జోరుగా సాగుతున్న మంగళగిరి తిరునాళ్లు…

‘మాయామర్మం తెలియని చిన్నది
మంగళగిరి తిరునాళ్లకు బోతే
జనం ఒత్తిడికి సతమతమవుతూ
దిగ్గుతోచక తికమకపడితే
సందుచూసుకుని సరసాలకు దిగు
గ్రంథసాంగులను కాపువేసుకుని…’

దులపర బుల్లోడో… దుమ్ము దులపర బుల్లోడా…
1965లో విడుదలైన ‘అంతస్తులు’ సినిమాలోని దులపర బుల్లోడో.. దుమ్ము దులపర బుల్లోడా అంటూ భానుమతి పాడిన పాటలో మంగళగిరి తిరునాళ్ల జనసందోహం ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు.

ఒక సాంస్కృతిక మహోత్సవంగా మంగళగిరి తిరునాళ ప్రసిద్ధిగాంచింది. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివార్ల బ్రహ్మోత్సవాల విశేషాలు తెలుసుకుందాం.

మంగళాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థానం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది. దేశంలో అష్టవైష్ణవ క్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రంగా పేరొందింది. ఎగువ సన్నిధిలో స్వామివారు పానకాన్ని సేవిస్తూ ఉండడం వల్ల పానకాల స్వామిగా పిలుస్తారు.

భక్తులు సమర్పించే పానకంలో సగం మాత్రమే స్వీకరిస్తారు. పానకం వొలికినా ఒక్క ఈగ కూడా ఉండకపోవడం క్షేత్రమహిత్యంగా చెప్పుకుంటారు. ఇక దిగువసన్నిధి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాస సమయంలో ధర్మరాజు ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణదేవరాయలు మంటప నిర్మాణం గావించగా, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అతి ఎత్తయిన రాజగోపురాన్ని నిర్మించారు.

శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతియేటా ఫాల్లుణ శుద్ధ షష్ఠి నుంచి బహుళ విదయ వరకు 12 రోజుల పాటు జరుగుతాయి. ఈ ఏడాది మార్చి 19న ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు కీలకఘట్టానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన పొన్నవాహనోత్సవం ఈ నెల 26 అంటే ఈ రోజు సాయంత్రం 7గంటలకు జరగనుంది. ఈ ఉత్సవానికి మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం కైంకర్యపరులుగా వ్యహరిస్తుంది.


పొన్నవాహన ప్రాశస్త్యం: మనలను మనం రక్షించుకొను ప్రయత్నం చేయునంతకాలం స్వామి మనను రక్షించడు. అన్యధా శరణం నాస్తి, త్వమేవశరణుమమ… అని రెండు చేతులు ఎత్తి ఎలుగెత్తి పిలవాలి. మన రక్షణ భారాన్ని స్వామియందే ఉంచాలి. అలా శరణుజొచ్చిన భాగవతోత్తములే గోపికలు. గోపికలను ఎలా రక్షించాడో అలాగే పొన్నవాహనోత్సవాన్ని దర్శించిన మనందరినీ శ్రీస్వామివారు రక్షిస్తారు.

శనివారం ఉదయం 9 గంటలకు అశ్వ వాహనం, అర్ధరాత్రి 12.00 గంటలకు కళ్యాణ మహోత్సవం కనుల పండువగా సాగుతుంది. స్వామి కల్యాణానికి ముందు చెంచులు తమ ఆడపడుచు చెంచులక్ష్మిని నరసింహస్వామి వివాహం చేసుకున్న గుర్తుగా ఆలయ ఆవరణలో ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీవారు శేషవాహనంపై గ్రామోత్సవంలో పాల్గొని ఎదుర్కోల ఉత్సవం జరుపుకొని అర్ధరాత్రి కల్యాణ వేదికను అలంకరిస్తారు. పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం వారు తమ ఆచారం ప్రకారం మధుపర్కాలు, మంగళ ద్రవ్యాలు సమర్పిస్తారు. వైకుంఠ నగరంలో శోభాయమానంగా ప్రకాశించే ఈ వేదికపై స్వామి వారి కల్యాణాన్ని తిలకించిన వారందరికీ శుభాలు కలుగుతాయి.

ఆదివారం ఉదయం 6 గంటలకు బంగారు గరుడోత్సవాన్ని నిర్వహిస్తారు. గరుత్మంతుడు జ్ఞానప్రదాత. శ్రీస్వామివారి సేవ తప్ప అన్యమెరగనివాడు గరుత్మంతుడు. బంగారు గరుడ వాహనోత్సవాన్ని దర్శించినవారికి జ్ఞానబుద్ధి, ఐశ్వర్య వృద్ధి కలుగుతాయి.

మార్చి 28 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దివ్యరథోత్సవం అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. ‘రథస్థం కేశవ దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే’ రథారూఢుడైన స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదు. భక్తజనులు, ముక్కోటి దేవతలు ఈ దివ్యరథోత్సవాన్ని దర్శించి పులకించిపోతారు. పెద్ద రథం ఆరు చక్రాలతో అత్యంత సుందరంగా, గంభీరంగా ఉంటుంది. ఎంతో ఎత్తుతోపాటు అధిక బరువు కలిగి, పరిమళ పుష్పాలమాలతో గంభీరమైన ఈ మహారథం కదిలితే చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ క్రమంలో రథారూఢుడైన కల్యాణ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివార్లను దర్శించుకుని రథచక్రాలకు భక్తి పారవశ్యంతో టెంకాయలు కొట్టి ముక్తిని పొందాలని ప్రతి ఒక్క భక్తుడు అనుకుంటాడు. రథోత్సవంలో రథాన్ని లాగేందుకు వేలాది మంది పోటీపడతారు. రథ గమన వేగాన్ని నిర్దేశించేలా రథచక్రాలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్ల చప్పాల బృందం చప్పాలను వేస్తుంటుంది. ఈ మహోత్సవంలో ఒక కీలక పాత్ర వహించే అవకాశం రావడాన్ని చప్పాల బృందం మహత్ భాగ్యంగా భావిస్తుంది. మంగళగిరి తిరునాళ్ళుగా ప్రసిద్ధి గాంచిన రథోత్సవం నాడు భక్త జనం సంద్రాన్ని తలపిస్తుంది. తిరునాళ్లు, దివ్య రథోత్సవం మంగళగిరికి ఒక సాంస్కృతిక మహోత్సవంగా చెప్పవచ్చు.


సోమవారం ఉదయం 8 గంటలకు చక్రవారి చూర్ణోత్సవం, వసంతోత్సవం జరుగుతాయి. రాత్రి 8 గంటలకు ధ్వజ అవరోహణం, కేళీగుర్రం, దొంగలదోపిడీ, మంగళవారం ఉదయం 9గంటలకు పుష్పయాగం, ఆలయ ద్వాదశ ప్రదక్షిణలు, రాత్రి 8 గంటలకు పర్వంకోత్సవం వీటితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. బ్రహ్మోత్సవాలను ప్రత్యేకాధికారి, దేవదాయశాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసరావు (వాసు), దేవస్థానం కార్యనిర్వహణాధికారి మండెపూడి పానకాలరావు, పాలకమండలి సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి కళ్యాణోత్సవం, దివ్య రథోత్సవానికి మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఫొటోలు: గురువారం ఉదయం, రాత్రి జరిగిన హంస, గజ వాహనోత్సవాలు, బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *