పాత మూసలో ‘మోసగాళ్ళు’ (మూవీ రివ్యూ)

తారాగణం : విష్ణు మంచు, కాజల్‌ అగర్వాల్‌, రూహీ సింగ్‌, సునీల్ శెట్టి, నవదీప్‌, నవీన్‌ చంద్ర తదితరులు
సంగీతం : శ్యామ్‌ సి.ఎస్‌, ఛాయాగ్రహణం : షెల్డన్‌ చౌ
బ్యానర్‌: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, నిర్మాత:  విష్ణు మంచు
దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్‌

 

(సికిందర్)

అన్ని నదులూ వెళ్ళి సముద్రంలో కలుస్తాయన్నట్టు అన్ని జానర్లూ వెళ్ళి తెలుగులో మూస టెంప్లెట్ లో కలిసి పోతాయి. ‘మోసగాళ్ళు’ తో ఈ ముచ్చట మరోసారి తీర్చుకున్నారు. హీరోయే కథా రచయిత, దీని అమెరికన్ దర్శకుడు ఇంకో రచయిత, మరో ఇద్దరు తెలుగు రచయితలు, ఇంకో మాటల రచయితా…ఇంత మంది కలిసి 50 కోట్ల బడ్జెట్ తో ఆశ్చర్య పర్చారు. సినిమా కథ రెండు వేల కోట్ల స్కామ్ గురించైతే, సినిమా సమస్య 50 కోట్ల బడ్జెట్ గురించి. రెండువేల కోట్ల స్కామే చేస్తున్నాం కాబట్టి 50 కోట్లు పోతే పోయాయనుకున్నారేమో. ఆ రెండు వేల కోట్లు ప్రేక్షకులకైనా పంచి పెడితే నష్టపరిహారంగా వుంటుంది. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ లు ఆ డబ్బు ఎక్కడ దాచేశారో తెలియదని ముగింపు ఇచ్చారు. ప్రేక్షకులు దాన్ని కనిపెట్టి దోచుకోవడం మీద ఇక దృష్టి పెట్టాలి.

2016 లో ముంబాయిలో మీరా రోడ్ స్కామ్ అనే కాల్ సెంటర్ మోసం జరిగింది. కాల్ సెంటర్ ఉద్యోగులు అమెరికన్లని ఐఆర్ఎస్ అధికారులమని ఫోన్లు చేసి, ఆదాయపన్ను ఎగవేత దార్లు అంటూ వాళ్ళని బెదిరించి, రెండు వేల కోట్లు బకాయిల పేర దండుకున్నారు. దీని మాస్టర్ మైండ్ షాగీ రవీందర్ పశుహా అనే పాతికేళ్ళు నిండని వాడు. రెండేళ్ళూ ఇది సాగించాక పోలీసులకి దొరికిపోయాడు. ఈ కేసే ‘మోసగాళ్ళు’ కథ కాధారం. షాగీ పాత్ర విష్ణు పోషించాడు. షాగీకో అక్క వుంది. అక్క పాత్ర కాజల్ పోషించింది.

కాల్ సెంటర్ బాస్ నవదీప్ కి ఈ అక్కా తమ్ముళ్ళు సహకరించి, కాల్ సెంటర్ ఉద్యోగులతో కలిసి ఐఆర్ఎస్ పేరుతో అమెరికన్లని మోసం చేసి సంపన్నులై, ఎలా దొరికిపోయారన్నది కథ. ఈ ట్రూ క్రైమ్ (నిజంగా జరిగిన నేరం) జానర్ కథ ఐడియాలో లోడ్ అయివున్న శక్తివంతమైన బహుముఖ ప్రయోజనాల వైపు దృష్టి సారించకుండా, తెలిసిన, అలవాటయిన ఒకే మూస చట్రంలో బంధించి బలహీన పర్చారు. ఈ మూసలో ఆశ్చర్య కరంగా దీని అమెరికన్ దర్శకుడు వచ్చి కలిసిపోవడం కొసమెరుపు.

