తెలుగు ప్రేక్షకులకు రాజ్ కపూర్ కృతజ్ఞతలు చెప్పారు, ఎందుకో తెలుసా?

 

సినిమా స్వర్ణయుగంలో వచ్చిన ‘ప్రేమ లేఖలు’ (1953) మూవీ రివ్యూ

(సిఎస్ ఎ షరీఫ్)

సాధారణంగా ఒక భాషలో తీసిన చిత్రం విజయవంతమైతే దాన్ని ఇతర భాషల్లో (డబ్బింగు అయినా, రిమేక్ అయినా)  తీస్తారు. ఒక్కో సారి ప్రాంతీయత కారణంగా కానీ, సంస్కృతి భేదాల వల్ల కానీ మాతృక విజయవంతమైనా ఇతర భాషల్లో తీసిన చిత్రాలు విఫలమవుతాయి.

అయితే, రాజ్ కపూర్ 1953 లో తీసిన ఆహ్ హిందీ చిత్రం విషయం లో దీనికి వ్యతిరేకంగా జరిగింది. ఆహ్ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి ప్రేమలేఖలు చిత్రాన్ని రూపొందించారు. ఆహ్ హిందీ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పొందింది. దాని తెలుగు డబ్బింగు ప్రెమలేఖలు విజయవంతమైంది.

బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ (శరత్  బాబు) దేవదాసు అందరికీ తెలిసిన కథే. అక్కినేని నాగేశ్వర రావు నటించిన దేవదాసు సినిమా లో భగ్న ప్రెమికుడైన ఒక ట్రాజెడీ హీరోఅతడినుంచి దూరమై దుఖ దాయకమైన జీవితాన్ని గడిపే అతడి ప్రియురాలు, ఆమె సంఘర్షణ, బాధలూ, చివరికి ఇద్దరూ విడిపోయి వారిలో ఒకరో లేక ఇద్దరూనో మరణించడం. అప్పట్లో  ఇలాంటి కథలను ఏడుపు  దిగమింగుకుని అయినా ప్రేక్షకులు తెగ చూసే వారు. ఇదే కథతో ప్రేరణ చెంది   ఆహ్ సినిమా ను నిర్మించాడు రాజ్ కపూర్

టూకీగా ఇదీ ఆహ్ / ప్రేమలేఖలు  సినిమా కథ. 

రాజ్ (రాజ్ కపూర్) ఒక పెద్దింటి పిల్లవాడు. తన తల్లి తన పెళ్ళి విషయం లో ఒక కుటుంబానికి మాట ఇచ్చిందనీ, ఆ కుటుంబపు అమ్మాయి చంద్ర (విజయలక్ష్మి) ను పెళ్ళాడాలని అతడి తండ్రి చెబుతాడు. పెళ్ళికి ముందు ఆ అమ్మాయి తో పరిచయం పెంచుకుని ఆమె అభిరుచుల్ని తెలుసుకోవాలనుకుని రాజ్ కపూర్ ఆమెకు ఒక లేఖ రాస్తాడు. అయితే ఆ అమ్మాయి చంద్ర ఆ లేఖను పట్టించుకోకుండా, దానికి ఎదో జవాబు రాయాలి కాబట్టి, ఆ పనిని తన చెల్లెలు నీలూ (నర్గిస్) కి అప్పగిస్తుంది. నీలూ రాజ్ కి లేఖలు రాస్తూ వుంటుంది. ఈ దరిమాలా నీలూ, రాజ్ ప్రేమలో పడతారు. కొంతకాలానికి రాజ్ కు క్షయ వ్యాధి వున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని చెప్పకుండా అతడు నీలూ తో తన స్నేహితుడు డాక్టర్ కైలాష్ (ప్రాణ్) ను పెళ్ళాడమని చెబుతాడు. ఆమెను తన నుంచి దూరం చేసుకోవడానికి చంద్ర మీద ప్రేమ  వున్నట్లు నటిస్తాడు. అలా నీలూ మనసు మారేలా చేసి ఆమె వివాహం తన మిత్రుడు డాక్టర్ కైలాస్ (ప్రాణ్) తో జరిగేలా చూస్తాడు. అవసాన దశలో వున్న రాజ్ ఇంటిముందు నుంచి నీలూ పెళ్ళి ఊరేగింపు వెళుతుండగా దాన్ని చూస్తూ అతడు  ప్రాణాలు వదుల్తాడు. 

ప్రేక్షకులకు ముగింపు నచ్చలేదని మార్చారు.

అయితే ఈ చిత్రాన్ని మొదట విడుదల చేసినప్పుడు, ఈ ముగింపు ప్రేక్షకులకు నచ్చలేదని గమనించాడు రాజ్ కపూర్. 

అందుకే తరువాత, ఆ చిత్రపు ముగింపు ను ట్రాజెడీ నుంచి కామెడీ కి ఇలా మార్చాడు. 

చివర్లో తన చెల్లెలి బాధ చూడలేక చంద్ర అసలు విషయం నీలూ తో  చెబుతుంది. నీలూ, రాజ్ ను వున్న స్థితిలో నే (క్షయ వ్యాధి తో) స్వీకరించడానికి సిధ్ధపడుతుంది. ఈ లోపు రాజ్ క్షయ వ్యాధి నయమై పోతుంది. నీలూ, రాజ్ లు పెళ్ళి చేసుకుంటారు.   

ఈ మార్పుతో కథ లోని పటుత్వం సడలి పోయింది. హిందీ లో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమయింది. 

కానీ అతడి అదృష్టం బాగుండి తెలుగు లో డబ్ చేయ బడ్డ  చిత్రం ప్రేమలేఖలు ఘన విజయాన్ని సాధించింది . దీనికి చాలా మటుకు శంకర్ జైకిషన్ సంగీత దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ని పాటలే కారణం.  తెలుగు చిత్రం ప్రేమలేఖలు లోని పాటలు సూపర్ హిట్. జిక్కి పాడిన  పందిట్లో పెళ్ళవుతున్నదీ, కనువిందవు తున్నదీ, నటనమే ఆడెదనూ అనే పాట అప్పట్లో చిన్న పెద్దా తేడా  లేకుండా ప్రతి నోట్లోనూ నానింది.

 

 

తెలుగు ప్రేక్షకుల కు రాజ్ కపూర్ కృతజ్ఞత

ఆహ్ చిత్రం కమర్షియల్ గా హిందీ లో పరాజయం పొందినా, దీని డబ్బింగు ప్రేమలేఖలు చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.  ఆ చిత్రం విజయవంతమైంది. రాజ్ కపూర్ కి తెలుగు ప్రేక్షకుల మీద అభిమానం పొంగింది. ఒక కథనం ప్రకారం 1955 లో శ్రీ 420 చిత్రం తీసినప్పుడు  రాజ్ కపూర్ దానిలో  తెలుగు పదాల పల్లవితో రామయ్యా వస్తావయ్యా..  రామయ్యా వస్తావయ్యా మైనె దిల్ తుఝుకొ దియా పాట ను పెట్టి తెలుగు ప్రేక్షుకుల కు తన కృతజ్ఞత చాటుకున్నాడట

అప్పట్లో హిందీ సినిమాలో తెలుగు పదాలతో పాట  ఒక నూతనత్వం. చాలా మంది ఈ పదాల అర్థం తెలియక పోయినా, ఎన్నో సంవత్సారాల నుండి తమకు దీని అర్థం తెలుసు అనే రీతిలో ఈ పాటను పాడుకుంటూ వుంటారు. అప్పటికీ ఇప్పటికీ ఈ పాట ఒక ఐకాన్ గా నిలిచిపోయింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *