తెలంగాణ బడ్జెట్ లో ఉండేదేమిటి? లేనిదేమిటి?: ఒక టీచర్ విశ్లేషణ

– వడ్డేపల్లి మల్లేశము

ఆర్థిక మంత్రి హరీష్ రావు నిన్న అసెంబ్లీలో   2021 -22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన రు. 2,30, 826 కోట్ల తెలంగాణ వార్షిక బడ్జెట్  అంకెలలో భారీగా కనబడి నప్పటికీ ప్రజా కోణములో నుంచి చూస్తే నిరాశ కలిగిస్తుంది. మౌలికమైన ,ప్రాధాన్యత రంగాలను కాకుండా ప్రభుత్వ ప్రతిష్ట, తాను ఎంచుకున్న రంగాలకు నిధులను ఎక్కువగా కేటాయించడం వల్ల ఇది ప్రజా బడ్జెట్ అని అనిపించుకునే ఆస్కారం తక్కువగానే ఉంది.

బడ్జెట్ మౌలిక అంశాలు

విద్య, వైద్యం వంటి అనేక అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యానికి నోచుకోకుంటే
ప్రజలకు మిగతా అంశాలతో సంబంధం లేనట్లుగానే అనిపిస్తుంది. విద్యారంగానికి సంబంధించి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన బడ్జెట్లో 11 శాతంగా ఉంటే నేడు అది 6 శాతానికి తగ్గిపోవడం గత సంవత్సరాలలో క్రమంగా తగ్గుతూ రావడం ప్రభుత్వం విద్య పట్ల నిర్లక్ష్యం వహించినట్లుగానే అర్థమవుతున్నది.

కేరళ ప్రభుత్వం 24 శాతంగా కేటాయిస్తే ఇటీవల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ లో విద్యా రంగానికి 25 శాతం నిధులను కేటాయించడం విప్లవాత్మకమైన టువంటి మార్పు.

ఢిల్లీ ప్రభుత్వం  అధికారంలో ఉన్న గత రెండు దఫాలుగా  ఇదే స్థాయిలో విద్యకు నిధులను కేటాయించడాన్ని బట్టి ఢిల్లీలో ప్రభుత్వ విద్య ఎంత బలోపేతమైందో అర్థం చేసుకోవచ్చు. దాని పర్యవసానమే ప్రైవేటు పాఠశాలల నుండి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో నికి మారడం.

కాని తెలంగాణ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా బడ్జెట్లో నిధులను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది.  అలాగే వైద్య రంగానికి కూడా కేవలం మూడు శాతం మాత్రమే నిధులను కేటాయించడంతో ప్రభుత్వ వైద్యం కూడా అందకుండా పోయి ప్రైవేటు రంగాన్ని పెంచి పోషిస్తున్న విధానమని ఇటీవలి కరోనా నేపథ్యంలో జనానికి అర్థమైపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు బడ్జెట్ లో కొంత అటుఇటుగా ఉన్నప్పటికీ విద్య వైద్యం మీద నిరంతరం సమీక్ష చేస్తూ ‘నాడు-నేడు’ అనే కార్యక్రమం ద్వారా నిధులను ఎక్కువగా కేటాయిస్తూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి చేస్తున్న కృషిని ప్రశంసించక తప్పదు.

విద్యా వైద్య రంగాల విషయంలో ఢిల్లీ కేరళ చివరికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల తో కూడా పోటీ పడలేని నిస్సహాయ స్థితిలో ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మెరుగైన చర్యలు చేపట్టకపోతే సమీప భవిష్యత్తులో ప్రధానమైన విద్య, వైద్య రంగాలు ప్రజలను ఆకర్షించ లేవు.

 

మిగతా ప్రాధాన్యతా అంశాలు

వ్యవసాయానికి 25 వేల కోట్లు అంటే 11 శాతం నిధులను కేటాయించినప్పటికీ క్షేత్రస్థాయిలో నిజంగా వ్యవసాయం చేస్తూ శ్రమ చేస్తున్నటువంటి కౌలు రైతులతో సహా ఏ రైతుకు ప్రతిఫలము నిజంగా అందడం లేదు.

వందల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల కూడా రైతుబంధు వర్తింపచేయడం  ద్వారా, సాగుకు యోగ్యంకానటువంటి గుట్టలు రాళ్లు రప్పల భూములకు కూడా రైతుబంధు ను మంజూరు చేయించుకుంటున్నారు.

బడ్జెట్ లో 50 వేల కోట్ల రూపాయలను అప్పుగా సమకూర్చుకోవడం  తప్ప దీనిని అమలు చేయలేమని ఇది ప్రజలపై భారం పడే విధంగా ఉందని ప్రతిపక్ష నాయకులు విమర్శించడాన్ని మనము గమనించలి.

తక్షణ అవసరము కాని, సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడని, గత ఆరు సంవత్సరాలుగా ఏనాడు కూడా ఆచరణలో చూపని సచివాలయము నిర్మాణము పేరుతో సుమారు 600 కోట్లను కేటాయించడం ఏవర్గ ప్రయోజనం కోసం?

ప్రజలతో ప్రజా సంఘాలతో అఖిల పక్షాలతో ఏనాడు కూడా సంప్రదించకుండానే తక్షణావసరంలాగా, భద్రంగా ఉన్న నిర్మాణాన్ని కూలగొట్టి కొత్త సచివాలయం పేరుతో నిధులు కేటాయించడం ఆ స్థలంలో కూలిపోయిన ఇటువంటి మత ప్రాధాన్యత స్థలాలను తిరిగి నిర్మించడం కోసం అదనపు భారాన్ని మోయడం ఏమిటి? ఇది తక్షణ అవసరం అయితే కాదు కదా?

ఇక 52 శాతం గా ఉన్నటువంటి బీసీ జనాభా సంక్షేమం కోసం 11 వేల కోట్లు అంటే దాదాపుగా నాలుగు శాతం నిధులను కేటాయించడం ఏ మూలకు సరిపోతుందో విజ్ఞులు ,ప్రభుత్వాధినేతలు ఆలోచించాలి.

నిరంతరము అనారోగ్యము, ఆత్మహత్యలు, అప్పులతో అలమటిస్తూ
ప్రజల మాన రక్షణ చేసే నేతన్నల సంక్షేమానికి కేవలం 338 కోట్లు మాత్రమే కేటాయించడం ఏ మూలకు సరిపోతుంది?

గతంలో పన్నెండు వందల కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు ఇష్టం లేకుండా పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేసి నేతన్నల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన విషయాన్ని చేనేత కార్మికులు అయినా ప్రస్తుతము తమ మనుగడ కోసం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

బడ్జెట్లో విస్మరించిన కొన్ని అంశాలు

రాష్ట్రంలో ఇప్పటికీ సమగ్రమైన యువజన విధానమంటూ లేకపోవడంతో పాటు లక్షలాది మంది నిరుద్యోగుల మనుగడకు సంబంధించిన ఉపాధి పథకాలను ఉద్యోగ భర్తీ విషయాలను బడ్జెట్ ప్రస్తావించక పోవడం. నిధులు కేటాయించకపోవడం బాధాకరం.

నిరుద్యోగ భృతి అమలు గురించి, ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సి తదితర సౌకర్యాల గురించి, ప్రస్తావించలేదు.  దళిత రైతులకు  మూడు ఎకరాల భూమి ని పంచడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి  స్థలము ఉంటే ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు గురించి మరింత స్పష్టంగా ప్రకటన చేసి నిధులను కేటాయిస్తే బాగుండేది.

పరిపాలన అంటే కేవలం పెన్షన్లు మంజూరు చేసి వివిధ పద్దుల కింద బడ్జెట్ను అలాట్మెంట్ చేస్తే సరిపోతుందని  భావించే సంప్రదాయాన్ని తెరదించి తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా నినదించిన ‘నిధులు- నియామకాలు’ వంటి  ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల పట్ల మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉండింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల మీద  స్పష్టమైన ప్రకటనచేయకపోవడం బడ్జెట్ లో పెద్ద లోటు.

మరొకవైపు అనేక రాజకీయ పార్టీల నాయకులు కార్పొరేట్ సంస్థల ప్రతినిధుల చేతుల్లో ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూమి సామాన్యుని గడప దాటని సందర్భంలో భూసంస్కరణలు అమలు జరిగిన దాఖలాలు లేదు.

విచ్చలవిడిగా భూదందాలకు పాల్పడుతున్న వారు భూముల ధరలు పెంచి రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచి పోషిస్తూ సామాన్యునికి అరగుంట ఇంటి స్థలం కూడా అందుబాటులో లేనటువంటి దయనీయ పరిస్థితిసృష్టించడం పైన ప్రభుత్వం ఆలోచించి నియంత్రించాల్సిన అవసరం ఉంది.

బడ్జెట్ పై చర్చలో   ప్రతి పక్షాలకు చెందిన శాసనసభ్యులు ప్రభుత్వము విస్మరించిన, ప్రాధాన్యత ఇవ్వని, గతంలో హామీ ఇచ్చి అమలు చేయని వాగ్దానాలను ప్రస్తావించి, వాటిని అమలుచేసేలా  ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించ వలసిన బాధ్యత తీసుకోవాలి.

వివిధ కార్పొరేషన్లకు నిధులను కేటాయించడం ద్వారా ఆయా కుల సంఘాలు వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అప్పుడు మాత్రమే ప్రభుత్వం ప్రజల మనసులను గెలుచుకుంటుంది.

పెన్షన్లు, వాగ్దానాలు, ఎన్నికలు, ఎన్నికల్లో విచ్చలవిడిగా నిధులను ఖర్చు చేసే సాంప్రదాయం మాత్రమే పరిపాలన అనుకుంటే పొరపాటే అవుతుంది. ఇది అధికారపక్షంతో పాటు ప్రతిపక్షాలకు కూడా వర్తిస్తుంది.

Vaddepalli Mallesamu

( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు, కవి, రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం మొబైల్ : 9014206412)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *