పారిస్ కమ్యూన్ కి 150 ఏళ్లు ,పారిస్ కమ్యూన్ అంటే ఏమిటి?

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

సరిగ్గా ఈ రోజు తెల్లవారుజామున  కోడి కూసే సమయం. (పారిస్ లో నాడు కోడికూత ఉనికిలో ఉందొ లేదో మరో మాట) ఈ కోడి కూసే సమయానికి సరిగ్గా నూటా యాబై ఏళ్ల క్రితం చరిత్రలో ఏం జరిగిందో చరిత్ర పుటల్ని తిరగేద్దాం.

అప్పటికి సరిగ్గా ఆరు నెలల క్రితం మాట. 1-9-1870న చరిత్రలో ఫ్రాంకో- ప్రష్యన్ యుద్ధం ప్రారంభమైనది. ఆ యుద్ధం ఓవైపు మూడో నెపోలియన్ గా పిలుచుకునే లూయూ నెపోలియన్ బోనపార్టీ ప్రభుత్వ నేతృత్వం లోని ఫ్రాన్స్ దేశానికీ, మరోవైపు బిస్మార్క్ నేతృత్వంలోని ప్రష్యా (జర్మనీ) కి మధ్య తలెత్తింది.

ఒకే ఒక్కరోజు లోనే సెడాన్ వద్ద ఫ్రాన్స్ ఘోరాతి ఘోరమైన పరాజయం పొందింది. దాని కంటే 55 ఏళ్ల క్రితం చరిత్రలో పేరొందిన వాటర్లూ యుద్ధ ప్రస్తావన చేయాల్సి ఉంది. మొదటి నెపోలియన్ సైన్యాలు 1815 లో వాటర్లూ యుద్ధంలో ఎట్టి ఘోర పరాజయాన్ని పొందాయో, తిరిగి 55 ఏళ్ల తర్వాత 1970 సెప్టెంబర్ 2న కూడా అలాంటి పరాజయం ఫ్రాన్స్ పొందింది.

పై ఓటమి ఆనాడు మొదటి నెపోలియన్ చేతుల్లో చేకూరింది. మొదటి నెపోలియన్ కి స్వయంగా మేనల్లుడైన ఈనాటి మూడో నెపోలియన్ చేతుల్లో ఓటమి చేకూరడం గమనార్హం.

లూయీ బోనాపార్టీ చక్రవర్తితో సహా 90 వేల ఫ్రెంచ్ సైన్యాలు బిస్మార్ నేతృత్వంలోని ప్రష్యా (జర్మనీ) కి లొంగిపోయాయి. విజయమో వీరమరణమో అనే త్యాగనిరతి తో దేశంకోసం యుద్ధం చేసే లక్ష్యాన్ని వదిలేసి ప్రాణభీతితో శత్రుదేశం ఎదుట బ్రతుకు జీవుడా అని లొంగిపోయాయి. ఈ దేశద్రోహకర వైఖరిపై పారిస్ కన్నెర్ర జేసింది.

ఆ మూడో రోజే అనగా 4-9-1870 తేదీన తీవ్ర అగ్రహోదగ్రులైన పారిస్ ప్రజలు తాము జర్మనీకి లొంగిపోయే ప్రసక్తి లేదని ప్రకటించారు. అప్పటికి శత్రు చేతుల్లో బందీగా ఉన్న నెపోలియన్ బోనాపార్టీ ప్రభుత్వ అధికారమే ఇంకా సాంకేతికంగా పారిస్ లో ఉంది. ఆ స్థితిలో పారిస్ తిరగబడింది.

4-9-1870న పారిస్ లో మూడో నెపోలియన్ పాలనను కూలద్రోసి, నేషనల్ అసెంబ్లీ కి నగర ప్రజలు ఎన్నికల్ని వేగంగా జరిపించారు. ఈ ఎన్నికలలో ఒక మరుగుజ్జు పాలకుడు ప్రధానిగా ఎన్నిక అయ్యాడు. అతడే త్యేర్స్ (Joseph Louis Adolphe Thier)

ఎన్నికయ్యే ముందు త్యేర్స్ మరుగుజ్జు అవుతాడని పారిస్ ప్రజలు ఊహించలేదు. ఈ ప్రధానిని ప్రజలు ఓటింగ్ ద్వారా ఎన్నిక చేస్తే, అతడేమో తెరవెనుక బిస్మార్క్ ప్రభుత్వంతో కుమ్మక్కై, పారిస్ ప్రజల్ని నడ్డివిరిచే నయవంచక కుట్రలకు పూనుకున్నాడు.


నూటా యాబై ఏళ్ల పారిస్ కమ్యూన్
(18-3-1871 నుంచి 18-3-2021) సంస్మరణలో


పారిస్ శ్రామికవర్గ చైతన్యం అంటే బెంబేలిత్తిపోయే ఈ మరుగుజ్జు ప్రధాని త్యేర్స్ తన రాజధానిని పారిస్ నుండి, అక్కడకు సుమారు 20 కిలో మీటర్ల దూరంలోని వర్సెయిల్స్ పట్నానికి మార్చివేశాడు. జర్మన్ దురాక్రమణ నుండి దేశ రక్షణ, ముఖ్యంగా పారిస్ రక్షణ పారిస్ ప్రజల లక్ష్యంగా ఉంది. కానీ త్యేర్స్  మాత్రం పారిస్ శ్రామికవర్గ ప్రజల నుండి తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడమే.

మరో 46 ఏళ్ల తర్వాత 1917 లో రష్యాలో జరిగిందే పారిస్ లో  ముందే 1871లో జరిగింది. సోవియట్ సోషలిస్టు విప్లవం ప్రాంగణంలో ఉండగా జరిగిన కార్మిలోవ్ కుట్ర జగద్విదితమే. నాటి శ్రామికవర్గ విప్లవ కేంద్రమైన పెట్రోగ్రాడ్ నగరాన్ని జర్మన్ సామ్రాజ్యవాద ప్రభుత్వానికి అప్పగించి, దాన్ని రక్తసిక్తంగా అణచి వేయుంచే ఆంగ్లో, ఫ్రెంచ్ సామ్రాజ్యవాద కుట్ర తెలిసిందే. దానిపై నాడు పెట్రోగ్రాడ్ తిరగబడ్డ చరిత్ర కూడా తెలిసిందే. సరిగ్గా అదే తరహా కుట్ర మరో రూపంలో దాని కంటే 46 ఏళ్ళు ముందే పారిస్ కేంద్రంగా చరిత్రలో జరిగింది.

Paris commune Postal Stamp

1871 నాటి త్యేర్స్ పన్నిన కుట్ర ప్రపంచ విప్లవ చరిత్రలో మొదటి శ్రామికవర్గ కమ్యూన్ స్థాపనకి దారితీసింది. 1917 నాటి కార్మిలోవ్ కుట్ర రష్యన్ సోషలిస్టు విప్లవ ఆవిష్కరణకు దోహదపడింది. యాదృచ్చికంగానే కావచ్చేమో, చరిత్ర కొన్నిసార్లు పునరావృతం లేదా పునరావిస్కరణలకు గురి అవుతోంది. 1871లో పారిస్ ను జర్మనీకి అప్పగించిన కుట్ర, పారిస్ కమ్యూన్ ఏర్పాటుకు ఉత్ప్రేరకంగా మారితే, 1917 సెప్టెంబర్లో పెట్రోగ్రాడ్ ను జర్మనీకి అప్పగించిన కుట్ర ప్రధమ సోవియట్ సోషలిస్టు రాజ్య స్థాపనకు ఉత్ప్రేరకంగా మారింది. చరిత్ర ఎంతటి అద్భుతమైనదో కదా!

ఒక వైపు బిస్మార్క్ ప్రభుత్వం చేతుల్లో ప్రత్యక్ష ఖైదీగా మూడో నెపోలియన్ వున్నాడు. మరో వైపు వర్సెయిల్స్ ప్రభుత్వ అధినేత త్యేర్స్ కూడా పరోక్ష ఖైదీగా వున్నాడు. ఇంకొవైపు జర్మన్ సైన్యాలు పారిస్ నగర పొలిమేరల్లో నెలల తరబడి మకాం వేసి ఉన్నాయి. పారిస్ కి పది మైళ్ళ దూరంలో త్యేర్ సైన్యాలు వర్సెయిల్స్ కేంద్రంగా పారిస్ పైకి బిస్మార్క్ ప్రభుత్వ అండతో దూకడానికి పొంచి ఉన్నాయి. పారిస్ నగరం శత్రువర్గాల చక్రబంధంలో చిక్కుకొని ఉంది. రేపో మాపో ముప్పేట దాడికి గురయే ప్రమాదకర స్థితిలో ఉంది. పైగా ఉపాధి లేక కాలే కడుపులతో గడిపే క్లిష్ట కాలంలో కూడా పారిస్ నగరం తొణకిసలాటకు గురికాకుండా నిండుకుండగా దేశరక్షణ చైతన్యంతో నిలబడి ఉంది. ఇదీ నాటి పారిస్ స్థితి!

4-9-1870 నుండి ఆరున్నర నెలలుగా పారిస్ ప్రజలకు చేతి నిండా పనులు లేవు. పధకం ప్రకారం పరిశ్రమల మూసివేతల స్థితి కొనసాగుతోంది. వాణిజ్య వర్గాలు క్రయావిక్రయాల్ని పూర్తి గా నిలిపి వేసాయి. ఫలితంగా ఆకలిబాధతో పారిస్ నగరం తల్లడిల్లుతోంది. పసిపిల్లలకు కూడా తల్లులు ఆకలి తీర్చలేని దుస్తితి కొనసాగుతోంది. ఐనా పారిస్ నగరం కార్మికవర్గ చైతన్యంతో వర్ధిల్లుతోంది. అది శ్రామికవర్గ విప్లవ చైతన్యంతో కూడిన దేశరక్షణ కర్తవ్యాన్ని వదలలేదు. అదే నాటి పారిస్! అదే విప్లవ చైతన్యంతో నాడు హోరెత్తుతోన్న పారిస్! అదే శ్రామికవర్గ అంతర్జాతీయతా పారిస్! అదే వివాలా పారిస్! అదే గర్జించు పారిస్, అదే గాండ్రించు పారిస్, విప్లవ శంఖం పూరించు పారిస్! అందుకే ప్రపంచ శ్రామికవర్గం నాటికీ, నేటికీ పారిస్ కమ్యూన్ కి విప్లవ జేజేలు పలికేది.

ఇది సరిగ్గా 150 ఏళ్ల క్రితం మాట! వర్సెయుల్స్ నుండి విద్రోహ త్యేర్ ప్రభుత్వ సేనలు 17-3-1871వ తేదీ అర్ధరాత్రి దొంగచాటుగా పారిస్ లోకి ప్రవేశించాయి. అప్పటికే ఆకలి క్షుద్బాధతో కాలే కడుపులతో పారిస్ నగర జనం మంచాలపై నిద్రిస్తోన్నది. జనం కళ్ళుకప్పి, త్యేర్స్ ప్రభుత్వ సైన్యాలు నడి రాత్రి వర్సెయుల్స్ నుండి దొంగచాటుగా ఓమూల నుండి పారిస్ లోకి ప్రవేశించాయి. అవి నగరంలో తూర్పు అంచున గల మాన్ మార్త్రే కొండ వద్దకు చేరాయి. అదే ఆయుధ గిడ్డంగి స్థలం. అదే పారిస్ ప్రజలు పాత ఆయుధ సామాగ్రికి అదనంగా తమ సొంత ఆయుధ తర్ఫీదు జ్ఞానంతో ఇటీవల తయారు చేసిన కొత్త ఆయుధ సామగ్రిని కూడా కలిపి దాచి పెట్టింది. పారిస్ ప్రజలు తమ నగరం చుట్టూ పొంచి ఉన్న బిస్మార్క్ సైన్యాల నుండి గత కొన్ని నెలలుగా కంటికి రెప్పలా కాపాడుకునే ఆయుధ సామగ్రి అది. అట్టి ఆయుధ నిలయాల స్వాధీన వార్త వేకువ ఝామున పొక్కిపోయింది. చరిత్రలోనే సదా చిరస్మరణియమైన ఓ మరపురాని సంఘటనను ఇక్కడే గుర్తు చేయాలి. త్యేర్స్ సైన్యాల దొంగచాటు చొరబాటు దృశ్యం తొలుత స్త్రీల కంట బడింది. కాలకృత్యాలకి వెళ్లిన స్త్రీలకి వేకువ జామున త్యేర్స్ సైన్యాల రాక దృశ్యం తొలుత కంటపడింది. హుటాహుటిన బారులు తీరారు. స్త్రీల పిలుపే పారిస్ కి ఓ మేల్కొలుపుగా మారింది. పారిస్ దిగ్గున నిద్ర లేచింది. ఉలిక్కి పడింది. పారిస్ గర్జించింది.

