చాలా రోజులకు మళ్లీ తెలుగు సినిమా జాతీయ స్థాయిలో వెలిగింది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ” మహర్షి” నిలిచింది. అలాగే నాని హీరోగా వచ్చిన ” జెర్సీ” సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం విశేషం. జెర్సీ సినిమా మరోసారి తెలుగు సినిమా సినిమా కు మరింత గౌరవాన్ని సంపాదించింది. జాతీయస్థాయిలో ఈ సినిమాకు ఉత్తమ ఎడిటింగ్ అవార్డు రావడం తెలుగు సినిమా కు కాసింత గర్వకారణం.
’జెర్సీ‘ మీద April 21, 2019 మేం ప్రచరించిన రివ్యూ
జెర్సీ ….ఒక ఎమోషనల్ జర్నీ (మూవీ రివ్యూ)
సిఎస్ సలీమ్ బాషా
జెర్సీ
రచన దర్శకత్వం : గౌతమ్ టి.
తారాగణం : నాని, శ్రద్ధా శ్రీనాథ్, సత్యరాజ్, బ్రహ్మాజీ, సుబ్బరాజు తదితరులు
సంగీతం : అనిరుధ్, ఛాయగ్రహణం : సానూ వర్ఘీస్
బ్యానర్ : సితార ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
విడుదల : ఏప్రెల్ 19,2019
జెర్సీ కూడా ఒక క్రీడా నేపథ్యంలో (క్రికెట్ )తీసిన సినిమా. అంతకన్నా ముందు తెలుగులో (ఈ మధ్యనే వచ్చిన) “మజిలీ” సినిమా కూడా అలాంటిదే. కొంత కాలం క్రితం పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో “గోల్కొండ హైస్కూల్” అనే సినిమా వచ్చింది. అయితే అందులో హీరో(సుమంత్) ఆటగాడిగా కాకుండా కోచ్ పాత్ర లో ఉన్నాడు. చాలా కాలం క్రితం తెలుగులో హీరో(వెంకటేష్) ను క్రికెట్ ఆటగాడిగా చూపిస్తూ “వసంతం” అనే సినిమా వచ్చింది. అయినా అది పూర్తిగా క్రికెట్ తో ముడిపడిన సినిమా కాదు. ఇక హిందీలో క్రికెట్ నేపథ్యంలో రెండు పెద్ద సినిమాలు వచ్చాయి.పైగా అవి బయోపిక్స్. ఒకటి ఎం.ఎస్.ధోని, రెండవది “అజర్”. మొదటిది హిట్ అయితే , రెండవది అంతగా ప్రేక్షకులకు రుచించ లేదు(అజర్ మ్యాచ్ ఫిక్సింగ్ అంశం వల్ల కావచ్చు). రెండు సినిమాల్లో హీరో పాత్రధారులు బాగా చేశారు. బయోపిక్ కనుక వాళ్లకు హీరో పాత్రల తీరుతెన్నులు బాగా తెలిసిఉండటం కలిసొచ్చిన అంశం. అయితే పై రెండు సినిమాల్లో హీరో పాత్రధారులకన్నా (సుశాంత్ సింగ్, ఇమ్రాన్ హష్మీ) నాని బాగా చేసాడు. పైగా ఇది బయోపిక్ కాదు- కల్పన. అందుకే నానికే ఎక్కువ మార్కులు పడతాయి!! నాని ఇంతవరకు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంతవరకు క్రికెట్ ఆట నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో (తెలుగైనా-హిందీ అయినా )ఇది కొంచెం డిఫరెంట్ అండ్ బెటర్ అని చెప్పొచ్చు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన భారీ కాల్పనిక సినిమా “లగాన్” గురించి ప్రస్తావించక తప్పదు. కానీ ఆ సినిమా స్థాయి వేరు. క్రీడా నేపథ్యంతో తీసిన ఏ సినిమా ను అయినా దీనితో పోల్చలేము.
జెర్సీ సినిమా చాలా వరకు చూడదగ్గది గా తీయడంలో యువ దర్శకుడు గౌతమ్ తిన్న నూరి సక్సెస్ కావటానికి కారణం అతని దర్శకత్వ ప్రతిభతో పాటు నాని నటన (కింది తరగతి ప్రేక్షకుల భాషలో చెప్పాలంటే, ఇరగదీశాడు). దానికి తోడు శ్రద్ధా శ్రీనాథ్, సంభాషణలు, చిత్రీకరణ (ముఖ్యంగా శ్రద్ధా శ్రీనాధ్ మధ్య జరిగే భావోద్వేగ సన్నివేశాలు, ఆటకు సంబంధించిన సన్నివేశాలు) ఒక స్థాయిలో ఉండడం సినిమా స్థాయిని కూడా పెంచాయి!
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో అంశం ఏంటంటే సినిమా చాలా వరకు సహజంగా, సాధారణంగా అనిపించడం. సినిమాకు మూల స్తంభాలు నాని, శ్రద్ధా శ్రీనాథ్ , కోచ్ పాత్రలో నటుడు, కట్టప్ప గా పాపులర్ అయిన సత్య రాజ్, నాని కొడుకు పాత్రలో రోనిత్. సత్య రాజ్ తనదైన శైలిలో బాగానే చేసినట్టు చెప్పుకోవాలి.
ఈ సినిమాలో ఉన్న మరో చిన్న పాత్ర నాని కొడుకు పాత్ర! మాస్టర్ రోనిత్ చాలా సహజంగా ఉండటం(నటించటం) సినిమా కు ఒక ప్లస్.ఇతర నటులు కూడా సినిమాను మంచి సినిమా స్థాయికి తీసుకెళ్లడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. ఈ సినిమా నాని వన్ మ్యాన్ షో! నాని తో ఒక సౌలభ్యం ఉంది. నాని చూడ్డానికి పక్కింటి కుర్రాడిలా ఉంటాడు(the boy next door). ప్రేక్షకులు నాని తో ఈజీగా కనెక్ట్ అవుతారు, తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. ఈ సినిమాలో కూడా ఇంతే. దానికి తోడు చిత్రీకరణ, సంభాషణలు! ఈ సినిమాలో ఇంకో ముఖ్యమైన అంశం కామెడీ కోసం ప్రత్యేకంగా ప్రయత్నించకపోవడం.. సినిమాలో స్నేహితులుగా వేసిన ప్రవీణ్ లాంటి వాళ్ళ వల్ల కామెడీ కూడా నవ్వుకో తగ్గట్టుగానే ఉంది. ఒకరిద్దరు క్రికెటర్ల జీతం నుంచి కొన్ని అంశాలు తీసుకున్నప్పటికీ ఇది బయోపిక్ కాదని దర్శకుడు , నాని ముందే చెప్పారు. “అయితే…. (మిగతా భాగం కింద…) బయోపిక్ లాగా ఉండేవిధంగా ప్రయత్నించామని”, నాని చెప్పడం విశేషం. ఇక సినిమా గురించి చెప్పాలంటే ముందే చెప్పినట్లు ఇది ఒక క్రికెటర్ భావోద్వేగ ప్రయాణం. ఈ సినిమా ప్రారంభ సన్నివేశంతోనే దర్శకుడు సినిమా కొంచెం డిఫరెంట్ తీసిఉంటాడన్న అభిప్రాయం కలిగిస్తాడు, తాను కొంచెం క్రియేటివ్ అని అనిపిస్తాడు. అలాగే చివరి సన్నివేశం కూడా!
సినిమాకు జెర్సీఅని పేరు పెట్టడం అన్నది కరెక్టేనని చివర్లో తెలుస్తుంది మనకి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన దర్శకుడు గౌతమ్ సన్నివేశాలను లాజికల్ గానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. నిజానికి బయ పిక్ లలోనే కొన్ని సినిమాటిక్ అంశాలు జోడించడం మనం చూస్తున్నాం. ఈ సినిమాలో (బయోపిక్ కాదు గనక) అలాంటి ఎన్నో సన్నివేశాలను జోడించడానికి అవకాశం ఉన్నా, దర్శకుడు ఆ పని చేయకపోవడం సినిమాకు ప్లస్, ప్రేక్షకులకు రిలీఫ్!
సినిమా కథ గురించి చెప్పుకోవాలంటే ఇది 1986 లో క్రికెట్ లో ఓ:స్థాయిలో సక్సెస్ అయ్యి కాస్తో కూస్తో పేరు కూడా ఉన్న ఓ రంజీ స్థాయి క్రికెటర్ (నాని), క్రికెట్ ను వదిలేయటం. చివర్లో మళ్లీ (పదేళ్ల తర్వాత) తనకు ఇష్టమైన, తాను ప్రేమించిన క్రికెట్లోకి ప్రవేశించి సక్సెస్ కావడం. ఇంత సింపుల్ గా ఉన్నా సినిమా మొత్తం నడిపించిన పద్ధతి ప్రేక్షకులకు ఒక రకమైన అనుభూతిని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు.
సినిమా క్రికెట్ కు సంబంధించినదే అయినా అది కథను డామినేట్ చెయ్యకుండా దాన్ని మూడు పాత్రలను- వాటిపై సన్నివేశాలను అల్లుకోటానికి కావాల్సిన దారంలా వాడటం వల్ల సినిమాను చూస్తున్న క్రికెట్ ప్రేమికులు కూడా ఎమోషనల్ గా ఫీల్ కావటం సినిమా స్థాయిని పెంచిందని చెప్పుకోవాలి.
ఈ సినిమా కథలో మూడు భాగాలు ఉన్నాయి. తండ్రి-కొడుకు ల మధ్య బంధం, భార్యాభర్తల సంబంధం, క్రికెట్. ఈ మూడు భాగాలు ఒకదాన్ని మరొకటి డామినేట్ చెయ్యకుండా బ్యాలెన్స్ చెయ్యటం ద్వారా దర్శకుడు సినిమాను మంచి సినిమాలా తీయటానికి చేసిన కృషి మెచ్చుకో దగ్గ స్థాయిలో ఉంది. ఇక్కడో ఇంకో సంగతి చెప్పాలి. ఏ భాగానికి ఆ భాగం బాగా తీయగలగటం వల్ల వాటి మధ్య బ్యాలెన్స్ బాగా కుదిరింది.
ఉదాహరణకు క్రికెట్ ఆటకు సంబంధించిన సన్నివేశాలు. చాలా కష్టపడి, తీసినట్లు కనిపిస్తుంది. క్రికెట్ సెలెక్షన్స్, రాజకీయాలు, ఇగోస్, అడ్మినిస్ట్రేషన్ వంటివి ఇంతవరకు ఇంత విస్తృతంగా ఏ సినిమాలో చూపించలేదు. క్రికెట్ చిత్రీకరణ ఆ ఆటను ప్రేమించే వారిని ఆకట్టుకుంటుంది. చాలా ప్రొఫెషనల్ గా, డిటెయిల్డ్ గా చూపించటం బావుంది.
అలాగే హీరో హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు, తండ్రి కొడుకులు మధ్య సన్నివేశాలు బాగా తీసాడు దర్శకుడు. దానికి తోడు చక్కగా రాసుకున్న సంభాషణలు, ఆనిరుధ్ నేపథ్య సంగీతం(క్కడక్కడా మరి ఎక్కువైనట్లు అనిపించినా) తోడ్ల్పడ్డాయి!
ఇదివరకు హాకీ క్రీడా నేపథ్యంలో పెద్ద సినిమాలు, చక్ దే ఇండియా, గోల్డ్, సుర్మా, బాక్సింగ్ నేపథ్యంలో మేరీ కోమ్, సాలా ఖద్దూస్,(తెలుగులో గురుగా వచ్చింది) అథ్లెటిక్స్ నేపథ్యంలో భాగ్ మిల్కా భాగ్. తెలుగులో అశ్విని, కుస్తీ నేపథ్యంలో దంగల్, సుల్తాన్. వచ్చాయి. వీటిల్లో “దంగల్” భారీ విజయం సాధించింది. తర్వాతి స్థానంలో “సుల్తాన్” ఉంది. క్రికెట్ నేపథ్యంలో అదీ తెలుగులో వచ్చిన సినిమాల్లో “జెర్సీ” కొంత డిఫరెంట్ సినిమా అన్నది స్పష్టం. దీన్ని ప్రేక్షకులు విజయవంతం చేసే అవకాశాలు ఉన్నాయి.