ముంబాయిలో జరిగిన ట్రూ క్రైమ్ ని పరిశోధన చేసి రాశామన్నారు. ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో వున్నదే. డొమైన్లో వున్నది వున్నట్టు సినిమా తీస్తే పరిశోధన అవుతుందా? స్టోరీ ఐడియా అవుతుందా, ఎత్తి రాసిన వార్తా కథన మవుతుందా? డొమైన్లో వున్న విషయం కాక కొత్తగా ఏం చూపించారు, ఏం చెప్పారు?

స్కామ్ చేసి దొరికిపోయిన షాగీ డబ్బెక్కడుందో పోలీసులు కనుక్కోలేకపోయారు. స్కామ్ చేసి దొరికిపోయిన అక్కాతమ్ముళ్ళు డబ్బెక్కడ దాచారో తెలియదని సినిమాలో కూడా షాగీ కేసు ముగింపే ఇచ్చారు. ఇందులో పరిశోధన ఎక్కడుంది?

ట్రూ క్రైమ్ కేసు ఏదైనా అంతు చిక్కకుండా వుంటే, దాన్ని పరిశోధించి సమాధానమిచ్చేది ట్రూ క్రైమ్ జానర్. సంచలనం సృష్టించిన జెస్సికా లాల్ హత్య కేసుతో తీసిన  ‘నో ఒన్ కిల్డ్ జెస్సికా’ తో దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ఈ పనే చేశాడు. మరో సంచలనాత్మక ఆరుషి హత్య కేసు గురించి ‘తల్వార్’ తీసి ఈ పనే చేసింది దర్శకురాలు మేఘనా గుల్జార్. వీళ్ళిద్దరూ తేలని ఈ కేసుల్లో ఇలా జరిగుండ వచ్చని పరిశోధనాత్మక అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ రెండు సినిమాలూ చర్చనీయాంశాలయ్యాయి. హాలీవుడ్ ‘బ్లాక్ ఢాలియా’, ‘జోడియాక్’ వంటి ట్రూ క్రైమ్స్ కూడా ఇలాటివే. ‘మోసగాళ్ళు’ తో ఇలా నోటెడ్ అయ్యే అవకాశాన్నికోల్పోయారు మూస టెంప్లెట్ తో. దీని ఐడియాలో దాగున్న విస్తృత మార్కెట్ యాస్పెక్ట్ లాభాలని పట్టించుకోలేదు.

సమస్య తీవ్రత బేఖాతరు

కాల్ సెంటర్ స్కామ్ లేవనెత్తుతున్న ప్రశ్నలు తీవ్రమైనవి. దేశ ప్రతిష్టకి సంబంధించి కూడా. షాగీ కోటి 20 లక్షల మందిని అమెరికన్లని బెదిరించాడు, 6,400 మంది నుంచి రెండువేల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నాడు. ముంబాయిలోనే గాక ఇంకో నాల్గు నగరాల్లో కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి, 700 మంది ఉద్యోగులతో కాల్స్ చేయించాడు. ఉద్యోగులు ఐఆర్ఎస్ తరపునే తమ సంస్థ పని చేస్తోందన్న నమ్మకంతో వుండిపోయారు. విలాసవంతమైన జీవితం గడిపాడు. గర్ల్ ఫ్రెండ్ బర్త్ డేకి రెండున్నర కోట్ల రూపాయల బహుమతి ఇచ్చాడు.

స్కామ్ ఆలస్యంగా అమెరికాలో ఐఆర్ఎస్ కి, ఎఫ్బీఐ కీ లీకై ముంబాయి పోలీసుల్ని ఎలర్ట్ చేశారు. ముంబాయి పోలీసులు పట్టుకోబోతే దుబాయి పారిపోయాడు షాగీ. దుబాయి నుంచి పట్టుకొచ్చి లోపలేస్తే, బెయిల్ మీద విడుదలై దర్జాగా తిరుగుతున్నాడు షాగీ. రూపాయి కూడా షాగీ నుంచి వసూలు చేయలేకపోయారు. స్కామ్ తో సంబంధమున్న అతడి అక్కని అరెస్ట్ చేశారు. 700 ఉద్యోగుల్నీ అదుపులోకి తీసుకుని చాలా మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళల్లో ఉద్యోగినులు కూడా వున్నారు.

స్కామ్ వల్ల అమెరికన్లే కాదు, ఇండియాలో 700 మంది ఉద్యోగులూ మోసపోయారు. చేస్తున్నది స్కామ్ అని తెలియకుండానే కేసుల్లో ఇరుక్కున్నారు. ఈ బాధితుల పరిస్థితి ఏమిటి? వీళ్ళ కథ లేమిటి? ఇలా మోసపోయే వాళ్ళు ఏం నేర్చుకోవాలిందులోంచి? ఇది చూసి ప్రేక్షకులు ఏం నీతి గ్రహించాలి? స్కామ్ చేసిన వాడు దర్జాగా తిరుగుతున్నాడు. ‘మోసగాళ్ళు’ ని తమిళ మలయాళ హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తామని చెప్పారు. కానీ మార్కెట్ యాస్పెక్ట్ ఏది? జాతీయ సమస్య అయిన దీనిగురించి జాతీయ స్థాయికి తీసికెళ్ళే అవకాశాన్నికూడా కోల్పోయారుగా- తెలుగుకే పరిమితమైన మూస కథతో?

మారిపోతే అయిపోయిందా?

ఇక వేల మంది అమెరికన్ బాధితుల పరిస్థితి… మీ ఇంటికి మా అఫీషియల్స్ వస్తారు, వీధిలో మీ పరువు తీస్తారు, మూడు నెలలు జైల్లో వేస్తారు, మీ కార్డులన్నీ రద్దు చేస్తారని బెదిరిస్తూంటే, ఏడ్చి అలా చేయవద్దని హీనంగా బతిలాడుకున్నారు అమెరికన్లు. ఈ బాధితుల పరిస్థితేమిటి? కథ లేమిటి? ఇలా ఫూల్స్ అవకుండా ఏం నేర్చుకోవాలిందులోంచి?  ఇలాటి సైబర్ క్రైమ్స్ కి బకరాలవుతున్న వాళ్ళని చూసి ప్రేక్షకులేం నేర్చుకోవాలి?  ‘మోసగాళ్ళు’ ని ఇంగ్లీషులో అమెరికాలో కూడా విడుదల చేస్తామన్నారు. ఇందులో దానికి తగ్గ మార్కెట్ యాస్పెక్ట్ ఏది? మా వోడు మీ వాళ్ళని ఫూల్స్ చేసి దోచుకుంటే మీరేం చేయలేక పోయారనీ, వాణ్ణి  అమెరికాకి లాక్కొచ్చి జైల్లో వెయ్యలేక పోయారనీ, అమెరికాకి చెబుతున్న అర్ధంలో సినిమా వుంటే, ఏమంత బావుండదేమో? అక్కడి ఇండియన్ల గురించి కూడా ఆలోచించాలేమో?

ఈ కథలో హీరో చేసిందంతా చేసి, పోలీసులు పట్టుకోబోతూంటే పరివర్తన వచ్చేస్తుంది. చాలా తప్పు చేశానని బాధపడిపోతాడు. పోలీసులకి దొరక్కుండా దుబాయి పారిపోతానంటాడు. అక్క వద్దంటుంది. పోలీసులకి లొంగిపోయి హేపీగా బేడీలు చూపిస్తాడు. పది నెలలే జైలు శిక్ష పడి విడుదలై వచ్చేస్తాడు. దాచుకున్న డబ్బుతో అక్కాతమ్ముళ్ళు ఫుల్ హేపీ. ఇదీ తప్పు చేశానని బాధపడ్డ హీరో మంచితనం.

