అధికార వైసీపీకి రాజకీయ సవాలుగా మారుతున్న తిరుపతి ఉపఎన్నిక. గెలిచే పార్టీకి అగ్ని పరీక్షగా మారుతుండటమే తిరుపతి ఎన్నిక ప్రత్యేకత
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
ఏకపక్షంగా జరగాల్సిన తిరుపతి ఉపఎన్నికలు అధికార పార్టీకి సవాలుగా మారుతుంది. అది కూడా గెలుపు సునాయాసంగా ఉన్న నియోజకవర్గంలో వైసీపీకి అగ్నిపరీక్షగా మారడం గమనార్హం.
తిరుపతి ప్రత్యేకత…
తిరుపతి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి తదనంతరం వైసీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం. గత ఎన్నికల్లో మొత్తం 16,50,453 ఓట్లలో దాదాపు 80 శాతం అంటే 13,20,000 దాకా నమోదైంది. వైసిపి 55 శాతంతో 7,22,877 ఓట్లు పొందినది. తెలుగుదేశం 37 శాతంతో 4,94,501 ఓట్లు పొందినది. ఫలితంగా వైసీపీ 2,28,376 ఓట్ల మెజారిటీని సాధించింది. మిగిలిన పార్టీలు అధికార , విపక్ష పార్టీలకు దరిదాపుల్లో కూడా నిలవక నోటాతో పోటీ పడ్డాయి. వైసీపీ ఎంపీ అనారోగ్యంతో మరణించిన కారణంగా ఉపఎన్నిక ఆనివార్యం అయినది.
అధికార పార్టీకి సవాలు విసురుతున్న గత మెజారిటీ.
నేడు జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీ విజయం నల్లేరుమీద నడకే కానీ గత మెజారిటీ ఇప్పుడు వైసీపీకి సవాలు విసురుతున్నది. రాష్ట్రంలో వైసీపీకి 50 శాతం , టిడిపికి 40 శాతం ఓట్లు నమోదు అయితే తిరుపతిలో మాత్రం 55 శాతం వైసీపీకి , టిడిపికి 37 శాతం మాత్రమే నమోదు అయినది. అధికారంలోకి వచ్చి 20 నెలల్లోనే ఎన్నికలు రావడం , మున్సిపల్ , కార్పోరేషన్ మరియు పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సాధించిన నేపద్యంలో అధికార పార్టీ గెలవడం మాత్రమే కాదు గత మెజారిటీని అధిగమించాలి. అధికార పార్టీకి ఇదే అగ్నిపరీక్షగా మారుతుంది. గత సాదారణ ఎన్నికల్లో 80 శాతం ఓట్లు పోల్ అయినది. నేడు అంతకన్నా ఎక్కువ పోలింగ్ జరిగితేనే మెజారిటీ సాధ్యం.
పంచాయతీ , మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలే అధికార పార్టీపై రాజకీయ ఒత్తిడి.
గత నెల , మరియు ఈ నెలలో జరిగిన పంచాయతీ , మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసిపి భారీ మెజారిటీతో సీట్లు , ఓట్లును తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం ఓట్లు , సీట్లు సాధించడంలో సఫలం కాలేకపోయినా అధికార పార్టీ అప్రజాస్వామిక పద్దతులలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకగ్రీవాలు చేసుకుంది అన్న అంశాన్ని ప్రచారం చేయడంలో విజయం సాధించింది. టిడిపి ఆరోపణలను అందరూ నమ్మకపోయినా ఏమో అన్న మీమాంసకు బీజం వేయగలిగింది. అందుకు అధికార పార్టీకి వచ్చిన ఏకగ్రీవాలు వారికి ఉపయోగపడ్డాయి. అధికార పార్టీ మాత్రం తమకు అనుకూలంగా ప్రజలు ఉన్నారని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను ప్రభావితం చేసిందని అందుకే ఈ విజయమని వాదించింది. ప్రభుత్వం పట్ల అంత సానుకూల వాతావరణం ఉంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కూడా అలాంటి స్పందనే ఉండాలి అన్న మాట సహజం. అంటే జరగబోయే ఎన్నికల్లో 80 శాతం ఓట్లు నమోదు కావాలి. అంతే కాదు ఇప్పుడే జరిగిన పంచాయతీ , మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రతిబింబించాలి అంటే 3.5 నుంచి 4 లక్షల ఓట్ల మెజార్టీ వైసిపి సాధించాలి. అంత మెజారిటీ రాకపోతే టిడిపి తమ ఆరోపణలు నిజమని ప్రభుత్వానికి ప్రజలలో సానుకూల స్పందన ఉంటే పంచాయతీ , మున్సిపల్ ఎన్నికల మెజారిటీ పునరావృతం కావాలి – కాలేదు కాబట్టి స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సులభంగా చెపుతుంది.
సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే పార్టీకి పోల్ అయిన ఓట్లలో మెజారిటీ సాధిస్తే తమ పని పూర్తి అవుతుంది. కానీ తిరుపతి ఎన్నికల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా గతం కన్నా భారీ మెజారిటీతో గెలవాలి. అలా సాధించాలి అంటే ఓటింగ్ శాతం కూడా 80 శాతం దాటాలి. అంటే ఓటింగ్ శాతం పెంచే పని కూడా అధికార పార్టీపై ఉన్నది. ఏది ఏమైనా రాజకీయ సానుకూల వాతావరణం ఉన్న పరిస్థితులలో జరుగుతున్న తిరుపతి ఎన్నిక అధికార పార్టీకి గత మెజారిటీ , స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు భారీ మెజారిటీ సాధించాల్సిన అనివార్యత ఏర్పడి రాజకీయ సవాలుగా మారింది. ఈ పరీక్షను వైసిపి ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి, రాజకీయ విశ్లేషకుడు, తిరుపతి)