తెలంగాణ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మూడంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయింది. ఇక్కడి సంతోష్ థియేటర్ పక్కనే ఉన్న ఈ భవనం గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో కూలిపోయింది.
బిల్డింగ్ కూలడానికి ముందే భారీగా శబ్ధాలు రావడంతో అందులో ఉన్న వారంతా అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
పక్కనే కొత్త భవనం నిర్మాణంలో భాగంగా సెల్లార్ కోసం భారీ గుంత తవ్వడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.
ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు వరకు ఆ భవనంలో 10 మంది బోరుబావి కార్మికులు ఉన్నారు. భవనం నుంచి భారీ శబ్దాలు రావడంతో ఆందోళన చెంది వారంతా బయటికి పరుగులు తీశారు. అనంతరం క్షణాల్లోనే భవనం నేలమట్టమైంది. కార్మికులు ఉన్న సమయంలో భవనం కూలితే భారీ ప్రాణనష్టం సంభవించేది.
దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
సెల్లార్ గుంత తీయడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
(This story is taken from vedigali.com)