అదే పాత కథ

అక్కాతమ్ముళ్ళ జీవితాల్ని చిన్నప్పట్నుంచీ చూపించే కాలం చెల్లిన టెంప్లెట్ తో ఎత్తుకున్నారు. పేదరికంతో ఆ కష్టాలూ పేరెంట్స్ కన్నీళ్లూ చూపించుకొచ్చారు. పెద్దవాడై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవుతాడు హీరో. ఒక స్ట్రీట్ బాక్సింగ్ లో పాల్గొనే టెంప్లెట్ ఎంట్రీతో జాబ్ చేస్తూంటాడు. అక్క ఎకౌంటెంట్ గా వేరే చోట వుంటుంది. ఆమెని డబ్బుకోసం వేధించే భర్త వుంటాడు. ఇతణ్ణి వదిలించుకోవడానికి డబ్బు కావాలి. ప్లస్ పేరెంట్స్ కి రిచ్ లైఫ్ ఇవ్వాలి. అందుకని స్కామ్ కి ఒప్పుకుని, అమెరికన్లని స్కామ్ చేస్తారు. దొరికిపోతారు. దొరికిపోయాక హీరో మాత్రమే జైలు కెళ్తాడు. సీను తిప్పితే, పది నెలల్లో శిక్ష ముగించుకుని విడుదలైపోయి – హేపీ ఎండింగ్ ఇస్తాడు- దాచుకున్న డబ్బుని అక్కతో కలిసి ఎంజాయ్ చేయడాయినికి!

హీరో నేరం చేయాడానికి పేదరికం, ఇతర కష్టాలూ అనే టెంప్లెట్ జస్టిఫికేషన్. కానీ స్కామ్ చేసిన షాగీ అనేవాడు చిన్నప్పట్నుంచే మోసగాడు. మోసాలు చేయడమే వృత్తి. జస్టిఫికేషన్ లేదు. జస్టిఫికేషన్ ని చట్టం కూడా ఒప్పుకోదు. హీరో నేరాలు చేశాడు, కానీ మంచి కోసమే చేశాడన్న బుజ్జగింపులకి లొంగుతారా ఇంకా  ప్రేక్షకులు. దేశంలో, బయటా అంత మందిని బాధించిన వాణ్ణి తీసి కెళ్ళి అమెరికా జైల్లో వేసి, ఇండియా పరువు కాపాడాలన్న స్పృహ లేకపోతే ఎలా?

 హీరో క్రిమినల్ పాత్ర వేస్తే క్రిమినలే. క్రిమినల్ గా మారితే ఏమేం జరుగుతాయో శిక్ష సహా చూపిస్తే ఎక్కువ నమ్మి ఆలోచనలో పడతారు ప్రేక్షకులు. అలాటి పన్లు తాము చేయకుండా జాగ్రత్త పడతారు. అదే శిక్ష పొందిన క్రిమినల్ గా విలన్ పాత్రని చూపిస్తే ఏ ప్రభావమూ వుండదు. ఇలా ఈ వాస్తవ కథతో మంచు విష్ణు వాస్తవం కాని డ్రీమ్ వరల్డ్ లో బుజ్జగిస్తూ వుండిపోయాడు.

ఇక సినిమాలో ఏ సీన్లు ఎందుకొస్తున్నాయో, ఏమిటో అంతుబట్టకుండా, చప్పగా సాగుతుంది. కనీస స్థాయి థ్రిల్లర్ లక్షణాలు కూడా లేకుండా. డైలాగులు మాస్ సినిమా డైలాగులుగా వుంటాయి. అమెరికన్ దర్శకుడు విషయం లేని దీనికి కెమెరాతో చీకాకు పెట్టే టెక్నికల్ హంగామా చేస్తూ వుండి పోయాడు. మూస టెంప్లెట్ సినిమాలు బాక్సాఫీసు సినిమాలు కావు, అవిప్పుడు బి గ్రేడ్ సినిమాలవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *