“ఢిల్లీ నుంచి విశాఖ దాకా…రూపుదిద్దుకుంటున్న కొత్త పోరాటాల ప్రపంచం”

విప్లవ రచయితల సంఘం (విరసం) యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నది. మరో యాభైల్లోకి ప్రవేశిస్తోంది. కాలపరంగా ఇందులో ఏ ప్రత్యేకతా లేదు. గత యాభై ఏళ్లుగాని, రాబోయే కాలంగాని ప్రజా పోరాటాల చరిత్రలో భాగం. అనేక సంఘర్షణలను అధిగమించిన ఈ ప్రయాణం వర్తమాన కల్లోలాల మధ్యలోంచే భవిష్యత్తులోకి సాగుతుంది. చరిత్ర నిర్మాణం ఇలాగే ఉంటుంది. వర్తమానం తన గతాన్ని పునర్నిర్మించుకున్నట్లే భవిష్యత్తునూ రూపొందించుకుంటుంది. అది కేవలం కల కాదు. ఊహ కాదు. ఒక తార్కిక క్రమం. భౌతిక వాస్తవం. దాన్ని వర్తమానమే మన కళ్ల ముందుకు రేఖా మాత్రంగానైనా తెస్తుంది.

బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం సృష్టిస్తున్న విధ్వంసంలోంచే రేపటి ప్రపంచం నిర్మాణమవుతున్నది. కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా నూతన పోరాట శక్తులు విడుదల అవుతున్నాయి. ఫాసిజం ప్రజలను చీల్చి తన వైపు నిలబెట్టుకోవాలనుకుంది. కానీ ప్రజలు పోరాట క్షేత్రంలో సంఘటితమవుతున్నారు. తాము గెలుచుకోవాల్సిన ప్రపంచం కోసం ఉద్యమాలు చేస్తున్నారు. అనేక పీడిత అస్తిత్వ సమూహాలు సాంఘిక విముక్తి ఆకాంక్షలను వినిపిస్తున్నాయి. మొన్న విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు మహత్తర పోరాటం చేశారు. నిన్న సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు, లౌకిక, ప్రజాస్వామికవాదులు ఉద్యమించారు. ఇవాళ వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు అలుపెరగక పోరాడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్లకు అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని కార్మికులు సవాల్ విసురుతున్నారు.

సంక్షోభాలు-పోరాటాలు: దోపిడీని చట్టబద్ధం చేసిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే దేశంలోని అన్ని సంక్షోభాలకు కారణం. అది అనేక దశలను దాటి మరింత వికృతంగా తయారైంది. అనేక కొత్త దోపిడీ రూపాలను తీసుకొచ్చింది. సమాజపు అంచుల్లో ఉన్న ప్రజలకు రాజ్యాంగం కొంచెమైనా ఆలంబన కావాలి. కానీ రాజ్యాంగబద్దంగానే మన దేశంలో ప్రజాస్వామ్యం నియంతృత్వమైపోయింది. ప్రభుత్వ యంత్రాంగం దోపిడీ వర్గాల, దోపిడీ కులాల స్థావరమైపోయింది. కుల వ్యవస్థకు రక్షణ కచంలాంటి బ్రాహ్మణిజం అధికార భావజాలంగా చలామణి అవుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ, పాలనా విధానమే కాదు. అది భావజాల కేంద్రం. నిరంతరం బ్రాహ్మణవాదాన్ని ఉత్పత్తి చేస్తోంది. పార్లమెంటరీ మార్గమే పరమావధిగా భావించే భిన్న సామాజిక శ్రేణులు ప్రయాణించేకొద్దీ రాజ్యం సాధికారత సంపాదించుకుంటోంది. బలోపేతమవుతోంది. సమాజం మీద రాజ్యం నిరంకుశత్వం పెరిగిపోయింది.


అంశం: ఫాసిస్టు కల్లోలంలో రూపొందుతున్న కొత్త పోరాటాల ప్రపంచం

10, 11 ఏప్రిల్ 2021, విజయవాడ

వేదిక: కందుకూరి కల్యాణమండటం, జింఖానా గ్రౌండ్స్, గాంధీనగర్


దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు దేశమంతా పోరాట పరిమళం వీస్తున్నది. ప్రజల బలం ఎంత గొప్పదో రుజువవుతున్నది. అద్భుతమైన పోరాట అనుభవాలను అందిస్తున్నది. ఫాసిస్టు సందర్భంలోని భయాన్ని, నిరాశను పోగొట్టి గొప్ప ఆశను అందిస్తున్నది. ఇది ఉద్యమాల కాలమనే చారిత్రక దృష్టిని అందిస్తున్నది. ప్రజా ఆచరణే చరిత్రను మార్చివేయగలదనే భరోసాను ఇస్తున్నది. ఇవాళ మన ముందు ఒక సమరశీల పోరాట ప్రపంచం నిర్మాణమవుతున్నది. దాన్ని దెబ్బతీయడానికి ఎన్నో అణచివేతలు, కుట్రలు. సరిగ్గా విద్యార్థుల ఉద్యమంపై ఎలాంటి మారణకాండ అమలైందో, షహీన్ బాగ్ పోరాటాన్నెలా దెబ్బతీయాలని చూశారో, అలాగే రైతాంగ ఉద్యమంపైనా అణచివేత కొనసాగుతున్నది. అయినా ఒక వెల్లువలోంచి మరో వెల్లువ ముందుకు వస్తోంది. ఒకదాని కంటే మరొకటి మరింత పదును తేరుతోంది.

ఈ పోరాట సన్నివేశం మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకంగా అనేక అసంఘటిత తిరుగుబాట్లు చెలరేగుతున్నాయి. వీటన్నిటిలో ఏదో ఒక పీడిత అస్తిత్వ ఆకాంక్ష ఉన్నది. అంతే కాదు. ఇవన్నీ ప్రపంచ పెట్టుబడిదారీ విధానపు సంక్షోభ వ్యక్తీకరణలు. ఫాసిజం పెరిగే కొద్దీ సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో వర్గ వైరుధ్యాలు తీవ్రమవుతున్నాయి.
ఫాసిజం-పార్లమెంటరీ ప్రజాస్వామ్యం: మన దేశంలో ఫాసిజాన్ని, బ్రాహ్మణీయ హిందుత్వాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వేరు చేసి చూడలేం. అధికార మార్పిడి తర్వాతి రాజకీయార్థిక విధానాల పర్యవసానంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తన మేలిముసుగులన్నీ స్వయంగా తొలగించుకున్నది. అసలు ఆధునికత, ప్రజాప్రాతినిధ్యం, వ్యక్తి స్వేచ్ఛ అనే భావనలే మన చరిత్రలోకి వక్రమార్గంలో ప్రవేశించాయి. దీంతో ప్రజాస్వామ్యం ఆచరణలో బూర్జువా నియంతృత్వంగా మారిపోయింది. ఈ క్రమమే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి రహదారిగా మారింది.

వలసానంతరం ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంగా మొదలైన మన ఆర్థిక వ్యవస్థ సాంతం ప్రైవేట్ శక్తుల పరం కావడం యాదృశ్చికం కాదు. అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్లకిచ్చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటించేసింది. ఆ దిశగా వేగంగా ముందుకు పోతోంది. దీనికి సుదీర్ఘ గతం ఉన్నది. ఆ రోజుల్లో నెహ్రూ మార్క్ సోషలిజమని, ప్రజాస్వామ్యమని అనుకునేవారు. దాన్ని ఇప్పుడు నెహ్రూ మార్క్ నియంతృత్వంగా మానవతావాదులు, ప్రజాస్వామికవాదులు కూడా గుర్తించదగిన పరిణామాలు జరుగుతున్నాయి. అవన్నీ కలిసి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంగా, బూర్జువా నియంతృత్వంగా మారిపోయాయి. సంక్షేమ రాజ్యం అనే భావన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎలా మారిపోయిందో గమనిస్తే దీనికి సరిపోతుంది. పాలకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో గరిష్టంగా కార్పొరేట్లకు అధికారికంగానే పంచి పెడుతున్నారు. కరోనా కాలంనాటి ఆత్మనిర్బర్ ఒక్క ఉదాహరణ చాలు. ఈ దోపిడీని సరళం చేయడానికి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలన్నిటినీ సవరిస్తున్నారు. రద్దుచేస్తున్నారు. అట్టడుగు నుంచి పోరాట ప్రజ్వలన సాగకుండా యుఎపిఏ లాంటి చట్టాలతో అడ్డుకోవాలనుకుంటున్నారు. అయినా ఎప్పటికంటే ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలు రంగం మీదికి వచ్చాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్నట్లే బ్యాంకింగ్ తదితర ప్రభుత్వ విభాగాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక, ప్రజా పోరాటాలు జరుగుతున్నాయి. ఒక పెద్ద సంక్షోభాన్ని పరిష్కరించగల శక్తిగా ఇవి ఎదగవలసి ఉన్నది.

