కార్పొరేట్ల కోసం పాలకులూ, పాలకుల కోసం కార్పొరేట్లు! క్విడ్ ప్రొకో ఆట యధేచ్ఛగా సాగిపోతోంది మన దేశంలో.
ఈ ఆటను దాపరికం లేకుండా బట్టబయలు చేసారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ”అన్నీ అమ్మివేయడమే మా విధానం” అంటూ పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు.
”లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్ముతున్నారెందుకు?” అన్న పలువురు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా.. ”అసలు మా అమ్మకాలకు లాభనష్టాలు ప్రాతిపదికే కాదు, ప్రయివేటీకరించాలనుకున్నాం అదే చేస్తున్నాం” అంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసారు.
ఉద్యోగులూ కార్మికులూ ఈ ప్రయివేటీకరణకు తమ నిరసనలను తీవ్రం చేస్తున్న వేళ… ఒకటీ రెండూ కాదు, సమస్త ప్రభుత్వరంగాన్ని తెగనమ్మడమే తమ విధానమని పార్లమెంటులోపలా వెలుపలా ప్రధాని సహా మంత్రులంతా ఇదే బృందగానాన్ని పదే పదే ఆలపిస్తున్నారు. ఇక ఆలోచించుకోవాల్సింది ప్రజలే.
సామ్రాజ్యవాదులపై రెండు శతాబ్దాలుగా పోరాటంలో పాల్గొన్నవారికి ఆనాటి స్థితిగతుల్లో మార్పు కోసం ఎన్నో స్వప్నాలు, మరెన్నో ఆకాంక్షలు. అవే స్వాతంత్య్రానంతరం ప్రభుత్వరంగమై వెలిసాయి. ఇది సంపన్నదేశాల ప్రభుత్వరంగం వంటిది కాదు.
1947నాటికి ఒక అత్యంత వెనుకబడిన, వ్యవసాయక దేశంలో ఆవిర్భవించిన ప్రభుత్వరంగం. ఇది రెండు కర్తవ్యాలను నిర్వర్తించాల్సి ఉంది. మొదటిదీ కీలకమైనదీ, దెబ్బతిన్న పెద్దపులిలాంటి సామ్రాజ్యవాదం తిరిగి పంజా విసరకుండా దేశాన్నీ, దేశ సార్వభౌమత్వాన్నీ కాపాడటం. రెండవది భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటం.
అయితే సహజంగానే స్వాతంత్య్రానంతర భారత పాలకులకుండే ”వర్గ”నైజం రీత్యా భారత పెట్టుబడిదారులకవసరమైన మౌలిక సరుకులు, గనులు, భారీ యంత్రాలు, విద్యుత్, నౌకా నిర్మాణం, చమురు తవ్వకం, శుద్ధి చేయడం మొదలైనవన్నీ ప్రభుత్వరంగంలో చేస్తూ, వినిమయ సరుకుల ఉత్పత్తి మాత్రం పెట్టుబడిదారులకే వదిలేసారు.
మొదట్లో పాలకులు దీన్ని మిశ్రమార్థిక వ్యవస్థంటూ ముద్దుగా పిలుచుకున్నా దేశంలో నిర్మితమైంది ఫక్తు పెట్టుబడిదారీ విధానమే! అయితే జాతీయోద్యమ ఆకాంక్షల ఫలితంగా నిర్మితమైన ప్రభుత్వరంగానికి లాభనష్టాలు ప్రాతిపదిక కానే కాదు. సామాజిక న్యాయం, ప్రజల ప్రయోజనాలు, దేశ శ్రేయస్సు మాత్రమే ప్రాతిపదిక. ప్రయివేటు సంస్థలకు సొంత ప్రయోజనాలూ, లాభాలవేటే ఏకైక లక్ష్యం అన్నదాంట్లో ఎవరికీ ఏ సందేహమూ లేదు. కానీ ప్రభుత్వసంస్థలకు ఉత్పత్తితో పాటు, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ సంపదను పెంచడమే లక్ష్యం.
ఈ లక్ష్యసాధనలో మన ప్రభుత్వరంగం విజయవంతమైంది కూడా. కానీ ఈ సంపద సృష్టికి ప్రభుత్వరంగం వేసిన దారులు, కార్మికవర్గం ధారపోసిన నెత్తురే కారణమన్న చారిత్రక సత్యాన్ని కావాలనే విస్మరిస్తోంది నేటి ప్రభుత్వం. పైగా పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలంటూ వారికి సాగిలపడుతోంది. సర్కారువారి అంతరంగమేంటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?
పారిశ్రామిక రంగాన్నే కాదు, దేశానికి జీవనాధారమైన వ్యవసాయరంగాన్ని కూడా అమ్మకానికి పెడుతూ మూడు వ్యవసాయ చట్టాలనూ, నూతన విద్యుత్ సవరణ చట్టాన్నీ తెచ్చిందీ ప్రభుత్వం.
రైతును భూమినుండి తరిమేసి విదేశీ స్వదేశీ కార్పొరేట్ల ముంగిట కట్టు బానిసగా నిలబెట్టే కుట్ర చేస్తున్న సర్కారు, ఉద్యోగ, కార్మికవర్గాలను బజారు కీడ్చే కుతాంత్రాన్ని కూడా ఇప్పుడు మరింత వేగవంతం చేసింది.
అన్నీ ప్రయివేటు పరమయితే, రిజర్వేషన్లు ఏమవుతాయి. ఇపుడిపుడే రిజర్వేషన్ల పుణ్యాన అట్టడుగు వర్గాల అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వసర్వీసులలో కనిపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల రిక్రూట్ ఆగిపోయింది. ఇపుడు పబ్లిక్ సెక్టర్ యూనిట్లను ప్రవేటు పరం చేస్తే ఇక ప్రభుత్వ ఉద్యోగాలనేవి లేకుండా పోతాయి. అట్టడుగు వర్గాల వారికి మిగిలేవి కాన్ స్టేబుల్, పారామిలిటీ, ఆర్మీ జవాన్ల వంటిఉద్యోగాలు. ఇప్పటికే ల్యాటరల్ ఎంట్రీ పేరుతో కేంద్ర ప్రభుత్వంలోకి జాయింట్ సెక్రెటరీ స్థాయిపోస్టులకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లకు గేట్లు తెిరిచారు. దీనితో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయి. ఈ ప్రమాదం పొంచి ఉన్నది.
వ్యవసాయ రంగంలో ఈ పరిస్థితి రాబోతున్నట్లు పసిగట్టిన రైతాంగం మూడున్నర నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్నారు. ఇప్పుడీ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికసంఘాలు కూడా ఉద్యమిస్తున్నాయి. అయినా తాము దేశాన్ని అమ్మేయడానికే కట్టుబడివున్నామని ప్రకటిస్తోంది మోడీ ప్రభుత్వం.
ఈ దేశానికి ఉరి బిగించడానికి పాలకులు అమ్ముడు పోయారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
ఇలా ప్రభుత్వరంగమన్నదే లేకుండా పోతే ప్రజాసంక్షేమానికి దిక్కెవరు?
న్నీ ప్రయివేటు పరం చేసేవాడు ప్రజలకు ఎలా బాధ్యత వహించగలడు? కంపెనీలన్నీ అమ్మేసేవాడు వారికి ఉద్యోగాలేమివ్వగలడు? ప్రభుత్వాల కనీస బాధ్యతైన విద్యా వైద్యరంగాలను కూడా పెట్టుబడికే అప్పచెప్పేవాడు రేపు పిల్లలకు చదువులు చెప్పగలడా? ప్రజల ఆరోగ్యాల్ని కాపాడగలడా? బ్యాంకుల్ని తెగనమ్మేవాడు ప్రజల డబ్బుకు హామీ ఇవ్వగలడా? రైళ్లూ, బస్సులతోపాటు రోడ్లు, విమానాశ్రయాలను కూడా అమ్ముకునేవాడు ప్రజలకు చౌక రవాణా ఇవ్వగలడా?
వ్యవసాయాన్ని కూడా వ్యాపారానికి ముట్టజెప్పాలనుకునేవాడు ప్రజల ఆకలి ఎలా తీర్చగలడు? చివరికి రక్షణ రంగాన్ని సైతం పెట్టుబడికి తాకట్టు పెట్టేవాడు దేశాన్ని మాత్రం ఎలా రక్షించగలడు? సమస్త ప్రకృతి వనరులతోపాటు మానవ వనరులను కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తే ఇక ప్రజల మౌలిక అవసరాలు తీర్చెదెవరు?
భారత రాజ్యాంగం ఈ దేశానికి సంక్షేమరాజ్యాన్ని వాగ్దానం చేసింది. ప్రభుత్వరంగమన్నదేలేనప్పుడు ఈ సంక్షేమానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు బాధ్యత వహించలేని ప్రభుత్వాలకు పాలించే అర్హత మాత్రం ఉంటుందా..?! దేశంలో మేడిపండు స్వాతంత్య్రమే వర్థిల్లు తోంది…! కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ దేశానికి తీరని ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడాన్ని మించిన దేశభక్తి మరొకటి లేదిప్పుడు.