‘జాతి రత్నాలు’ కు అమెరికా సహా తెలుగు రాష్ట్రాల్లో బంపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. రెండు రోజుల్లోనే 8.7 కోట్లు కలెక్షన్స్ సాధించి ఈ వారం టాపర్ గా నిల్చింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, కొత్త హీరోయిన్ ఫరీహా అబ్దుల్లా నటించిన ఈ మైండ్ లెస్ కామెడీ ప్రేక్షకుల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వారాంతంకల్లా మరో 8 కోట్లతో బాక్సాఫీసు రన్ లో ముందుంటుందని అంచనా వేస్తున్నారు. సినిమాలో నటించిన ముగ్గురు కామెడీ ఆర్టిస్టులకీ ప్రేక్షక్కుల్లో చాలా క్రేజ్ వుంది. వీళ్ళు ప్రేక్షకుల్ని నిరాశపర్చలేదు.
ఇదే సమయంలో ‘శ్రీకారం’ వసూళ్లు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. రైతు సమస్యల మీద శర్వానంద్ నటించిన ఈ స్టార్ మూవీకి మొదటి రోజే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. మూవీ ఔట్ డెటెడ్ గా వుండడం కారణం. మొదటి రోజు 4. 01 కోట్లు, రెండో రోజు 1. 40 కోట్లు, మూడవ రోజు 1.16 కోట్లతో మొత్తం మూడురోజుల్లో 6.57 కోట్లు మాత్రమే సాధిం చగల్గింది. రోజురోజుకూ పడిపోతున్న కలెక్షన్స్ చూసి బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. శర్వానంద్ యూత్ అప్పీల్ తో వుండే సినిమాలతో రావాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోంది. మెసేజి లిచ్చే సినిమాలు యూత్ కి అవసరం లేదు.