ఈ ప్రజా సంచలనాలను అర్థం చేసుకోడానికి, సమన్వయం చేయడానికి తగినట్లు శక్తివంతంగా భావజాల, సిద్ధాంతరంగాలను తీర్చిదిద్దుకోవడమే ప్రగతిశీల, విప్లవ శక్తుల కర్తవ్యం. గతంలో ఎప్పుడూ లేనంత విశాల, సంక్లిష్ట పోరాట క్షేత్రంలో పని చేయవలసి ఉన్నదనే ఎరుక భారత విప్లవోద్యమానికి ఉన్నది. అంతే కాదు. గత శతాబ్దంలోని నాజీయిజం, ఫాసిజం కంటే పూర్తి భిన్నమైన స్థల కాల నేపథ్యంలో మన దేశ ప్రజలు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఎదుర్కొంటున్నారనే అవగాహన ఉన్నది. ఆ రకంగా కూడా ఇరవయ్యో శతాబ్దపు విప్లవాలకంటే భిన్నమైన చారిత్రక యుగంలో ఉన్నామనే అంచనా ఉన్నది. ఇవాల్టి ఫాసిస్టు వ్యతిరేక సిద్ధాంత అవగాహన రేపటి విప్లవ విజయంలో అత్యంత కీలకం కాబోతోంది. ఆ రకంగా కూడా రూపొందుతున్న కొత్త పోరాట ప్రపంచం భవిష్యత్తులోకి విస్తరిస్తోంది.

భావజాల రంగంలో విస్తరణ: కొత్త పోరాటాల ప్రపంచాన్ని సాకారం చేయడానికి ఫాసిస్టులను ఏకాకులను చేసే సరికొత్త సమీకరణలు అత్యవసరం. దీని కోసం చాలా ప్రయత్నం చేయాలి. మన భావజాల, సిద్ధాంత రంగాలను విశాలం చేయాలి. ఫాసిజాన్ని ఓడించడానికి సిద్ధమవుతున్న ఈ వర్తమానాన్ని శక్తివంతం చేయాలంటే మన దేశ ప్రజల పోరాట స్రవంతులన్నిటినీ సరికొత్తగా చూడాలి. సామాజిక ఆధిపత్యాలకు, దోపిడీ రూపాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లోంచి ఇవ్వాల్టికి కావాల్సిన ప్రగతిశీల శక్తిని పునర్మూల్యాంకనం చేయాలి. ఆనాటి ఆదర్శాలను ఇప్పటి ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమ అవసరాలతో అనుసంధానం చేయాలి. ఆ పోరాటాల్లోని స్పూర్తిని, త్యాగాన్ని ఒడిసిపట్టుకోవాలి.

సారాంశంలో ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక పోరాటానికి తగినంత శక్తివంతంగా మన ప్రజల పోరాట చరిత్రలోని గతాన్ని పునర్నిర్మించాలి. ఇదే రూపొందుతున్న వర్తమాన ప్రపంచాన్ని ఆకళింపు చేసుకోడానికి బలమైన భూమిక అవుతుంది. ప్రజల చరిత్ర అంతా పోరాట చరిత్రే అనే ఎరుక గొప్ప శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా వలస వ్యతిరేక యుగంలో సామ్రాజ్యవాదానికి, భూస్వామ్యానికి, కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, ఇంకా అనేక ఆధిపత్య వ్యవస్థలకు వ్యతిరేకంగా జరిగిన పోరాట మార్గాలన్నిటినీ సొంతం చేసుకోవాలి. గత, వర్తమాన పోరాటాల్లో నాయకత్వ వైఫల్యాలు, వంచనలు ఉంటే ఆ మేరకు వాటిని వేరు చేసి ప్రజల పోరాటశీలతను ఎత్తిపట్టాలి. అందులోని ఆకాంక్షలను సగౌరవంగా గుర్తించాలి.

కేవలం మన దేశ ప్రజల పోరాట చరిత్రనే కాదు. ప్రపంచవ్యాప్తంగా దోపిడీకి, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, సమానత్వం కోసం చేసిన పోరాటాలను మరింత లోతుగా అధ్యయనం చేయవలసిన తరుణం ఇది. మన దగ్గర బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం పెచ్చరిల్లడానికి ప్రపంచ పెట్టుబడిదారీ విధానం పని తీరులోని మార్పులు కూడా కారణం. వాటిని సునిశితంగా చూడాలి.