వీరనారి లూసీ నేతృత్వంలో వేలాది మంది మహిళల ప్రదర్శన సరిగ్గా కోడికూసే సమయంలో పారిస్ నగరంలో తూర్పు అంచున గల కొండపై ఆయుధ గిడ్డంగుల వైపు దూసుకెళ్లింది. మగువల తొలి తెగువతో పారిస్ శ్రామిక జనం కదిలి పోయింది. ఆకలి పేగులు విప్లవ కేకలు పెట్టాయి. మండే గుండెలు ఘీంకరించాయి. నకనకలాడే కాలే కడుపులు తిరగబడ్డాయి. నగరం చుట్టూ కొండలపై నుండి భూతద్దాల నుండి పొంచి చూస్తోన్న బిస్మార్ సైన్యాలకు వెన్నులో వణుకు పుట్టింది. పారిస్ నగరంలోకి గుంటనక్క వలే చొరబడ్డ విద్రోహి త్యేర్స్ సేనలు గజగజ వణికి పోయాయి. ఆయుధ సామగ్రిని పారిస్ నుండి వర్సెయుల్స్ కి తరలించి, పారిస్ ను నిరాయుధం చేసి, శ్రామికవర్గం తిరిగి సమీప భవిష్యత్తులో తలెత్తనివ్వని లక్ష్యంతో జర్మన్- ఫ్రెంచ్ బూర్జువా వర్గాలు పరమ కుట్ర పన్నాయి. తమ కుట్ర తెల్లారే సరికి ఫలిస్తుందనే వెర్రితనంతో ధనమాదందులు మత్తులో మునిగివున్నాయి. వారి పెను వ్యూహాఁ భగ్నమైనది. ఫిరంగి వ్యవస్థతో సహా ఆయుధ సామగ్రిని సరిగ్గా వర్సెయుల్స్ నుండి తమతో తెచ్చిన గుర్రపు బండ్ల పై హడావుడిగా త్యేర్ సైన్యాలు ఎక్కిస్తున్నాయి. మరో గంటలో తెల్లారబోతోంది. అవి తెల్లారేసరికి వందలాది గుర్రపు బండ్ల ద్వారా పారిస్ నగరాన్ని వదిలి వర్సెయిల్స్ దిశగా వెళ్లి పోతాయి. ఇంతలో శ్రామికవర్గ పారిస్ తిరగబడింది. హఠాత్తు గా  పారిస్ ప్రజల నడుమ త్యేర్స్ సైన్యాలు బందీగా చిక్కి పోయాయి. అదే 150 ఏళ్ల క్రితం ఇదే రోజు కూడికూత సమయంలో పారిస్ లో ఏర్పడ్డ విప్లవ రసకందాయ సన్నివేశం.

మరో గంటలో శ్రామికవర్గ విప్లవ పారిస్ ని నిరాయుధం చేసి నడ్డి విరగ్గొడుతున్నామనే గొప్ప ఆనందం, అనుభూతుల్లో మార్చి 17వ తేదీ రాత్రంతా రెండు దేశాల బూర్జువావర్గం, బడా వాణిజ్య వర్గాలు, డబ్బు సంచుల వర్గాలు విందులు, వినోదాలలో మునిగిపోయారు. పారిస్ నుండి ఆయుధ సామగ్రి ని తరలించే “శుభవార్త” కోసం వారు కళ్ళు లొట్టలు వేసుకుని బీరు బాటిల్స్ త్రాగుతూ మైకం కమ్మిన మత్తులో ఎదురు చూస్తున్నాయి. ఇంతలోనే వాళ్ళను దిగ్భ్రాంతికి గురి చేసిన వార్త అందింది.

నిజానికి ఇప్పటి వరకూ పారిస్ శ్రమజీవులు తమ చేతుల్లోకి ఆయుధాల్ని తీసుకోలేదు. వాటిని తమ కనుసన్నల్లో మాత్రమే కాపలా కాస్తున్నారు. ఇప్పటివరకు పారిస్ ప్రజలు సాయుధులు కారు. ఒకవేళ సందర్భం వస్తే సాయుదులుగా మారాలనే ఆకాంక్ష మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వారి కనుసన్నల నుండి వారి చేతుల్లోకి ఆయుధ సంపత్తి మారింది. ఆయుధ సామగ్రి పారిస్ శ్రామికవర్గం చేతుల్లోకి మారిందనే వార్త రెండు దేశాల బూర్జువా వర్గానికి అందింది. అవి గడగడ లాడిపోయాయి. అదే పారిస్ కమ్యూన్ కి దారి తీసింది. అదే భూమండలంపై తొలి శ్రామిక వర్గ రాజ్యాధికార స్థాపనకు దారి తీసింది.

పారిస్ కమ్యూన్ ఓ చరిత్ర. అదో విప్లవోద్యమ చరిత్ర! అదో నెత్తుటి త్యాగాల అమర చరిత్ర! అది ఘోర రక్తసిక్త అణిచివేత కుట్రకి బలైన చరిత్ర! 72 రోజులు శ్రామికవర్గ రాజ్య పాలన ఎలా ఉంటుందో మొట్టమొదటి సారి చరిత్రలో నిరూపించింది. అట్టి 72 రోజుల కమ్యూన్ శ్రామికవర్గ పాలనను తుదముట్టించే లక్ష్యంతో నాటి ప్రపంచ డబ్బు సంచుల వర్గాలు ఒక్కటై, రక్తసిక్త అణచివేతను సాగించాయి. 28-5-1871న ఆదివారం ఉదయం 11గంటల కి ఆఖరి కమ్యూనార్డు సైతం బారికేడ్ల వద్ద పోరాడుతూ అమరత్వం పొందాడు. ఓవైపు ఆకలి దహించివేస్తున్నా, మరో వైపు ప్రీతిపాత్రమైన ఆయుధం వదలకుండా వర్గ శత్రువులపై కసితో తుది శ్వాస వరకూ పోరాడిన త్యాగ పునీతన చరిత్ర పారిస్ కమ్యూన్ కి దక్కుతుంది. అది చరిత్రలో చిరస్మరణీయమైనది. భవిష్యత్ ప్రపంచ శ్రామికవర్గానికి విప్లవ ఆశయపరంగా దారిదీపాన్ని అందించిన ఘనత పారిస్ కమ్యూన్ కి దక్కుతుంది. ఓ లక్షమంది అసువులు బాసిన అమానుషత్వాన్ని అధిగమించి సాగిన రణ చరిత్ర అది. 72వ రోజు అనగా 28-5-1871న అది ఎట్టకేలకు ఓడింది. అది ఓడిన తర్వాత కూడా 30 వేల మందిని వధించి కసితీరా కాల్చి చంపిన రక్త పంకిల చరిత్ర అది. వేలమంది కనుగ్రుడ్లను పట్టుకార్లతో పీకించిన దుర్మార్గ హేయమైన చరిత్రను బూర్జువా వర్గం మూటగట్టుకుంది. ఇంకా 45వేలమంది కార్మిక యోధుల్ని ద్వీపాంతరవాస శిక్షలు విధించి అమానుష హింసలు గురిచేసిన చరిత్ర అది. మరణించగా, జైళ్లకి వెళ్లగా మిగిలిన పారిస్ నగర ప్రజలు సైతం తల్లికి, పిల్లలు; పిల్లలకి తల్లిదండ్రుల్ని దూరం చూసిన అమానవీయ చరిత్ర అది. మొట్టమొదటిసారి చరిత్ర లో బూర్జువావర్గం శ్రామిక వర్గాల పట్ల ఎలాంటి ఉన్మత్త, ఉన్మాదతతో ప్రవర్తిస్తుందో ఆచరణాత్మకంగా కళ్ళకు కట్టినట్లు నిరూపించిందే పారిస్ కమ్యూన్ విప్లవ చరిత్ర!

మార్క్స్, ఎంగెల్స్ లు పారిస్ కమ్యూన్ పరిరక్షణ కై అహర్నిశలు శ్రమించారు. అది మూడు దశలుగా సాగింది. పారిస్ కమ్యూన్ ఏర్పాటుకు ముందునుండే దానిపూర్వ స్థితిగతుల పట్ల స్పందించి విశేష కృషి చేసారు. 72 రోజుల కమ్యూన్ కొనసాగిన కాలంలో ఆకలిదప్పులు లేకుండా వారు సాగించిన అంతర్జాతీయ కృషి మరవ లేనిది. పారిస్ కమ్యూన్ ఓటమి తర్వాత పారిస్ నుండి తరలి వచ్చిన వందల మంది అజ్ఞాత నేతలు, వేలాది మంది శరణార్థుల పునరావాసం వంటి రాజకీయ కృషి చేసారు. సరిగ్గా పారిస్ కమ్యూన్ సమయానికి లెనిన్ ఏడాది పసికందు. దాని చరిత్రను లెనిన్ ఆ తర్వాత కాలంలో గొప్పగా అధ్యయనం చేసాడు. పారిస్ కమ్యూన్ గుణపాఠాల వెలుగులో పెట్రోగ్రాడ్, మాస్కో, రీగా, బాకూ వంటి నగర కార్మికవర్గ తిరుగుబాట్లను నిర్మించి, రష్యా లో పారిస్ కమ్యూన్ ని మరో రూపంలో ఆవిస్కరించుటకు తన వంతు సైద్ధాంతిక కృషిని లెనిన్ సాగించాడు.

సరిగ్గా 150 ఏళ్ల క్రితం ఇదే రోజు, ఇదే వేకువ జామున పారిస్ స్త్రీల తొలి పొలికేకతో ప్రారంభమై నిర్మాణమైన పారిస్ కమ్యూన్ విప్లవ చరిత్రకి విప్లవ జేజేలు కొడదాం. ఈ రోజు ఈ పూట, ఈ వేకువ జామున ప్రారంభమైన ఆ శ్రామికవర్గ తిరుగుబాటుకి సరిగ్గా 150 ఏళ్ళు నిండిన సందర్భంగా మనం వాడవాడలా ఘనంగా స్మరించుకుందాం. ఈ గొప్ప విప్లవ పారిస్ చరిత్ర స్మరణ సందర్భంగా నాటి పారిస్ కమ్యూన్ త్యాగాల చరిత్ర అధ్యయనం కై ప్రయత్నిద్దాం. దాని వెలుగులో విప్లవ స్ఫూర్తి పొంది, రేపటి శ్రామికవర్గ విపవోద్యమాల నిర్మాణంపై కేంద్రీకరిద్దాం.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *