-వడ్డేపల్లి మల్లేశము
వివిధ రాజకీయ పార్టీల ప్రచారం, నిర్మాణం, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రజాబాహుళ్యానికి మేలు జరిగే పద్ధతిలో పార్టీ నియమావళిని అనుసరించి నిర్వహించుకోవచ్చు.
రాజకీయ పార్టీలకు కొన్ని విశేషాధికారాలు ఉద్యోగులకు లేనటువంటి అవకాశాలు ఉన్న మాట వాస్తవమే. అయితే రాజకీయ పార్టీల ద్వారా ఎన్నుకోబడే ప్రజా ప్రతినిధులు కేవలం ఐదు సంవత్సరాల వరకు మాత్రమే పరిమితం అవుతారు. ఉద్యోగులు అలా కాదు పదవి విరమణ జరిగే వరకు ఉద్యోగంలో కొనసాగుతూనే ఉంటారు.
ఉద్యోగులు రాజకీయ యంత్రాంగాల మధ్యన ఈ బేదాభిప్రాయాలు వ్యత్యాసం స్పష్టంగా ఉన్నది. ఉద్యోగుల నియమావళి ప్రకారం బాహాటంగా రాజకీయపక్షాలకు మద్దతు పలకడం నిషేధం అంతేకాదు ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం కూడా చట్ట విరుద్ధం.
ఉపాధ్యాయ సంఘాలు అధికార పార్టీలు
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలు కొన్ని జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంలోనూ ప్రస్తుతము జరుగుతున్న పట్టభద్రులకు సంబంధించిన శాసనమండలి సభ్యుల ఎన్నికల సందర్భంలోనూ అధికార పార్టీ సభ్యులకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లుగా లేఖలు ఇవ్వడం పత్రికా ప్రకటనలు చేయడం న్యాయం గానూ చట్టబద్ధంగాను తగదు.
సంఘానికి సంబంధించిన లెటర్ ప్యాడ్ పైన జిహెచ్ఎంసి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సభ్యులకు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇతర సంఘాలు కూడా అలాంటి పని చేయకపోవడాన్ని ఈ సంఘాలు గుర్తుంచుకోవాలి.
ఉపాధ్యాయ సంఘాల సభ్యులు నాయకులు ప్రజలకు సంబంధించిన సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపైన చారిత్రక పురుషుల కు సంబంధించిన జయంతి వర్ధంతి లకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పేమి లేదు. అది సామాజిక బాధ్యత కూడా అవుతుంది.
కానీ ముఖ్యమంత్రి పేరు మీద మంత్రుల పేరు తోనూ లేదా తెలంగాణ జాగృతి సంస్థ నాయకురాలి జన్మదినం సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంని తమ సంఘాల మద్దతిస్తున్నట్లు ప్రకటించుకోవడం కూడా చట్టసమ్మతం కాదేమో!
సేవలు చేయడానికి ఎన్నో వేదికలు ఉన్నాయి!
ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం స్వచ్ఛంద సంస్థలో పని చేయవచ్చు. ఎందరో అలాంటి ప్రధాన బాధ్యతల్లో కూడా ఉన్నారు. కానీ రాజకీయ పక్షాలకు అధికార పార్టీకి మద్దతు పలికి మెప్పు కోసం ఆర్థిక లావాదేవీల కోసం వ్యక్తిగత అవసరాల కోసం పరిచయాలను పెంచుకోవడం కోసం అధికార పార్టీకి బాహాటంగా మద్దతు పలుకుతూ ఫోటోలు దిగడం ప్రదర్శనలు ఇవ్వడం ప్రకటనలు చేయడం వృత్తి ధర్మాన్ని తాకట్టు పెట్టినట్లు. ఉపాధ్యాయులకు ఆపని తగదు.
గత రెండు సంవత్సరాల క్రితం ఒక ఉపాధ్యాయ సంఘాన్ని సంబంధించిన నాయకుడు ఉపాధ్యాయుల ద్వారా శాసనమండలికి ఎన్నుకోబడి అధికార పార్టీ పక్షాన చేరనని ఉపాధ్యాయుల పక్షాన్ని పోరాడుతానని అనేక వేదికలపై ప్రకటించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసినటువంటి మహా సంఘటనను మనం చూసినాము.
అధికార పార్టీకి మద్దతు పలికి మెప్పు కోసం ఆర్థిక లావాదేవీల కోసం వ్యక్తిగత అవసరాల కోసం పరిచయాలను పెంచుకోవడం కోసం అధికార పార్టీకి బాహాటంగా మద్దతు పలుకుతూ ఫోటోలు దిగడం ప్రదర్శనలు ఇవ్వడం ప్రకటనలు చేయడం వృత్తి ధర్మాన్ని తాకట్టు పెట్టినట్లు. ఉపాధ్యాయులకు ఆపని తగదు.
ఉపాధ్యాయుల యొక్క వృత్తి ధర్మాన్ని ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి అధికార పార్టీ దగ్గర తాకట్టు పెట్టే ఇలాంటి శాసనమండలి సంఘ నాయకులు మనకు అవసరమా?
ఇలాంటి ఆత్మ వంచన కు పాల్పడినటువంటి సంఘములో కొనసాగుతున్న టువంటి సభ్యులు ప్రశ్నించడం ద్వారా , సంఘ నాయకత్వాన్ని ఆలోచింప చేయడం ద్వారా నిరసన తెలిపి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
దీని అంతరార్థం ఏమిటి?
పిల్లల్లో దాగి ఉన్న శారీరక మానసిక భౌతిక ఆధ్యాత్మిక శక్తులను వెలికి తీసే వాడే ఉపాధ్యాయుడు. అలాగే విద్యార్థులను తమ భావి సవాళ్లను అధిగమించే స్థాయిలో సంసిద్ధం చేసే వాడే ఉపాధ్యాయుడు.
విద్యార్థులను ఈ రకంగా తయారు చేయడం ద్వారా వ్యక్తి నిర్మాణానికి ఉపాధ్యాయులు పూనుకుంటారు ఈ క్రమంలో ప్రశ్నించడం నిరసన తెలపడం ప్రతిఘటించడం ఆలోచింప చేయడం ఉపాధ్యాయుడు విద్యార్థులకు నేర్పవలసిన ఉంటుంది.
అంటే తాత్విక ,తార్కిక, భౌతిక మానసిక రంగాలలో విద్యార్థులను నిరంతరం ప్రేరేపిస్తూ సమాయత్తం చేస్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు. మానవుడు సంఘజీవి అన్న అరిస్టాటిల్ నియమం ప్రకారం అయినా ఒక జాతి జనులను సాంఘిక నియమావళికి కట్టుబడి ఉండేలా ప్రోత్సహించవలసిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నది.
ఇంత గురుతరమైన బాధ్యత ఉన్నటువంటి ఉపాధ్యాయులు గుడ్డి నమ్మకం గా అధికార పార్టీలకు రాజకీయపక్షాలకు అమ్ముడుపోవడం వంత పాడడం మద్దతు ఇవ్వడం వాళ్ల మెప్పుకోసం ఆరాటపడడం పరిచయం కోసం అర్రులుచాచడం దేనికి సంకేతం?
అభ్యుదయ సమాజం వైపు మళ్ళించే వలసిన ఉపాధ్యాయుడు భవిష్యత్తు కోసం తయారు చేయవలసిన టువంటి ఉపాధ్యాయుడు తనే అగాధము లో కూరుకుపోతే ఎలా?
ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘ నాయకుడు ఉద్యోగులు బుద్ధిజీవులు గా మేధావులుగా సామాజిక కార్యకర్తలుగా ప్రజాసంఘాల నాయకులు గా ప్రజల కోసం మాత్రమే పని చేయాలి. ప్రజలను కష్టసుఖాలలో ఆదుకోవాలి ఇది మాత్రమే ఉద్యోగుల యొక్క నిజమైన బాధ్యత.
అధికార పార్టీకి జెండాలు మోయడం, అండగా ఉండడం, దండాలు పెట్టడం, తోరణాలు కట్టడం, పాదాభివందనం చేయడం పాలాభిషేకాలు చేయడం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు బుద్ధిజీవులు మేధావులకు ఎంత మాత్రము సబబు కాదు ఈ ఆత్మవంచన తో బతికే బదులు ఆత్మస్థైర్యంతో ని స్వతంత్రంగా బ్రతకడానికి ఇష్టపడాలి. అప్పుడే ఉపాధ్యాయులు
తరాలను తీర్చిదిద్ది ధన్యులవుతారు.
(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతం. ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్’ వాటితో ఏకీభవించనవసరం లేదు)
(ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ మొబైల్ నెం.9014206412)