కాబట్టి విప్లవ సాంస్కృతిక శక్తులు ఫాసిజానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులతో కలిసి పని చేస్తూనే ఖచ్చితమమైన వర్గ రాజకీయాలను అంటిపెట్టుకొని ఉండాలి. కేవలం ధిక్కారం ఒక్కటే సరిపోదు. అస్తిత్వ, ఉదారవాదుల కంటే భిన్నంగా వర్గ దృక్పథంతో చూడాలి. ఆ రకంగా కూడా ఆధునిక భారతదేశ చరిత్రలో, విప్లవోద్యమ చరిత్రలో ఇది కొత్త సన్నివేశం. ఇందులో సంక్షోభాలు మాత్రమే లేవు. పరిష్కారాలూ ఉన్నాయి. ఇందులో విధ్వంసమే లేదు. నిర్మాణమూ ఉన్నది. ఈ వర్తమానంలో సవాళ్లు మాత్రమే లేవు. కొత్త అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆలోచనలు ఉన్నాయి.

ఇదే సమయంలో భారత విప్లవోద్యమం మంద్రస్థాయి యుద్ధతంత్రాన్ని ఎదుర్కొని పురోగమిస్తోంది. కేవలం సైనిక రంగంలోనే కాదు. రాజకీయార్థిక, సాంస్కృతిక భావజాల దాడులను తిప్పికొడుతోంది. బహుశా ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలోనే దీర్ఘకాలంగా తనను తాను రుజువు చేసుకుంటున్న పోరాటం అది. సుమారు ఇరవై లక్షల సైనిక బలగాలను నిలువరిస్తున్న ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యాధికార శక్తి అది. వైమానిక దాడులను సాహసోపేతంగా ఎదుర్కొంటూ రేపటిలోకి విస్తరిస్తోంది. దండకారణ్యం దగ్గరి నుంచి పశ్చిమ కనుమల దాకా బీజరూప ప్రత్యామ్నాయ ప్రజారాజ్యాధికారం కొనసాగుతున్నది. అభివృద్ధికరమైన ఆర్థిక వ్యవస్థకు సన్నాహాలు జరుగుతున్నాయి. నూతన మానవ సంబంధాల సాంస్కృతిక భావజాల ఆవరణ నిలదొక్కుకుంటున్నది. నూరేళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఇదొక గుణాత్మక సందర్భం. .

ఈ పోరాటాలన్నీ రాజకీయ ఉత్తేజాన్నే కాదు. జీవన సంస్కృతినీ సారవంతం చేస్తున్నాయి. రూపొందుతున్న భవిష్యత్ కు అవసరమైన భావజాలాన్ని సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణీయ హిందుత్వ సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఎదుర్కోగల ఆలోచనా ప్రపంచాన్ని బలోపేతం చేస్తున్నాయి. బలమైన మేధో రంగంతోనే ఫాసిజాన్ని ఓడించగలం. విప్లవాన్ని విజయవంతం చేయగలం.

ఫాసిజం పైకి కనిపించే దుర్మార్గ వ్యక్తీకరణలకే పరిమితం కాదు. అనేక సూక్ష్మ రూపాల్లో పని చేస్తున్నది. రాజకీయ రంగంలోని బలాబలాలు మారిపోయినా హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం ఈ రూపాల్లో బతికే ఉంటుంది. దీనికి మూలాలు మన సామాజిక సంబంధాల్లో ఉన్నాయి. అందులోని అసమానతల్లో ఉన్నాయి. బ్రాహ్మణి జం, పితృస్వామ్యం వాటిని పట్టి ఉంచుతున్నాయి. ఇవి ఉనికిలో ఉండటానికి ఆర్థిక పునాదితో పాటు వ్యవస్థీకృతమైన ఆధిపత్య సంబంధాల ఆచరణ కారణం. అక్కడ అది నిరంతరం పునరుత్పత్తి అవుతున్నది. సంస్కృతిగా మారి తనదైన పని విధానాన్ని సంతరించుకుంటున్నది.

వలస పాలకులు ఆర్థిక దోపిడీతోపాటు మన దేశీ భావనలను, సంస్కృతిని, ఆలోచనారీతులను కూడా కొల్లగొట్టినట్లే అఖండత పేరుతో సంఘ్ పరివార్ అదే పని చేస్తున్నది. ప్రగతిశీల, విప్లవ భావజాలాన్ని ఫాసిజం బలహీన పరచాలనుకుంటోంది. హేతుచింతనను ధ్వంసం చేయాలనుకుంటున్నది. తరతరాల దేశీ చైతన్యాలను కలుషితం చేస్తున్నది. ఈ మొత్తానికి ఆమోదం సంపాదించుకుంటున్నది.

ఇలాంటి సంక్షోభకాలంలో ప్రజానుకూల వైఖరులను సరికొత్త భాషతో భావజాలంగా తీర్చిదిద్దవలసి ఉంది. ప్రజా పోరాటాల్లోంచి, విప్లవోద్యమాల్లోంచి ఈ పని చేయాలి. తిరిగి వాటికి రక్షణ వలయంగా మార్చాలి. ప్రజాభిప్రాయ తలాన్ని దురాక్రమించడంతోనే ఫాసిజం ఆరంభమవుతుంది. ఇప్పుడు ప్రగతిశీల శక్తులు తిరిగి దాన్ని సొంతం చేసుకోవలసి ఉన్నది. ప్రజల మనో ప్రపంచాన్ని పునర్నిర్మించవలసి ఉన్నది. ఇది చాల కష్టమైన పనే. అయితే ఈ సంక్షోభ కాలపు ప్రజా పోరాటాలే దీనికి దారి చూపుతున్నాయి.

రూపొందుతున్న ప్రపంచంలో సాహిత్య కళా సృజన: నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల్లోంచి పుట్టిన విరసం యాభై ఏళ్లపాటు భావజాల నిర్మాణంలో పని చేసింది. విప్లవ రాజకీయ పోరాటాల్లోంచి పుట్టిన భావజాలాన్ని కాపాడింది. విస్తరింపజేసింది. తానుగా సాహిత్య రచన ద్వారా భావజాలాన్ని ఉత్పత్తి చేసింది. ఈ ఫాసిస్టు సందర్భంలో ఈ పని మరింత పదునుగా చేయాలి. అనేక కొత్త స్థావరాల నుంచి భావజాలాన్ని నిర్మించాలి. ప్రజానుకూల మేధో రంగం బలపడటానికి అన్ని వైపుల నుంచి ప్రయత్నించాలి.

గత ఐదు దశాబ్దాలుగా రూపొందుతున్న జీవితాన్నే విప్లవ సాహిత్యం చిత్రించింది. విశ్లేషించింది. అదే తెలుగు సాంస్కృతిక భావజాల రంగంలో విరసం ప్రత్యేకత. దాంతో పాటు ఈ సంక్షుభిత వర్తమానంలోంచే భవిష్యత్ ను కూడా కాల్పనీకరించ వలని ఉన్నది. ఫాసిస్టు వ్యతిరేక అవగాహన తక్షణ అవసరంగానే మిగిలిపోకూడదు. ఇది నాగరికతా క్రమానికి సంబంధించింది. రూపొందుతున్న భవిష్యత్ కు అత్యవసరమైనది. దీనికి తగిన భావజాలాన్ని ప్రేరేపించేలా సాహిత్య సృజన జరగాలి. వస్తు శిల్పాలు, దృక్పథ, నేపథ్యాల మొత్తాన్ని కలిపి చూసే సంవిధానమే దీనికి దారి చూపుతుంది.
సాహిత్యం కాల్పనిక తలానికి చెందినది కాబట్టి వర్తమానం గురించేగాక భవిష్యత్తు గురించిన ఊహాశక్తి దానికి ఉంటుంది. నిశ్చల స్థితి గురించి కాక రూపొందుతున్న తీరును గ్రహిస్తుంది. అందులోని సకల వైరుధ్యాలను గుర్తిస్తూనే ఆవలి తీరాన్ని దర్శిస్తుంది. భౌతిక వాస్తవమైన చరిత్ర నిర్మాణ క్రమాన్ని చూడగల సూక్ష్మదర్శిని, దూరదర్శినీ సాహిత్యం . అందుకే వర్తమానంలో నిలబడి రేపటి రోజును కాల్పనీకరించవచ్చు. సాహిత్య ప్రక్రియా ప్రత్యేకతల రీత్యా కూడా భావజాల సంఘర్షణ నెరపవచ్చు. సకల విధ్వంసాల్లో సహితం దాగి ఉండే పురోగామి చలనాన్ని సృజనకారులే చూడగలరు. ఇది కేవలం ఆశావాదమే కాదు. చారిత్రక దృక్పథం ఉన్నవాళ్లు ఎన్నటికీ గతంలోకి కూరుకపోరు. వర్తమానానికి పరిమితం కారు. ఈ రెండింటి సజీవ సంభాషణలోంచి భవిష్యత్తులోకి రెక్కలల్లార్చుతారు.

ఈ వర్తమాన కల్లోలమే భవిష్యత్ రూపకల్పనకు ఎలా దారి చూపగలదో కాల్పనిక రచయితలు గుర్తించగలరు. నలభై యాభై ఏళ్ల కింద అప్పటి ప్రజా పోరాటాల ప్రేరణతో విప్లవ రచయితలు వివిధ ప్రక్రియల్లో భవిష్యత్ ఊహాగానం చేశారు. అలాగే ఇప్పుడు మరో యాభైల్లోకి ప్రయాణిస్తున్న తరుణంలో ఈ వర్తమానంతో సహా భవిష్యత్ ప్రతిఫలనాలను సాహిత్యంలో చిత్రించాలి. దీనికి ప్రగతిశీల రచయితలు, కళాకారులు, మేధావులు సిద్ధం కావాలి.

చారిత్రక ఆశావాదం దీనికి దారి దీపమని విరసం భావిస్తోంది. అంతా అయిపోయిందని అంగలార్చేవాళ్లు మన చుట్టూ ఉండొచ్చు. ఇక్కడ భయం ఒక్కటే లేదు. సాహసం కూడా ఉంది. విలువల నిర్మూలనే లేదు. విలువల ఆవిష్కారం కూడా ఉంది. ఇది సంకుల సమరమే. ఈ చారిత్రక సిద్ధాంత అవగాహనతో విరసం మరో యాభైల్లోకి ప్రయాణిస్తోంది. దానికి తగినట్లు తన తాత్విక అవగాహనను బలోపేతం చేసుకుంది. నిజానికి గత యాభైల్లోని మూడు నాలుగు దశల్లో ఇలాంటి లోతైన కృషి జరిగింది. ఫాసిస్టు సంక్షోభం మధ్యనే రూపొందుతున్న మానవాళి భవితవ్యాన్ని రచించేందుకు మార్క్సిజం – లెనినిజం- మావోయిజమే తాత్విక ప్రేరణ. విప్లవమంటేనే కళ, భావజాలం, సంస్కృతి. ఇవి మానవుల గతంతోనే కాదు, భవిష్యత్తుతో ముడిపడినవి. కాబట్టి మానవాళి సుందర భవితవ్యానికి తగినట్లే విరసం ఉంటుంది. దాన్ని నిర్మించడంలో క్రియాశీల ఏజెన్సీగా ఉండటమే విరసం కర్తవ్యం. దాన్ని నిర్దేశించుకోడానికే ఈ సాహిత్య పాఠశాల. అందరికీ ఇదే ఆహ్వానం.
కార్యక్రమం:

ప్రొ. శేషయ్య వేదిక, కా. యాన్ మిర్డాల్ హాల్, కా. పెద్దిక్రిష్ణ ప్రాంగణం

10.4.2021, శనివారం ఉదయం 10.30కు: పతాకావిష్కరణ

11 గంటలకు: తొలి సమావేశం

అధ్యక్షత: అరసవెల్లి క్రిష్ణ

ప్రారంభోపన్యాసం: బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం -విప్లవ సాహిత్య సాంస్కృతిక ప్రతివ్యూహం

వక్త: మురళీధరన్ (అజిత్), ‘క్రిటికింగ్ బ్రాహ్మణిజం’ పుస్తక రచయిత, కేరళ

12.00 గంటలకు: కీనోట్ పేపర్: మరో యాభైల్లోకి విరసం -రూపొందుతున్న పోరాటాల ప్రపంచం

వక్త: పాణి

1.30-2.30: భోజన విరామం

2.30 గంటలకు: అంశం: రేపటి విప్లవ కథ, నవల

వక్త: అల్లం రాజయ్య,

అధ్యక్షత: శివరాత్రి సుధాకర్

3.30 గంటలకు: అంశం: నూరేళ్ల కమ్యూనిస్టు సాహిత్యం -లౌకిక ప్రజాస్వామిక విలువలు

అధ్యక్షత: నల్లూరి రుక్మిణి

వక్తలు: పెనుగొండ లక్ష్మీనారాయణ (అరసం),

దివికుమార్ (జనసాహితి),

సత్యరంజన్ (సాహితీ స్రవంతి),

బుడ్డిగ జమిందార్ (ప్రొగ్రెసివ్ ఫోరం),

రమాసుందరి (మాతృక పత్రిక),

కాత్యాయనీ విద్మహే (ప్రరవే)

