(టి.లక్ష్మీనారాయణ)
1. నేటి ఆధునిక సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థే శ్రేష్టమైనది. బహుళ పార్టీలు – స్వేచ్ఛాయుత ఎన్నికలు – జవాబుదారీతనంతో పారదర్శకమైన, అవినీతిరహిత పాలన మాత్రమే సమాజాభివృద్ధికి ఉపకరిస్తుంది.
2. రాజకీయ రంగం వ్యాపారమయం అయ్యింది. నిస్వార్థ సేవ మచ్ఛుకైనా కనపడని వాతావరణం నెలకొని ఉన్నది. నిజాయితీపరుల వైపు అనుమానపు చూపులు చూసే సమాజంలో జీవిస్తున్నాం. మీకేమీ లాభం లేకుండానే రాజకీయాల్లో ఉన్నారా? అన్న ప్రశ్నను కొందరు అమాయకంగా నిస్వార్థ ప్రజాసేవకులకు కూడా స్పందిస్తూ ఉంటారు. నాకేంటి అనే స్వార్థ చింతన సమాజంలో ప్రబలింది.
3. ఎన్నికల ఫలితాలు రాగానే ప్రజలను నిందించడం పరిపాటిగా మారింది. నోటుకు ఓటును అమ్ముకొన్న వాడు నీచుడే! మరి, నోటుతో ఓటును కొన్నవాడు పరమనీచుడే కాదా!
4. సమాజ చైతన్య స్థాయి ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికార యంత్రాంగం, ఓటర్లు పాత్రధారులే! ఈ పాత్రధారుల్లో ఒకరైన ప్రజలు మాత్రమే నిజాయితీతో వ్యవహరించాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ, ప్రలోభాలను, వత్తిళ్ళను, బెదిరింపులను తట్టుకొని నిలబడే శక్తి, సాహసం చేసే భౌతిక పరిస్థితులు ఉన్నాయా! లేదా! అని కూడా కాస్తా ఆలోచించాలి.
5. తిండికిలేని వాడు దొంగతనం చేసినా దొంగే! కానీ, ఉన్నవాడు అవినీతి కొలనులో జలకాలుడుతున్నా వాడిని మాత్రం దొంగగాదనే సమాజం మనది.
6. సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు, అభద్రతాభావం, అరాచక శక్తుల పెత్తనం పెరిగాయి.
7. ప్రజలను చైతన్యపరచి, సంఘటితం చేసి, సామాజిక మార్పు కోసం కృషిచేసే శక్తుల్లో నిబద్ధత కొరవడినట్లు కనబడుతున్నది. ప్రజల నిరాధరణకు గురై బలహీనమైన స్థితికి నెట్టివేయబడ్డాయి.
8. మానవాళి ప్రయాణం ముందుకే సాగుతుంది. రాజకీయ పార్టీల నైజం, ఆలోచనలు, తాత్విక చింతన, విధానాలు మారాలి. ప్రగతిశీల శక్తులు నిబద్ధతతో సామాజిక మార్పుకు ప్రజలను సన్నద్ధులను చేయాలి.
(టి.లక్ష్మీనారాయణ, సాంఘిక రాజకీయ విశ్లేషకుడు)