ఏప్రిల్ 9 తెలంగాణ కు మరొక ముఖ్యమయిన తేదీ అవుతుందా? ’ఏప్రిల్ 9‘ మళ్లీ తెలంగాణ లో పునరుజ్జీవం పోసుకుంటుందా?
ఒకపుడు ఏప్రిల్ తొమ్మిదికి చాలా ప్రాముఖ్య ఉండింది. ఆంధ్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పిన తేదీ అది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త తేదీలు ఈ తేదీని మరుగుపరిచాయి.
ఏప్రిల్ 9 పదేళ్ల తెలుగుదేశం పాలన (1994-2004) ముగింపునకు బీజం వేసిన తేదీ అది. ఆ రోజునే ( 2013 ఏప్రిల్ 9) నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు.
అంతవరకు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, అది చచ్చిన పార్టీ, ఆ పార్టీ ఇక అధికారంలోకి రాదు అని ఇక తానే శాశ్వత ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు ‘2021 కలలు’ కంటున్న రోజులు. ఆరోజు వైఎస్ ఆర్ రంగారెడ్డి జిల్లా చెవేళ్ల నుంచి 1500 కిమీ పాదయాత్ర ప్రారంభించారు. అంతే, వైఎస్ పాదయాత్ర రాజకీయ సుడిగాలి సృష్టించి ముగిసింది, తెలుగుదేశం పాలనా ముగిసింది. 2004లో కాంగ్రెస్ పునరుజ్జీవం పొంది అధికారంలోకి వచ్చింది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. మరొక పదేళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉండింది. అందుకే ఏప్రిల్ 9కి తెలుగు రాజకీయాలలో విశిష్ట స్థానం.
ఈ ఏప్రిల్ 9నే ఎంచుకుని వెఎస్ కూతరు, జగన్ సోదరి షర్మిల తన తెలంగాణ రాజకీయ ప్రస్తానం ప్రారంభించపోతున్నారు. కాకపోతే, ఇది ఖమ్మం నుంచి మొదలువుతుంది. ఆ రోజు ఖమ్మం లో దాదాపు లక్ష ,రెండులక్షల మంది వైఎస్ ఆర్ అభిమానులతో సభ నిర్వహించి, పార్టీ పేరు ప్రకటించి, తన పాదయాత్ర ప్రకటించి షర్మిల తన తెలంగాణ అధ్యాయం ప్రారంభించబోతున్నారు.
రండి…కదలి రండి… లక్షలాదిగా తరలి వచ్చి
సంకల్ప సభను విజయవంతం చేయండి
రాజన్న సంక్షేమ పాలన కోసం రాజన్న బిడ్డను
స్వాగతించండి – ఆశీర్వదించండి
ఏప్రిల్ 9న ఛలో ఖమ్మం
వేదిక :- పెవిలియన్ గ్రౌండ్, ఖమ్మం #YSRForever #TelanganaWithYSSharmila #TeamYSSR #YSRTelangana pic.twitter.com/NJEkk3RJUV— Team YS Sharmila (@TeamYSSR) March 26, 2021
ఇక ఖమ్మం విషయానికి వస్తే, వైసిపికి ఒకపుడు ఇది బలమయిన కేంద్రం. 2014లో పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక ఎంపి ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి గెలిచిన వాడే. ఆయన తర్వాత టిఆర్ లో చేరారు. పార్టీ కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దర ఖమ్మం జిల్లా నుంచి గెలపొందిన వారే. తర్వాత ముగ్గురు కూడా పార్టీ ని టిఆర్ ఎస్ లో విలీనం చేశారు. ఈ విధంగా కూడా ఖమ్మం షర్మిలకు ముఖ్యమయిన జిల్లాయే. అందుకే పార్టీ ప్రారంభోత్సవానికి ఖమ్మం ఎంచుకున్నారనిపిస్తుంది.
ఇంతవరకు ఆమె తెలంగాణ 33 జిల్లాల వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరితోనూ పోత్తు ఉండదని ఒంటరిగానే పోటీ అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల అన్నట్లు వార్తలొస్తున్నాయి.
షర్మిల పార్టీ ప్రకటన ఒక కొత్త మలుపు అవుతుంది. ఎందుకంటే, తెలంగాణ రాజకీయాలు విచిత్రమయిన దశలో ఉన్నాయి. ప్రతిపక్షం లేని రాష్ట్రంగా అసెంబ్లీ తయారయింది. కెసిఆర్ ప్రజావ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నా, ఎన్నికల్లో టిఆర్ ఎస్ కే ప్రజలు పట్టం కడుతున్నారు. బహుశా టిఆర్ ఎస్ కొంత బలహీన పడిందేమో గాని, మరొక పార్టీని ఉనికిలోకిరానిచ్చే స్థితిలో మాత్రం లేదు. అందుకే తెలంగాణలో మరొక ధీటైన కొత్త పార్టీ పుట్టలేదు. పుట్టిన పార్టీలు బతకలేదు.
ఇది ఒరిస్సా మోడెల్. ఒరిస్సాలో ప్రతిపక్షాలు నామమాత్రమే. బిజెపి, కాంగ్రెస్ లో బయట రాష్ట్రంలో బలంగా ఉన్నా, అసెంబ్లీలో తిరుగులేని నాయకుడు బిజూ జనతాదళ్ (బిజెడి) నేత నవీన్ పట్నాయకే ఎపుడూముఖ్యమంత్రి. తెలంగాణ ఒరిస్సా బాటపడుతున్నదా?
ఇలాంటపుడు షర్మిల పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ ప్రజలతో ఎలా కెనెక్ట్ అవబోతున్నారనేది ఇంకా స్పష్టం చేయలేదు. ఇంతవరకు రాజన్న రాజ్యం ఏర్పాటు చేయడమే లక్ష్యం అని చెబుతూ వస్తున్నారు. రాజన్న రాజ్యం ఏర్పాటు కావాలంటే కెసిఆర్ బంగారు తెలంగాణను కూల్చేయాలి. దీనికి ఆమె తీవ్రమయిన కెసిఆర్ వ్యతిరేక వైఖరి తీసుకోవాలి. అపుడే కెసిఆర్ కు షర్మిల ధీటైన నాయకురాలు అనే పేరు వస్తుంది. ఇలాంటి పేరు తెచ్చుకునే ఈ మధ్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెల్చినంత టెన్షన్ టిఆర్ ఎస్ లో క్రియేట్ చేసి తెలంగాణతో ఓడి గెల్చిన తొలి యువ నాయకుడయ్యాాడు. దీనికి కారణం, టిఆర్ ఎస్ సమాధానం చెప్పలేనంతగా ఆయన కెసిఆర పరిపాలన లొసుగులను ఆధారాలతోసహా ఎత్తి చూపారు. అందుకే, ప్రొఫెసర్ కోదండ్ రామ్ ను కూడా కాదని కెసిఆర్ దీటైన వాడు తీన్మార్ మల్లన్న యేనని పట్టభద్రులు గుర్తించేలా చేశాడు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో షర్మిల తీసుకోవాలసి మెసేజ్ ఇది.