సా. 5.30 గంటలకు: కవి గాయక సభ,

రైతాంగ పోరాట సంఘీభావ వేదిక

నిర్వహణ: మేడక యుగంధర్, ఉజ్వల్

కవులు: అనిల్ డ్యానీ, మందరపు హైమవతి, బండ్ల మాధవరావు, కోసూరి రవికుమార్, శిఖా ఆకాష్, శ్రీరాం పుప్పాల, వైష్ణవిశ్రీ, అమూల్య, చిత్తలూరి సత్యనారాయణ, చలపాక ప్రకాష్, వరప్రసాద్, పాయల మురళీకృష్ణ, మోతుకూరి శ్రీనివాస్, సాంబశివరావు, నాగేశ్వర్, ఉదయమిత్ర, శాకమూరి రవి, వంగల సంతోష్, బాలసాని రాజయ్య, రాంకి తదితరులు.

7.30 గంటలకు: సాంస్కృతిక కార్యక్రమాలు

11.4.2021, ఆదివారం ఉదయం 10 గంటలకు

అంశం: ఫాసిజం- బాధిత అస్తిత్వాల ధిక్కారం

నిర్వహణ: సిఎస్ఆర్ ప్రసాద్

వక్తలు: స్కైబాబా, మంచికంటి, శ్రీనివాసగౌడ్, ఖాదర్ మొహియుద్దీన్, వేంపల్లి షరీఫ్, గుంటూరు లక్ష్మీనరసయ్య, నూకతోటి రవికుమార్, షేక కరిముల్లా, వెంకటకృష్ణ, డాని, డేవిడ్ తదితరులు

12.30 గంటలకు: అంశం: మరో యాభైల్లో విప్లవ పాట, కవిత్వం

వక్త: రివేరా

అధ్యక్షత: వడ్డెబోయిన శ్రీనివాస్

1.30 -2.30: భోజన విరామం

2.30–4.00: సాంస్కృతిక కార్యక్రమాలు

4.00 గంటలకు: అంశం: నిర్బంధంలో రచయితలు, కార్యకర్తలు – ప్రజాస్వామిక ఆందోళన

వక్తలు: సహజ, రాందేవ్, కళ్యాణరావు

అధ్యక్షత: అరసవెల్లి క్రిష్ణ

*ఈ రెండు రోజులు ప్రజాకళామండలి, విరసం, అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

పుస్తకావిష్కరణలు:
బ్రాహ్మణవాదం-మార్క్సిస్టు విమర్శ (అజిత్ క్రిటికింగ్ బ్రాహ్మణిజం అనువాదం), అల్లం రాజయ్య ముందు మాటలు, యాభై ఏళ్ల విరసం- సంభాషణసంవాదం, వరవరరావు లౌకికవాదం వ్యాసాలు, కెనరీ దీర్ఘ కవిత, ఉజ్వల్ కవిత్వం, సైరన్ (అల్లం రాజయ్య నవల), రివేరా కవిత్వం, నా పేరు శూర్పణఖ (పావని కథలు), కుసుమ ధర్మన్న (వి. చెంచయ్య విశ్లేషణ), లేఖా సాహిత్యం (కేతవరపు రామకోటి శాస్త్రికి త్రిపురనేని మధుసూదనరావు లేఖలు), అంటరాని బతుకమ్మ(పి. చిన్నయ్య కథలు), సుదర్శన్ పాటలు, అరసవెల్లి క్రిష్ణ కవిత్వం, బాలసాని రాజయ్య పాటలు, వ్యవసాయ సంక్షోభం-రైతాంగ పోరాటం (అరుణ్ వ్యాసాలు), కాషాయ ఫాసిజం: హిందుత్వ జాతీయవాదం- నయా ఉదారవాద వనరుల దోపిడీ (అశోక్) మొదలైనవి.

(ఇది విరసం విడుదల చేసిన పత్రికా ప్రకటన)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *