్వాన్ని పొగడటం, ముఖ్యమంత్రి గారిని అభినందించడంలో తలకిందులువుతున్న ఉద్యోగ సంఘాల చైతన్య ఏపాటిదో మనకు అర్థం అయింది.

ఉద్యోగ సంఘాలకు ఒక్కరోజు ఒక రోజే ఆసరా అనే విధానంలో వారి అక్రమ సంపాదనకు పాల్పడిన అటువంటి అలవాటు ఉన్న కారణంగా మౌనంగా ఉన్నారు అనుకుందాం. అది వారి విజ్ఞతకే వదిలి వేద్దాం.

కానీ ప్రజా సమస్యల పరిష్కారం తోనే మన సమస్యలు ముడిపడి ఉన్నాయని. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రజలతో మమేకం కావాలని అనేకసార్లు చెప్పిన ఉపాధ్యాయ సంఘాలు ఎంతో మంది తల్లుల గర్భశోకానికి కారణం అవుతున్నాయి.  నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా, ఉద్యోగాలు రాకుండా చేసినటువంటి ఉద్యోగ విరమణ వయసు పెంపు ఎందుకు ప్రతిఘటించడం లేదు?
నిరుద్యోగుల ప్రజాస్వామిక వాదుల నిరసన మంటల్లో మాడిపోతారు జాగ్రత్త.

తమ కడుపు నిండితే చాలు అనుకునే హీనమైన మనస్తత్వానికి ప్రతీకగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆకలితో అలమటిస్తూ పేదరికాన్ని ముద్దాడుతూ తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నటువంటి నిరుద్యోగ పట్టభద్రులు విద్యార్థులకు ఏనాడు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయలేదు.

వారి పొట్ట కొట్టే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఒక్క వేల మంది ఉద్యోగుల సర్వీసును మరొక్క మూడేళ్లపాటు పెంచడం స్వార్థపూరితమైన కాదు రేపు నిరుద్యోగులు ప్రజా సంఘాలు ప్రజలు చేపట్టే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఉద్యోగ విరమణ వయస్సు పెంపును ఉపసంహరించుకోవాలని చేయబోయే పోరాటంలో సమిధలు కాకమానరు.

వ్యతిరేకిస్తారని, ప్రతిఘటిస్తారేమోనని

అసెంబ్లీలో ప్రకటించిన మూడవరోజు అంటే గురువారం రోజున చట్టసభల్లో వయస్సు పెంపు ప్రతిపాదనలను ఆమోదించినట్లు గా ప్రకటించడాన్ని బట్టి ప్రజా సమస్యల పరిష్కారంలో చూపే శ్రద్ధ ఈ విషయంలో చూపడానికి కారణం ఏమిటో విడుదలైన అందరూ పరిశీలించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.

ఉద్యోగ విరమణ వయస్సు ముఖ్యాంశాలు:

భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సు 61 లేదు. ఆ ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉండడం శోచనీయం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 60 సంవత్సరాలు ఉండగా 15 రాష్ట్రాలలో కూడా 60 సంవత్సరాల గానే ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో 58 గా మాత్రమే కొనసాగుతున్నది విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బందికి 62 ఏళ్లు ఉండగా వైద్యరంగంలో బోధన వైద్య సిబ్బందికి మాత్రం 65 సంవత్సరాలు గా ఉండడం గమనించాలి. అనుభవజ్ఞులైన వైద్యుల ను సేవారంగంలో కొనసాగించడానికి మాత్రమే ఈ వయసు ఉద్దేశించబడినది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం 1956 నుండి 58 సంవత్సరములు గా విరమణ వయస్సు నాలుగవ తరగతి ఉద్యోగులకు మాత్రం 60 సంవత్సరాలుగా ఉండేది.

1985 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు  నిరుద్యోగులకు ఉపాధి అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఉద్యోగ విరమణ వయసు 56 కు తగ్గించారు.

అయితే,   ఉద్యోగుల సంఘాలు కోర్టుకెళ్లి అనుకూల తీర్పును పొందడంతో 86 లో అప్పటి ప్రభుత్వం మళ్ళీ 58 సంవత్సరాల కు పెంచినది అప్పటినుండి 58 సంవత్సరాలు కొనసాగించ గా ఇటీవల 60 సంవత్సరాలకు ప్రభుత్వం పెంచుతుందని ఊహించారు.  వారందరి అంచనాలను కాదని 61 సంవత్సరాలకు పెంచడం ప్రజలందరినీ, ముఖ్యంగా నిరుద్యోగులను నిరాశకు గురి చేయడమే కాదు ఆందోళనకు దారి తీసే విధంగా ఉన్నదని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా జరుగుతున్న గత 4 మాసాల పోరాటం సర్వోన్నత న్యాయస్థానం సూచనతో కేంద్ర ప్రభుత్వం తన చట్టాలనే సంవత్సరం పాటు వాయిదా వేయడం మనకు అందరకూ తెలిసినదే.

అలాగే నేడు రాష్ట్ర శాసనసభలో ఉద్యోగ విరమణ వయసు పెంపు ప్రతిపాదన బిల్లు ఆమోదం పొందినప్పటికీ నిరుద్యోగులు పట్టభద్రులు మేధావులు బుద్ధిజీవులు విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు చేపట్టబోయే నిరసన పోరాటంలో మీరు కూడా పాల్గొని ప్రజల పక్షమే మేము అనే నినాదాన్ని ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్రజా పోరాటము ఉధృతమై ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ ఉద్యోగ విరమణ వయసు పెంపు ప్రతిపాదనను ప్రతిఘటించే పోరాటానికి మద్దతు ఇస్తారో ,లేక ప్రభుత్వ ప్రతిపాదనను సమర్థించి సామాజిక బాధ్యతను మరిచి ప్రజల ముందు నేరస్తులుగా మిగిలిపోతారో తేల్చుకోవాల్సిన అవసరం మీకు ఎంతగానో ఉన్నది.

Vaddepalli Mallesamu

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు,  కవి, రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట, సెల్ 9014206412)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *